Mekapati Chandrasekhar to Join TDP: టికెట్ ఇవ్వకపోయినా సరే, త్వరలో టీడీపీలో చేరతా - వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి
వినాయక చవితి సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్టు కాకుండా ఉంటే ఈపాటికే టీడీపీలో చేరాల్సి ఉందని, త్వరలో తాను టీడీపీలో చేరతానని అన్నారు.
Mekapati Chandrasekhar Reddy likely to Join TDP:
వైసీపీ బహిష్కృత నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీతో టచ్ లో ఉన్నారనే విషయం తెలిసిందే. అయితే వారిలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రమే అధికారికంగా పార్టీ వ్యవహారాల్లో పాల్గొంటున్నారు. ఆయన్ను నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జ్ గా కూడా చంద్రబాబు ప్రకటించారు. మిగతా ముగ్గురు అడపాదడపా టీడీపీని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నా, టీడీపీ నాయకులకు టచ్ లో ఉన్నా కూడా కండువా మాత్రం కప్పుకోలేదు. తాజాగా నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీ కండువా కప్పుకోడానికి రెడీ అయ్యారు. త్వరలో టీడీపీలో అధికారికంగా చేరతానని ప్రకటించారాయన.
గతంలో పార్టీ జంపింగ్ లు ఉండేవి. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని అపహాస్యం చేస్తూ కొంతమంది గెలిచిన పార్టీలను వదిలేసి పక్క పార్టీలకు అనుబంధ సభ్యులుగా కొనసాగేవారు. ఆమధ్య వైసీపీకి దగ్గరైన చేరిన జనసేన, టీడీపీ ఎమ్మెల్యేలెవరూ అధికారికంగా ఆ పార్టీ కండువా కప్పుకోలేదు. తమ కుటుంబ సభ్యుల్ని మాత్రం వైసీపీలో చేర్చి, తాము అనధికారిక సభ్యులుగా చెలామణి అయ్యారు. ఫిరాయింపుల్ని ప్రోత్సహించను, పార్టీలో చేరాలంటే పదవులకు కూడా రాజీనామా చేయాల్సిందే అన్న జగన్ సూత్రాన్ని వారు తమకు నచ్చిన స్టైల్ లో ఫాలో అయ్యారు. ఇప్పుడు వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేలు కూడా అదే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి.. అందరూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీని సపోర్ట్ చేసి, వైసీపీని నష్టపరిచారు. ఆ తర్వాత పార్టీ సస్పెన్షన్ వేటు వేయడంతో టీడీపీవైపు వచ్చేశారు. కానీ అధికారికంగా టీడీపీలో ఇన్ చార్జ్ పదవి తీసుకుంది మాత్రం ఒక్క కోటంరెడ్డి మాత్రమే. ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గంలో తమ ప్రయత్నాలు చేస్తున్నారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉదయగిరిలో తాను టీడీపీ తరపున పోటీ చేస్తానంటున్నారు.
చేరిక ఎప్పుడంటే..?
వినాయక చవితి సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ స్కామ్ నుంచి నిర్దోషిగా బయటకు వస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు మేకపాటి. చంద్రబాబుకు, ప్రజలకు మేలు జరగాలని కోరుకుంటున్నానని అన్నారు. చంద్రబాబు అరెస్టు కాకుండా ఉంటే ఈపాటికే టీడీపీలో చేరాల్సి ఉందని, త్వరలో తాను టీడీపీలో చేరతానని అన్నారు.
మళ్లీ నేనే..
ఉదయగిరికి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన తనను, గ్రాఫ్ బాగాలేదని సీఎం పక్కనపెట్టారని చెప్పారు మేకపాటి. ఉదయగిరిలో వైసీపీకి తాను తప్ప ఆల్టర్నేట్ ఎవరూ లేరన్నారు. ఇప్పుడు టీడీపీలో చేరి టీడీపీ టికెట్ పై ఉదయగిరినుంచి పోటీ చేస్తానన్నారాయన. తనకు చంద్రబాబు టికెట్ ఇవ్వకపోయినా టీడీపీలోనే కొనసాగుతానన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తేనే న్యాయం, ధర్మం తిరిగి ఏపీలోకి వస్తాయన్నారు మేకపాటి.
ప్రస్తుతం వైసీపీనుంచి ఉదయగిరి ఇన్ చార్జ్ పదవి తిరిగి మేకపాటి కుటుంబానికే వచ్చింది. మేకపాటి సోదరుడు రాజగోపాల్ రెడ్డికి ఆ పదవి ఇచ్చారు. అక్కడ ఆయన గడప గడప కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అయితే ఆయన జనంలోకి వెళ్తే ఆశించిన స్పందన లేదు. ఈ ధీమాతోనే ప్రస్తుత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మరోసారి ఉదయగిరిలో తనదే విజయం అంటున్నారు.