నెల్లూరు కోర్టు చోరీ కేసులో సీబీఐ కేసు నమోదు, దర్యాప్తులో ఏం తేలనుందో !
నెల్లూరు కోర్టు చోరీ కేసులో తాజాగా సీబీఐ కేసు నమోదు చేసింది. సీబీఐ చెన్నై విభాగం మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ కేసు నమోదు చేసింది
CBI registers a case over Theft at Nellore Court case: నెల్లూరు కోర్టు చోరీ కేసులో తాజాగా సీబీఐ కేసు నమోదు చేసింది. సీబీఐ చెన్నై విభాగం మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ కేసు నమోదు చేసింది. నెల్లూరు పట్టణంలోని ఖుద్దూస్ నగర్ కు చెందిన సయ్యద్ హయత్, ఆత్మకూరు మండలం కరటంపాడుకి చెందిన షేక్ ఖాజా రసూల్.. ఇద్దరూ ఈ కేసులో నిందితులు. ఈ కేసులో నిందితులు చోరీ చేసిన వస్తువుల వివరాలు కూడా నమోదు చేశారు. నకిలీ రబ్బరు స్టాంపులు, రౌండ్ సీళ్లు, స్టాంప్ ప్యాడ్ లు, ల్యాప్ టాప్, ట్యాబ్, పెన్ డ్రైవ్, సెల్ ఫోన్లు, నకిలీ డాక్యూమెంట్లు, క్యాసినో ఉద్యోగుల ఐడీ కార్డులు, నకిలీ టెలి ఫోన్ బిల్లులు.. చోరీకి గురయ్యాయని సీబీఐ ఎఫ్ఐఆర్ లో ప్రస్తావించినట్టు తెలుస్తోంది.
తిరిగి స్వాధీనం చేసుకున్న వస్తువుల వివరాలు..
కోర్టు చోరీ కేసులో నిందితులైన సయ్యద్ హయత్, షేక్ ఖాజా రసూల్ ను నెల్లూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ల్యాప్ టాప్, ట్యాబ్, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇద్దరి నిందితుల రిమాండు రిపోర్టుని కూడా సీబీఐ తీసుకుంది. దీనితోపాటు, ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు జారీ చేసిన తీర్పు పత్రాలను ఎఫ్‌ఐఆర్ కు జత చేశారు.
అసలు కేసేంటి..?
టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి విదేశాల్లో వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులున్నాయని అప్పట్లో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న కాకాణి గోవర్దన్ రెడ్డి ఆరోపించారు. దానికి సంబంధించి తన దగ్గర పక్కా ఆధారాలున్నాయని ఆయన ప్రకటించి ప్రెస్ మీట్ పెట్టారు. 2016లో ఈ ఘటన జరిగింది. అయితే అవి నకిలీవి, ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్లు అని అప్పటి మంత్రి సోమిరెడ్డి నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఆ కేసు విచారణ చేపట్టారు. కాకాణి నుంచి కొన్ని పత్రాలు, ఆధారాలు చూపించారని చెబుతున్న వస్తువులను పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు విచారణలో ఉండగా ఈ ఏడాది నెల్లూరు కోర్టు నుంచి ఆధారాలు చోరీకి గురయ్యాయి.
ఈ ఏడాది ఏప్రిల్ 13న కోర్టు నుంచి ఆ పత్రాలు దొంగతనానికి గురయ్యాయని కోర్టు క్లర్కు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏప్రిల్ 14న కేసు నమోదైంది. ఆ తర్వాత కథ అనేక మలుపులు తిరిగింది. సీబీఐ ఎంక్వయిరీకి టీడీపీ డిమాండ్ చేసింది. ఆ తర్వాత కేసు విచారణ సరిగా జరగడంలేదనే ఆరోపణలు కూడా వినిపించాయి. దీనిపై హైకోర్టు సుమోటోగా విచారణ జరిపి కేసుని సీబీఐకి బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. నెల్లూరు కోర్టులో చోరీ ఘటనపై నమోదైన కేసుపై సీబీఐకి నవంబరు 24న ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో మంగళవారం సీబీఐ చెన్నై బ్రాంచ్ కేసు నమోదు చేసింది, దర్యాప్తు మొదలు పెట్టింది. ఈ కేసుని సీబీఐకి అప్పగించడాన్ని మంత్రి కాకాణ కూడా స్వాగతించారు. ఇప్పుడు దర్యాప్తులో ఏం తేలుతుందో చూడాలి.