Nellore Boy Dies: నెల్లూరు జిల్లాలో ఘోరం, బాలుడి ప్రాణం తీసిన క్రికెట్ మ్యాచ్ వివాదం!
Nellore Crime News: క్రికెట్ మ్యాచ్ లో తలెత్తిన వివాదం ఓ బాలుడి ప్రాణం తీసింది. నెల్లూరు జిల్లాలో ఈ విషాదం చోటుచేసుకుంది.
Nellore Boy Dies while playing cricket: నెల్లూరు జిల్లాలో ఘోరం జరిగింది. క్షణికా వేశంలో ఓ మైనర్ బాలుడు దాడి చేయగా మరో బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. చంపుదామనే ఉద్దేశం లేకపోయినా అతడు దాడి చేయడంతో అతని స్నేహితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక క్రికెట్ గ్రౌండ్ లో ఈ ఘటన జరిగింది. చనిపోయిన బాలుడి కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
జాకీర్ హుస్సేనే నగర్ లో ఘటన..
ఈరోజు ఆదివారం కావడంతో నెల్లూరులోని జాకీర్ హుస్సేనే నగర్ లో పలువురు స్థానిక యువకులు క్రికెట్ ఆడుతున్నారు. అందులో 14 ఏళ్ల బాలుడు ఉన్నాడు. ఆపోజిట్ టీమ్ లో 16ఏళ్ల మరో బాలుడు ఉన్నాడు. వీరిద్దరి మధ్య క్రికెట్ లో స్వల్ప వివాదం చోటు చేసుకుంది. ఆ వివాదం కాస్తా చినికి చినికి గాలివానలా మారింది. క్షణికావేశంలో 16 ఏళ్ల బాలుడు 14 ఏళ్ల బాలుడిపై దాడి చేశాడు. ఒక్కసారిగా గుండెపై కొట్టడంతో అక్కడికక్కడే బాలుడు కుప్పకూలిపోయాడు. ఉలుకు పలుకు లేకుండా పడిపోయిన అతడికి మిగతా స్నేహితులు సపర్యలు చేశారు. వెంటనే స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే బాధిత బాలుడు చనిపోయాడని వైద్యులు తెలిపారు. స్నేహితుల సమాచారంతో వెంటనే చనిపోయిన బాలుడి కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చారు. తోటి బాలుడి మరణానికి కారణం అయిన మరో మైనర్ బాలుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఒంటిపై గాయాలు లేవు..
చనిపోయిన బాలుడు ఫరీద్ ఒంటిపై ఎక్కడా గాయాలు లేవు. అంటే ఘర్షణ పెద్దగా జరగలేదని తెలుస్తోంది. తగలరానిచోట పెద్దదెబ్బ తగలడంతో బాలుడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడని అంటున్నారు. గుండెపై నేరుగా తన్నడంతో చనిపోయాడు. సీఐ బాబీ ఆధ్వర్యంలో పోలీసులు క్రికెట్ ఆడే ప్రాంతానికి వచ్చారు. ఆ బాలుడి ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని, కేసు దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తామని అన్నారు సీఐ బాబీ.
గూడూరులో మరో ఘటన..
ఇదేరోజు గూడూరు రైల్వే స్టేషన్లో జరిగిన ఘటనలో ఓ మహిళ చనిపోయింది. గూడూరు రైల్వే స్టేషన్ లో గుర్తు తెలియని 60 ఏళ్ళ మహిళ రైలు కింద పడి మృతి చెందింది. విజయవాడనుండి చెన్నై వెళ్ళే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుకు గూడూరులో స్టాపింగ్ లేదు.. ఈ క్రమంలో భాగంగా అదే రైలుకింద పడి మహిళ దుర్మరణం చెందింది. మహిళ పట్టాలు దాటుతుండగా ప్రమాదం జరిగిందా, లేక ఆత్మహత్యకు పాల్పడిందా అనే వివరాలు తెలియాల్సి వుంది. మృతురాలి వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఆమె వివరాలు తెలియలేదు. రైల్వే పోలీసులు ఆమె డెడ్ బాడీని అక్కడినుంచి తరలించారు. ఆమె ఫొటోను వాట్సప్ గ్రూపుల్లో షేర్ చేస్తూ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.