Nellore Corporation: వైసీపీకి కలసిరాని నెల్లూరు కార్పొరేషన్, గెలుపు సంబరం మూణ్ణాళ్ల ముచ్చటే
Nellore Corporation: నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో మొత్తం 54 డివిజన్లలో వైసీపీ కార్పొరేటర్లు గెలిచారు. వారిలో ఇప్పుడు పట్టుమని 10మంది కూడా వైసీపీతో లేరు. ఇప్పటివరకు 42 మంది టీడీపీలో చేరారు.
Nellore News: నెల్లూరు కార్పొరేషన్ గా ఏర్పడిన తర్వాత తొలి మేయర్ కాంగ్రెస్ పార్టీనుంచి గెలిచారు. అయితే రాష్ట్ర విభజన తర్వాతే కార్పొరేషన్ లో అసలు రాజకీయాలు మొదలయ్యాయి. 2014లో మేయర్ పీఠం వైసీపీకి దక్కింది. అప్పట్లో సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. టీడీపీ నేతలతో పోరాటం చేసి మరీ తమ అభ్యర్ధి అబ్దుల్ అజీజ్ ని గెలిపించుకున్నారు. అయితే రోజుల వ్యవధిలోనే అజీజ్ ప్లేట్ ఫిరాయించారు. అప్పటి అధికార టీడీపీలోకి వెళ్లారు. తనతోపాటు కార్పొరేటర్లను కూడా తీసుకెళ్లారు. దీంతో ఆయన టీడీపీ మేయర్ గా చెలామణి అయ్యారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక నెల్లూరు కార్పొరేషన్ కి ఎన్నికలు జరిగాయి. ఈ సారి వైసీపీ పూర్తి స్థాయి డామినేషన్ చూపించింది. మొత్తం 54 డివిజన్లలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. మేయర్ గా గిరిజన మహిళ స్రవంతికి అవకాశం లభించింది. అయినా కూడా వైసీపీని దురదృష్టం వెంటాడింది. ఇప్పుడు నెల్లూరు కార్పొరేషన్ పై టీడీపీ డామినేషన్ పూర్తి స్థాయిలో కనపడుతోంది.
నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో 54మంది కార్పొరేటర్లు వైసీపీ తరపున గెలిచారు. వారిలో ఇప్పుడు పట్టుమని 10మంది కూడా వైసీపీతో లేరు. 54 డివిజన్లలో ఇప్పటివరకు 42 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మిగతావారిలో కూడా చాలామంది గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒక కో ఆప్షన్ మెంబర్ కూడా టీడీపీలోకి వచ్చి చేరారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలో 23 మంది, రూరల్ నియోజకవర్గపరిధిలో 20 మంది కార్పొరేటర్లు అధికారికంగా టీడీపీలో చేరినట్టు తెలుస్తోంది. రూరల్ నియోజకవర్గ పరిధిలోని నేతలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో మాట్లాడుకుని టీడీపీలో చేరారు. సిటీ నియోజకవర్గ పరిధిలోని కార్పొరేటర్లు మంత్రి నారాయణను కలిశారు. వారందరూ నారా లోకేష్ సమక్షంలో టీడీపీ కండువాలు కప్పుకున్నారు.
ఇక నెల్లూరు మేయర్ స్రవంతి వ్యవహారం అటు ఇటు కాకుండా ఉంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితోపాటు ఆమె తొలుత టీడీపీలోకి వెళ్లాలనుకున్నారు. కొన్నాళ్లు రూరల్ ఎమ్మెల్యేతో కలసి ప్రెస్ మీట్లకు కూడా హాజరయ్యారు. ఆ తర్వాత నెల్లూరు రూరల్ వైసీపీ అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్ రెడ్డిని బరిలో దింపడంతో మేయర్ స్రవంతి ప్లేటు ఫిరాయించారు. తాను వైసీపీలోనే ఉన్నట్టు ప్రకటించారు. ఆ తర్వాతే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. మేయర్ భర్త జయవర్దన్ ఫోర్జరీ సంతకాల కేసులో ఇరుక్కున్నారు. దీంతో మేయర్ అటు వైసీపీలో ఉండలేక, ఇటు టీడీపీలోకి రాలేక ఇబ్బంది పడుతున్నారు. ఆ కేసులో మేయర్ భర్త అరెస్ట్ కావడంతో అసలు రెండు పార్టీలు.. ఆమెను తమ నాయకురాలిగా చెప్పుకోడానికి ఇష్టపడటం లేదు. దీంతో ఆమె పొలిటికల్ కెరీర్ క్లోజ్ అయినట్టు తెలుస్తోంది.
వరుసగా రెండుసార్లు మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నా.. వైసీపీకి ఆ సంతోషం లేదు. రెండుసార్లూ కార్పొరేషన్ తిరిగి టీడీపీ వద్దకు వచ్చి చేరింది. ఈసారి పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. నెల్లూరు జిల్లాని టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. కార్పొరేషన్లో కూడా వైసీపీ అని చెప్పుకోడానికి ఎవరూ ఇష్టపడటం లేదు. అటు పార్టీకి పెద్ద దిక్కుగా ఉండే నేతల్లో కూడా అంతర్గత విభేదాలున్నాయి. నెల్లూరు సిటీ మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కి సిటీ ఇన్ చార్జ్ పోస్ట్ తీసేశారు జగన్. ఆ పోస్ట్ ని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి ఇచ్చారు. దీంతో వైసీపీ అంతర్గత రాజకీయం వేడెక్కింది.