Kotamreddy News: సోమిరెడ్డితో కోటంరెడ్డి! అన్నీ అనుకున్నట్టే జరుగుతున్నాయా?
కోటంరెడ్డి వైసీపీలో ఉండగా.. టీడీపీ నేతలపై జరిగిన కొన్ని దాడి కేసుల్లో ఆయన కూడా ముద్దాయిగా ఉన్నారు. ఈ విషయంలో టీడీపీ నుంచి కూడా కొంతమంది కోటంరెడ్డి ఎంట్రీని తట్టుకోలేకపోతున్నారు.
వైసీపీనుంచి బయటకొచ్చిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. టీడీపీ తరపున పోటీ చేస్తానని అప్పట్లోనే ప్రకటించారు. అయితే ఆయనింకా టీడీపీలో చేరలేదు, పసుపు కండువా కప్పుకోలేదు. ఈలోగా రూరల్ లో కోటంరెడ్డి వర్గీయులు, టీడీపీ కార్యకర్తల మధ్య సమన్వయం కోసం తన తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని టీడీపీలోకి పంపించారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు సమక్షంలో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి టీడీపీలో చేరారు. ఆ తర్వాత ఆయన నారా లోకేష్ యువగళం పాదయాత్రలో కూడా పాల్గొన్నారు. ఇప్పుడు గిరిధర్ రెడ్డి రూరల్ లో టీడీపీతో సమన్వయం కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. తాజాగా ఆయన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని కలిశారు. టీడీపీలో చేరిన తర్వాత నేరుగా ఆయన ఇలా నెల్లూరు జిల్లా టీడీపీ నేతల్ని కలవడం ఇదే తొలిసారి.
ముందు కేడర్, తర్వాతే లీడర్..
ముందుగా టీడీపీ కేడర్ తో కోటంరెడ్డి సోదరులు సమన్వయం చేసుకుంటున్నారు. గిరిధర్ రెడ్డి టీడీపీలో చేరిన తర్వాత ఆయన అన్న శ్రీధర్ రెడ్డి ప్రెస్ మీట్లలో కనిపించడంలేదు. ఆయన్ను పూర్తిగా టీడీపీ నేతగాన్ లెక్క వేస్తున్నారు. శ్రీధర్ రెడ్డి మాత్రం తాను రెబల్ ఎమ్మెల్యేగానే కొన్నాళ్లు ఉండాలనుకుంటున్నారు. పార్టీలతో సంబంధం లేకుండా ఆయన ఆందోళనలు, నిరసనలు ఉంటున్నాయి. ఒకవేళ పార్టీ ముద్ర పడితే, తసత్థులతో ఇబ్బంది అని ఆయన ఆలోచిస్తున్నారు. అయితే ఈలోగా ఆయన టీడీపీ కేడర్ తో సఖ్యతగా ఉంటున్నారు. అటు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కూడా టీడీపీ కేడర్ ని కలుపుకొని వెళ్తున్నారు. నెల్లూరు రూరల్ పరిధిలోకి వచ్చే డివిజన్లలో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆత్మీయ సమవేశాలు ఏర్పాటు చేస్తూ టీడీపీ నేతలు, కార్యకర్తలను కలుస్తున్నారు.
ఇటీవల చంద్రబాబు నెల్లూరు పర్యటన సందర్భంగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కూడా హడావిడి చేశారు. చంద్రబాబు, అచ్చెన్నాయుడు, ఇతర కీలక నేతల్ని కలిశారు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ కీలక నేతలతో నేరుగా గిరిధర్ రెడ్డి కలసిన సందర్భాలు లేవు. తాజాగా ఆయన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పుడు ఇరు వర్గాల మధ్య మాటల తూటాలు పేలేవి. ఇప్పుడు సోమిరెడ్డితోపాటు కోటంరెడ్డి వర్గం కూడా టీడీపీలోనే ఉండటంతో.. సఖ్యత తప్పనిసరి అయింది.
గిరిధర్ రెడ్డి రూట్ క్లియర్ చేస్తారా..?
కోటంరెడ్డి వైసీపీలో ఉండగా.. టీడీపీ నేతలపై జరిగిన కొన్ని దాడి కేసుల్లో ఆయన కూడా ముద్దాయిగా ఉన్నారు. ఆమధ్య కోటంరెడ్డి ప్రధాన అనుచరుడిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, తర్వాత ఆయన బెయిల్ పై విడుదలయ్యారు. ఈ విషయంలో టీడీపీ నుంచి కూడా కొంతమంది కోటంరెడ్డి ఎంట్రీని తట్టుకోలేకపోతున్నారు. అందుకే ఆయన సడన్ ఎంట్రీకి రెడీగా లేరు. ముందుగా టీడీపీలోకి వెళ్లిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అక్కడ అన్ని వ్యవహారాలు చక్కబెడుతున్నారు. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి టీడీపీలో ఎంట్రీ ఇచ్చి పార్టీ తరపున పోరాడే సమయానికి ఆ పార్టీలో ఎవరూ ఆయనకు వ్యతిరేక వర్గంగా ఉండకూడదనే ప్రణాళికతో కోటంరెడ్డి బ్రదర్స్ తమ వ్యూహాలను అమలులో పెట్టారు.