Nellore Drainage Problems: వామ్మో! ఏంటీ ప్లాస్టిక్ వ్యర్థాలు- షాకైన కమిషనర్
నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, వర్షాకాలానికి తగిన విధమైన ప్రణాళికలతో సంసిద్ధంగా ఉండాలని కమిషనర్ జాహ్నవి అధికారులను ఆదేశించారు.
నెల్లూరు నగరంలో డ్రైనేజీ కాల్వల సమస్యలపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి డ్రైనేజీ కాల్వలోనే దిగి నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అసలు మిగతా డ్రైనేజీలు ఎలా ఉన్నాయి. వాటి నిర్వహణ ఎలా ఉందనే విషయం తెలుసుకునేందుకు నెల్లూరు నగర కమిషనర్ జాహ్నవి స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించేందుకు వచ్చిన ఆమె.. కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీలన్నీ ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండి ఉండటం చూసి షాకయ్యారు. ప్లాస్టిక్ వ్యర్థాలను వెంటనే తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు.
దేశవ్యాప్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని నిషేధించింది కేంద్రం. ఊరూవాడా పల్లెల్లో... దీనిపై అవగాహన కార్యక్రమాలు చేపట్టారు అధికారులు. అయితే ఇంకా కొన్నిచోట్ల ప్లాస్టిక్ వాడకం అలాగే ఉంది. అయితే సింగిల్ యూజ్ అయినా, మల్టిపుల్ యూజ్ అయినా ప్లాస్టిక్ వస్తువుల్ని ఒకసారి పారవేశారంటే వాటి వల్ల చాలా నష్టం కలుగుతుంది. నెల్లూరు నగరంలోని డ్రైనేజీ కాల్వల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు తిష్టవేసుకుపోయాయి. రానున్నది వర్షాకాలం. ఆలోగా ఈ వ్యర్థాలు అలాగే ఉంటే.. డ్రైనేజీ కాల్వలు పొంగి పొర్లడం ఖాయం. ఆ తర్వాత ఇళ్లలోకి ఆ నీరు చేరడం ఖాయం. దీంతో ముందుగానే సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు కమిషనర్ జాహ్నవి.
నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, వర్షాకాలానికి తగిన విధమైన ప్రణాళికలతో సంసిద్ధంగా ఉండాలని కమిషనర్ జాహ్నవి అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక 8వ డివిజన్ రామ్ నగర్, 10వ డివిజన్ ఏసీ నగర్ తదితర ప్రాంతాలను అధికారులతో కలిసి కమిషనర్ పారిశుధ్య నిర్వహణను పరిశీలించారు.
ప్రస్తుత వర్షాకాలాన్ని నగర ప్రజలంతా దృష్టిలో ఉంచుకుని ఎలాంటి వ్యర్ధాలను డ్రైన్లలో, కాల్వల్లో పారవేయొద్దని, ముఖ్యంగా ప్లాస్టిక్ కవర్లతో కాలువల్లో ప్రవాహం నిలిచిపోతుందని తెలిపారు కమిషనర్ జాహ్నవి. తడి, పొడి చెత్తలను విడివిడిగా సేకరించినపుడే రీసైక్లింగ్ పద్ధతి ద్వారా సేంద్రీయ ఎరువులను తయారు చేయగలమని, నగర పాలక సంస్థ చెత్త సేకరణ వాహనాలకు నగర పౌరులంతా విడివిడిగా చెత్తను అందించి సహకరించాలని కోరారు. నేరుగా ఇంటి నుంచే వ్యర్ధాలను సేకరించినపుడు వీధుల్లోని పెద్ద డస్ట్ బిన్ ల అవసరం ఉండదని తెలిపారు. డస్ట్ బిన్ ల వలన పందులు, పశువులు, కుక్కలు వంటి జంతువులకు ఆవాసం ఉండక జనావాసాల్లో వాటి సంచారంపై నియంత్రణ ఉంటుందని తెలిపారు. నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో పారిశుద్ధ్య పనులను క్రమం తప్పకుండా నిర్వహించేలా ప్రజలు కూడా స్వచ్ఛందంగా పర్యవేక్షించాలని కమిషనర్ సూచించారు. ప్రజారోగ్యానికి హానికరమైన దోమల సంతాన ఉత్పత్తిని అడ్డుకునేలా డ్రైన్లు, కాల్వలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ పూడికతీత పనులను నిర్వహించాలని అధికారులు, సిబ్బందిని కమిషనర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ అమరేంద్రనాథ్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ కర్తమ్ ప్రతాప్ రెడ్డి, సచివాలయం కార్యదర్శులు, పారిశుద్ధ్య విభాగం సిబ్బంది పాల్గొన్నారు.