Nellore: భార్య గొంతు పిసికి చంపిన భర్త! సినిమా రేంజ్‌లో క్రైమ్ సీన్ క్రియేషన్ - పట్టేసిన పోలీసులు!
భార్యను హత్యచేయడమే కాకుండా పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు సినిమా సీన్ క్రియేట్ చేసి, నటన పాళ్లు కాస్త ఎక్కువ కావడంతో చివరకు దొరికిపోయాడు. భార్యను గొంతు నులిమి హత్య చేసి, తర్వాత చీరతో ఉరేశాడు.
భార్యను హత్యచేయడమే కాకుండా పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు సినిమా సీన్ క్రియేట్ చేశాడు. నటన పాళ్లు కాస్త ఎక్కువ కావడంతో చివరకు దొరికిపోయాడు ఓ దుర్మార్గుడు. భార్యను గొంతు నులిమి హత్య చేసిన భర్త, ఆ తర్వాత చీరతో ఉరేశాడు. ఆ ఉరిని తానే కోసేసినట్టు సీన్ క్రియేట్ చేశాడు. కానీ అతను అనుకున్నట్టు జరగలేదు. పోలీసులు అసలు విషయం పసిగట్టారు. చివరకు భర్త తన తప్పు ఒప్పుకున్నాడు.
మద్యం తాగేందుకు అడ్డుగా ఉన్నదని..
మద్యం తాగేందుకు భార్య అడ్డుపడుతోందన్న కారణంతో భర్త కక్ష పెంచుకున్నాడు. పదే పదే మద్యం మానేయాలంటూ ఒత్తిడి చేస్తుండటంతో సొంత భార్యనే అంతం చేశాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. నిందితుడు నెల్లూరు జిల్లా వాసి. నెల్లూరు జిల్లా వలేటివారిపాలెం మండలం, పోకూరు గ్రామానికి చెందిన ప్రవీణ్ తన భార్య ప్రియాంకతో కలసి కూలి పనుల కోసం వలస వెళ్లాడు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం చిట్కుల్ గ్రామానికి భార్యా భర్తలిద్దరూ వచ్చారు. అక్కడ నాగార్జున కాలనీకి వచ్చి బేల్దారి మేస్త్రీగా పని చేసుకుంటున్నాడు.
మద్యానికి బానిస..
ప్రవీణ్ కి విపరీతంగా మద్యం తాగే అలవాటు ఉంది. ఈ క్రమంలో భార్యను నిర్లక్ష్యం చేసేవాడు. బేల్దారి పనులకు వెళ్లొచ్చినా సగం డబ్బు మద్యానికే ఖర్చు పెట్టేవాడు. ఇంట్లో ఖర్చులకు కూడా డబ్బులిచ్చేవాడు కాదు. దీంతో భార్య ప్రియాంక అతనితో గొడవ పడేది. గతంలో ఓసారి నెల్లూరు జిల్లాలో పెద్ద మనుషుల దగ్గర పంచాయితీ కూడా జరిగింది. సంగారెడ్డికి వెళ్లినా ప్రవీణ్ ప్రవర్తనలో మార్పు రాలేదు సరికదా మద్యం తాగడం మరింత ఎక్కువైంది. దీంతో ప్రియాంక అతడిని నిలదీసేది. మద్యం తాగొద్దని చెప్పేది.
భార్య మద్యం తాగొద్దని చెబుతుండే సరికి ఆమెను అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు భర్త ప్రవీణ్. ఈ నెల 12న ఉదయం గొంతు నులిమి భార్యను హత్య చేశాడు. అయితే హత్య తర్వాత పోలీసులకు దొరికిపోతానన్న భయం అతడిని వెంటాడింది. దీంతో భార్య మరణాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించాలని ప్రయత్నించాడు. ఆమె మెడకు చీర చుట్టి ఆ చీరను ఫ్యాన్ కి వేలాడదీశాడు ప్రవీణ్. చీరను కత్తితో కోసి శవాన్ని కిందకు దించినట్టు సీన్ క్రియేట్ చేసాడు. ఇంట్లో గొడవల కారణంగా ఉరేసుకుందని నమ్మించే ప్రయత్నం చేశాడు.
పోస్ట్ మార్టం నివేదికతో..
ముందు పోలీసులు ఆత్మహత్య అని నమ్మారు. ఆ తర్వాత పోస్ట్ మార్టమ్ నివేదికలో అసలు విషయం బయటపడింది. మృతురాలి సోదరుడు హరికృష్ణ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్ట్ మార్టం తర్వాత హత్య అని తేలడంతో భర్త ప్రవీణ్ ని తమదైన శైలిలో విచారించారు. దీంతో చివరకు ప్రవీణ్ తన తప్పు ఒప్పుకున్నాడు. భార్యను తానే గొంతు నులిమి చంపేశానని చెప్పాడు. అనుమానం రాకుండా చీరతో ఉరేసినట్టు సీన్ క్రియేట్ చేశానన్నాడు. ప్రవీణ్ ని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కి తరలించారు. ప్రియాంక సొంత ఊరిలో విషాద ఛాయలు అలముకున్నాయి.