నెల్లూరులో రెచ్చిపోతున్న శాండ్ మాఫియా..!
నెల్లూరు నుంచి తమిళనాడుకు ఇసుకు అక్రమంగా వెళ్లిపోతోంది. ప్రభుత్వం ఎవరిది ఉన్నా అక్రమార్కులకు అడ్డుకట్టపడటం లేదు.
ఏపీలో చాలా చోట్ల ల్యాండ్ మాఫియా రెచ్చిపోతోంది. నెల్లూరులో ల్యాండ్ మాఫియాతోపాటు శాండ్ మాఫియా కూడా ఎక్కువే. నెల్లూరులో ప్రధానంగా పెన్నా నది ఇసుక మంచి ఆదాయ వనరుగా ఉంది. ప్రభుత్వ అధీనంలో ఇసుక ఉన్నప్పుడు, గతంలో టీడీపీ హయాంలో ఉచిత ఇసుక తవ్వకాలకు అనుమతి ఉన్నప్పుడు కూడా శాండ్ మాఫియా జోరుగా సాగేది. కానీ ఇప్పుడు మరింత ముదిరిపోయింది. పొరుగున ఉన్న తమిళనాడు రాష్ట్రానికి ఇసుక అక్రమంగా రవాణా చేస్తే భారీ ఆదాయం వస్తుంది. అందుకే ఈ సులభమైన మార్గాన్ని ఎంపిక చేసుకున్నారు కొంతమంది అక్రమార్కులు.
వైసీపీ హయాంలో ఇసుకను పూర్తిగా కాంట్రాక్ట్ సంస్థలకే అప్పగించడంతో మరింత దారుణంగా ఉంది పరిస్థితి. పెన్నా పరివాహక ప్రాంతం నుంచి వేలాదిగా టిప్పర్లతో ఇసుకను తరలిస్తున్నారు. రాత్రిపూట ఇసుక తవ్వకాలపై నిషేధం ఉన్నా కూడా అక్రమ రవాణా ఆగకపోవడం విశేషం. నెల్లూరు నగరం మధ్యలో నుంచి ఇలాంటి ఇసుక లారీలు అర్థరాత్రి వెళ్తున్నా కూడా ఎవరూ పట్టించుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
నెల్లూరు జిల్లా జొన్నవాడ సమీపంలోని మినగల్లు ఇసుక రీచ్ నుంచి రాత్రిళ్లు ఇసుక అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే సామాన్యులెవరూ దీనిపై ఫిర్యాదు చేయకపోవడంతో అధికారులు కూడా చూసీ చూడనట్టు ఉంటున్నారు. పైగా దీనిలో రాజకీయ జోక్యం కూడా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక అధికారులు ఇటువైపు కన్నెత్తి కూడా చూడటంలేదు. నిత్యం వందల లారీల్లో రాత్రిపూట ఇసుక తరలి వెళ్తున్నా ఎవరూ పట్టించుకోవట్లేదని తెలుస్తోంది.
నెల్లూరు జిల్లాలో ఇసుక రీచ్ నిర్వణ బిడ్ ధర 21 కోట్ల రూపాయలు. అంత భారీ మొత్తంలో డబ్బు వెనక్కి రావాలంటే రాత్రింబవళ్లు పనులు జరగాల్సిందే. అందులోనూ ఇటీవల పెన్నమ్మకు తరచూ భారీ స్థాయిలో వరదనీరు వస్తోంది. దీంతో వరద తగ్గిన వెంటనే ఇసుకను రీచ్ ల లోకి తరలిస్తున్నారు. అక్కడినుంచి రాత్రి పగలు అనే తేడా లేకుండా టిప్పర్లలో ఇసుకను తరలిస్తున్నారు.
కొన్ని చోట్ల స్థానికులే రాత్రిపూట జరిగే ఇసుక దందాను అడ్డుకున్నట్టు తెలుస్తోంది. దీంతో అప్పటికప్పుడు లారీలను ఆపేస్తున్న కాంట్రాక్టర్లు తెల్లవారు జామునుంచే ఇసుక రవాణా తిరిగి ప్రారంభిస్తున్నట్టు తెలుస్తోంది. నెల్లూరు జిల్లాలో ముదివర్తి, నాగరాజుతోపు, మినగల్లు, పీకేపాడు రీచ్ లలో ప్రస్తుతం ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఇసుక టన్ను రూ.475కు విక్రయించాలని నిబంధనలున్నాయి. జిల్లాలోని పది ఓపెన్ రీచ్ లలో.. ప్రస్తుతం తవ్వకాలకు అనుమతిచ్చింది కేవలం 7.25 లక్షల టన్నులు మాత్రమే. మూడు నెలలుగా తవ్వకాలు జరుగుతుండటంతో ఇంతకంటే ఎక్కువగానే తరలించాలని అంటున్నారు. అనుమతులకు మించి తవ్వకాలు జరుగుతున్నా.. అధికారులు పట్టించుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
గనుల శాఖ ఏడీ శ్రీనివాసరావు ఈ వ్యవహారంపై సీరియస్ గా స్పందించారు. నిబంధనల ప్రకారం రాత్రిపూట తవ్వకాలు చేపడితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారాయన. ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్న రీచ్ లలో తనిఖీలు చేపడతామని అన్నారు. అక్రమంగా తవ్వకాలు చేపట్టినా, రాత్రిపూట తవ్వకాలు, రవాణా చేపట్టినా చర్యలు తీసుకుంటామని అన్నారు.