(Source: Poll of Polls)
Nellore News: లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఎమ్మార్వో
నెల్లూరు జిల్లా సీతారాంపురం మండల తహశీల్దార్ కాయల సతీష్ కుమార్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. పేద రైతు వద్ద 10వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.
నెల్లూరు జిల్లా సీతారాంపురం మండల తహశీల్దార్ కాయల సతీష్ కుమార్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. పేద రైతు వద్ద 10వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని ఆయన్ను పట్టుకున్నారు. కాయల సతీష్ కుమార్ కి నగదు ఇచ్చిన తర్వాత ఆయనకు లిక్విడ్ టెస్ట్ జరిపారు. అందులో ఆయన దోషిగా తేలారు. దీంతో నగదు స్వాధీనం చేసుకుని పోలీసులు ఆయన్ని అదుపులోకీ తీసుకున్నారు.
మ్యుటేషన్ కోసం లంచం..
నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం తహశీల్దార్ కాయల సతీష్ కుమార్, అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన రైతు బొబ్బ అంకయ్య నుంచి మ్యుటేషన్ కొరకు 10వేల రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. కొన్నాళ్లుగా లంచం డబ్బు ఇవ్వకపోవడంతో పని చేయకుండా తిప్పించుకుంటున్నాడు. చివరకు విసిగి వేసారిన రైతు అంకయ్య ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల సూచనతో రైతు లంచం డబ్బుని సతీష్ కుమార్ కి ఇచ్చాడు. పథకం ప్రకారం ఏసీబీ సిబ్బంది సతీష్ కుమార్ ని ట్రాప్ చేసి పట్టుకున్నారు. ఈ దాడుల్లో ఏసీబీ డిఎస్పీ జిఆర్ఆర్ మోహన్ ,సిఐ రమేష్ బాబు, జిఎల్ శ్రీనివాస్, వేణు, కిరణ్.. ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
ఆదినుంచీ వివాదాలే..
సీతారాంపురం మండలం తహశీల్దార్ గా పనిచేస్తున్న కాయల సతీష్ కుమార్ గతంలో అల్లూరు, సైదాపురం మండలాలో తహశీల్దార్ గా పని చేశారు. అప్పుడు కూడా అతనిపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. గతంలో బుచ్చిరెడ్డిపాలెంలో సీఎస్ డీటీగా పనిచేసిన కాలంలో కూడా రైస్ మిల్లర్లతో కుమ్మక్కై అవినీతి అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. తాజాగా ఇప్పుడు రైతు వద్ద లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
ఇటీవల నెల్లూరు జిల్లాలో చేజర్ల మండలంలో కూడా అవినీతి ఆరోపణలపై తహశీల్దార్, వీఆర్వోలపై చర్యలు తీసుకున్నారు అధికారులు. అయితే రెడ్ హ్యాండెడ్ గా ఎమ్మార్వో స్థాయి అధికారి ఏసీబీకి పట్టుబడటం ఇటీవల కాలంలో ఇదే ప్రథమం.
రైతులు పాస్ బుక్కులకోసం, మ్యుటేషన్లకోసం తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిందే. సచివాలయ వ్యవస్థ వచ్చినా కూడా రైతుల కష్టాలు మాత్రం తీరడంలేదు. పాస్ బుక్కులు చేయించుకోవాలంటే.. వీఆర్వో నుంచి, ఆర్ఐ, డిప్యూటీ తహశీల్దార్, తహశీల్దార్ లకు కూడా లంచం సమర్పించుకోవాల్సిందేననే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే డబ్బుకోసం రైతుల్ని వేధిస్తే మాత్రం వారు కచ్చితంగా తిరగడబతారనడానికి ఇదే పెద్ద ఉదాహరణ. ఎమ్మార్వో స్థాయి అధికారి నేరుగా తన కార్యాలయంలోనే లంచం తీసుకుంటూ ఇలా బుక్కయ్యాడు. నెల్లూరు జిల్లాలో ఈ వ్యవహారం సంచలనంగా మారింది.
అవినీతి అధికారులు ఏసీబీకి పట్టుబడ్డా వారిపై శాఖాపరమైన చర్యలు మాత్రమే తీసుకుంటారు. ఆ తర్వాత వారు మళ్లీ తిరిగి విధుల్లో చేరతారు. ఇది మామూలు వ్యవహారంగా మారిపోయింది. దీంతో కొత్తగా లంచం తీసుకోడానికి కూడా ఎవరూ వెనకాడని పరిస్థితి ఉంది. ఇప్పుడు సీతారాంపురం ఎమ్మార్వో కూడా గతంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నా.. ఇప్పుడు రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చిక్కారు.