Krishna Patnam Power Plant Problems: ఏపీ ప్రభుత్వం కావాలనే కరెంట్ కోతలు పెడుతోందా? అసలు నిజాలేంటి?
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలోని ఏపీ జెన్కో థర్మల్ పవర్ స్టేషన్లో తలెత్తిన సాంకేతిక సమస్య వల్ల ఏపీలో పలు ప్రాంతాల్లో చీకట్లు అలముకున్నాయి. బాయిలర్ ట్యూబ్ లో లీకేజీ రావడంతో కరెంటు ఉత్పత్తి నిలిచిపోయింది.
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలోని ఏపీ జెన్ కో థర్మల్ పవర్ స్టేషన్లో తలెత్తిన సాంకేతిక సమస్య వల్ల ఏపీలో పలు ప్రాంతాల్లో చీకట్లు అలముకున్నాయి. బాయిలర్ ట్యూబ్ లో లీకేజీ రావడంతో నిన్న ఉదయం నుంచి కరెంటు ఉత్పత్తి నిలిచిపోయింది. అయితే మరమ్మతుల కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అదే సమయంలో విజయవాడ వీటీపీఎస్ లో 500 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ప్లాంట్లలో సాంకేతిక సమస్య తలెత్తింది, అటు విశాఖలోని సింహాద్రి థర్మల్ ప్లాంటు నుంచి 400 మెగావాట్ల ఉత్పత్తి కూడా నిలిచిపోయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరెంటు కష్టాలు మొదలయ్యాయి. అయితే దీనికి ప్రధాన కారణం మాత్రం కృష్ణపట్నం పవర్ స్టేషనే కావడం విశేషం. ఏపీలో తగ్గిన మొత్తం 1,700 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిలో కృష్ణపట్నందే మేజర్ వాటా. కృష్ణపట్నంలోని పవర్ ప్లాంట్ లో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.
నెల్లూరు జిల్లాలో ప్రజల అవస్థలు..
నెల్లూరు జిల్లావ్యాప్తంగా కరెంటు కోత అమలవుతోంది. శుక్రవారం ఉదయం రెండు గంటలు, మరో రెండు గంటలు గ్యాప్ ఇచ్చి మళ్లీ రెండు గంటలు.. ఇలా కరెంటు కోత అమలు చేస్తున్నారు. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా ఇదే సమస్య ఉంది. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 194 మిలియన్ యూనిట్ల పైమాటే. కానీ డిమాండ్ కు తగ్గ సరఫరా లేకపోవడంతో కోతలు విధించక తప్పలేదు.
లోడ్ సర్దుబాటు కోసం గ్రామీణ ప్రాంతాల్లో గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు దఫాల వారీగా విద్యుత్తు సరఫరా ఆపేశారు అధికారులు. పట్టణాలకు సరఫరాలో అంతరాయం లేకపోయినా గ్రామాల్లో మాత్రం కోత తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో 1-2 గంటల పాటు రొటేషన్ పద్ధతిలో విద్యుత్ సరఫరా నిలిపేశారు. పరిశ్రమలు, వ్యవసాయ కనెక్షన్లకు కూడా అంతరాయం ఏర్పడింది.
మరోవైపు ఇతర రాష్ట్రాలనుంచి కరెంటు కొనాలన్నా దొరికే పరిస్థితి లేదు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఆయా ప్రాంతాల్లో కరెంటు కోత లేకుండా చేస్తున్నాయి అధికార పార్టీలు. అధిక ధరను వెచ్చించి మరీ బహిరంగ మార్కెట్లో కరెంటు కొంటున్నాయి. దీంతో ఏపీకి ఇబ్బంది ఎదురైంది. రెండురోజులపాటు, ఏపీలో సాంకేతిక సమస్యలు సమసిపోయే వరకు కరెంటు కొనాలన్నా దొరకడంలేదు. అందుకే కరెంటుకోత తప్పనిసరి అయింది.
విపక్షాల విమర్శలు..
ఇక కరెంటు కోతపై టీడీపీ విమర్శలు కలకలం రేపుతున్నాయి. ఉద్యోగుల చలో విజయవాడ ఉద్యమంపై వార్తల్ని ప్రజలు చూడకూడదనే ఉద్దేశంతోటే కరెంటు కోతలు మొదలయ్యాయని టీడీపీ ట్విట్టర్ ఖాతాలో పేర్కొనడం విశేషం. అయితే ప్రభుత్వం మాత్రం కేవలం సాంకేతిక సమస్యల వల్లే కరెంటు కష్టాలు ఎదురయ్యాయని వివరణ ఇచ్చింది.