Kavali RTC Driver Attack Case: సినిమా స్టైల్లో రౌడీయిజం, కావలి సుధీర్ డెన్ చూసి అవాక్కయిన పోలీసులు
RTC Driver Attack Case: కావలిలో ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి ఘటనతో కీలక నిందితుడు గ్యాంగ్ లీడర్ దేవరకొండ సుధీర్‌ను శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు.
![Kavali RTC Driver Attack Case: సినిమా స్టైల్లో రౌడీయిజం, కావలి సుధీర్ డెన్ చూసి అవాక్కయిన పోలీసులు Kavali News Gang Leader Sudhir Arrested In Kavali RTC Driver Attack Case Kavali RTC Driver Attack Case: సినిమా స్టైల్లో రౌడీయిజం, కావలి సుధీర్ డెన్ చూసి అవాక్కయిన పోలీసులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/10/c2d1c6b0c35e0cfa8636466bacc1f98d1699590546698798_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Kavali RTC Driver Attack Case: సినిమాల్లో విలన్లు తెలుసుకదా ! చుట్టూ పది మంది రౌడీలు, వాళ్ల చేతిలో తుపాకులు, వారి కోసం ప్రత్యేకంగా డెన్ ఉంటుంది. అందే కాదు విలన్లు అక్కడే సెటిల్ మెంట్లు చేస్తారు. కాదంటే అంతే సంగతులు. సరిగ్గా అలాంటి సన్నివేశాన్ని తలపించేలా ఉంటుంది కావాలికి చెందిన ఓ చోటా డాన్ కథ. బంగారం, నోట్ల మార్పిడి, దాదాగిరి, సెటిల్‌మెంట్లు చేస్తూ దాడులకు పాల్పడుతున్న కావలికి చెందిన దేవరకొండ సుధీర్ (Devarakonda Sudhir) ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డాడు.
వివరాలు.. కావలిలో ఆర్టీసీ డ్రైవర్ రాంసింగ్ (RTC Driver Ram Singh)పై దాడి ఘటనతో కీలక నిందితుడు, తక్కువ ధరకే బంగారం, నోట్ల మార్పిడి తదితర నేరాలకు పాల్పడుతున్న గ్యాంగ్‌లీడర్ దేవరకొండ సుధీర్ అలియాస్ అజయ్‌రెడ్డిని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పోలీసులు (Nellore District Police) గురువారం అరెస్ట్ చేశారు. డ్రైవర్ రాంసింగ్‌పై దాడి కేసులో ఏడుగురిని అరెస్టు చేసిన పోలీసులు, సుధీర్‌తో పాటు మరికొందరి కోసం గాలింపు చేపట్టిన సంగతి తెలిసిందే. పరారీలో ఉన్న వారి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
సుధీర్ ఇంట్లో ఉన్నాడని సమాచారం అందకున్న పోలీసులు గురువారం భారీ సంఖ్యలో కావలిలోని తుపాన్ నగర్‌లోని అతడి ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. 4 వాకీటాకీలు, 2 కత్తులు, 4 ఎయిర్ పిస్తోళ్లు, 4 రౌండ్ల బుల్లెట్లు, 2 ఫోల్డింగ్ ఐరన్ స్టిక్‌లు, లీడింగ్ చైన్, 4 బేడీలు, రూ. 7 లక్షల నగదు, 2 జామర్లు, 5 ల్యాప్‌టాప్‌లు, పదుల సంఖ్యలో సెల్‌ఫోన్లు, మూడు ఖరీదైన కార్లు స్వాధీనం చేసుకున్నారు. డెన్‌లో ఉన్న వాకీటాకీలు, విలాసవంతమైన గదులు, చుట్టూ రౌడీలు, రూ.కోట్లలో లావాదేవీలు, మారణాయుధాలు, పిస్తోళ్లు, జామర్లు, అధునాతన పరికరాలు చూసి పోలీసులే అవాక్కయ్యారు.
అనుచరులే పోలీస్ వేషాల్లో
రద్దయిన నోట్లు, బంగారం కోసం నగదుతో వచ్చిన వారిని ఓ గదిలో కూర్చోబెట్టి మాట్లాడేవాడు. అంతలో అతడి గ్యాంగ్ సభ్యులే నకిలీ పోలీసుల అవతారమెత్తి దాడి చేసేవారు. నగదు సీజ్ చేసి, సుధీర్‌ను అరెస్టు చేసినట్లు నటించి తీసుకెళ్లిపోయేవారు. దాంతో బాధితులు బెదిరి పారిపోయేవారు. తర్వాత ఎవరైనా వచ్చి అడిగితే చంపేస్తామని బెదిరించేవాడు. సెల్ఫోన్లకు సిగ్నల్ రాకుండా ఉండేందుకు జామర్లు ఉపయోగించేవాడు. పక్కా ప్రణాళికతో మోసాలకు పాల్పడేవాడు.
నమ్మించి మోసం
పెద్దనోట్ల రద్దు సమయంలో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో తన మనుషులను ఏర్పాటు చేసుకుని రూ. కోటికి రూ. 75 లక్షలు ఇస్తామని ప్రచారం చేసుకున్నాడు. ఆ మాటలు నమ్మి నగదు పట్టుకుని వచ్చిన వారికి చెప్పిన మాట ప్రకారం నగదు ఇచ్చేవాడు. నమ్మకం కుదిరి కొంత మంది మరో సారి భారీ మొత్తంలో నగదు పట్టుకువస్తే పోలీసుల దాడి పేరుతో మోసం చేసేవాడు. అలాగే కేజీ బంగారం రూ. 50 లక్షల వరకు ఉండగా, రూ. 35 లక్షలకు ఇస్తామని నమ్మించేవాడు. మొదటిసారి చెప్పిన విధంగానే ఇస్తాడు. తరువాత రూ.కోట్లలో నగదు వసూలు చేసి ఎగవేసేవాడు. ఎవరైనా అడిగితే బెదిరింపులకు దిగేవాడు.
సుధీర్‌పై 25 కేసులు
నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి (SP Tirumaleswar Reddy) మీడియాకు వివరాలు వెల్లడించారు. నిందితుడిపై రాష్ట్రంలోని 10 పోలీస్ స్టేషన్‌లలో 25 కేసులున్నాయని, కావలి టూ టౌన్ పోలీసుస్టేషన్‌లో సస్పెక్టెడ్ షీటు ఉందన్నారు. నిందితుడు అనుచరులతో గ్యాంగ్‌ను ఏర్పాటు చేసి ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో తక్కువ ధరకు బంగారం, నోట్ల మార్పిడి, నకిలీ పోలీసుల అవతారంలో నేరాలు, మోసాలకు పాల్పడుతున్నాడని ఎస్పీ తెలిపారు. ఇటీవల నిందితుడి మోసాలపై పలువురు ఫిర్యాదులు చేయగా.. వాటిపై కేసులు నమోదు చేస్తున్నట్టు చెప్పారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)