Prakasam: బాలుడి కిడ్నాప్ కేసులో అసలు దొంగను గుర్తించిన పోలీసుల షాక్ అయ్యారు.. ఆ తల్లి కూడా అది నమ్మలేకపోయింది..
జల్సాలకు అలవాటు పడ్డ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. తాను చేసిన అప్పుల కోసం కన్నబిడ్డనే కిడ్నాప్ చేశాడు. డబ్బులివ్వకపోతే పిల్లాడిని చంపేస్తానని భార్యను బెదిరించాడు. ప్రకాశం జిల్లాలో ఈ విచిత్ర ఘటన జరిగింది.
సమాజంలో తండ్రి అనే స్థానానికి ఉండే ప్రాధాన్యమే వేరు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల్లో త్యాగానికి మారుపేరుగా చెప్పుకుంటారు. ఆర్థికంగా కుటుంబానికి లోటు రానివ్వకుండా నిరంతరం తాపత్రయపడుతుంటాడు. తన పిల్లలు, భార్య, తల్లిదండ్రుల బాధ్యతను భుజాలపై మోస్తూ ఎంతో శ్రమ పడుతుంటాడు. వృత్తి పరంగా ఎన్ని ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నా అవన్నీ ఇంటి వరకూ రానివ్వకుండా చూసుకుంటాడు. పిల్లలకు మంచి సౌకర్యాలు, మంచి చదువు అందించి వారి ఉన్నత స్థానానికి ఎదగాలని కలలు కంటాడు. కానీ ప్రకాశం జిల్లాలో ఓ తండ్రి మాత్రం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. పైవాటిలో దేన్నీ పట్టించుకోకుండా జల్సాలు, జూదాలకు అలవాటు పడి.. ఆఖరికి కన్న కొడుకునే కిడ్నాప్ చేసి.. డబ్బుల కోసం కట్టుకున్న భార్యనే బెదిరింపులకు దిగే స్థితికి దిగజారాడు.
ఈ కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. జల్సాలకు అలవాటు పడ్డ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. తాను చేసిన అప్పుల కోసం కన్నబిడ్డనే కిడ్నాప్ చేశాడు. డబ్బులివ్వకపోతే పిల్లాడిని చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ప్రకాశం జిల్లాలో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని కందుకూరు పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ శ్రీరామ్ విలేకరుల సమావేశంలో ఈ వివరాలను వివరించారు.
ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం చెరువుకొమ్ము పాలెం గ్రామానికి చెందిన పల్నాటి రామకృష్ణారెడ్డికి అదే గ్రామానికి చెందిన ఉమ అనే యువతితో 5 సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. వీరికి మూడేళ్ల వయసున్న కొడుకు ఉన్నాడు. రామకృష్ణా రెడ్డి హైదరాబాద్‌లోని ఓ పేరున్న సాఫ్ట్‌వేర్ సంస్థలో ఇంజినీరుగా పనిచేస్తున్నాడు. గతేడాది లాక్‌డౌన్ విధించడం వల్ల అందరిలాగే ఇంటి నుంచి పని చేస్తున్నాడు. ఈ సమయంలోనే పేకాట, తాగుడు వంటి చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు. దాదాపు రూ.20 లక్షల వరకు అప్పులు చేసేశాడు. అప్పులిచ్చిన వారు తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేయడంతో డబ్బుల కోసం కుటుంబ సభ్యులను అడిగాడు. వారు ఒప్పుకోకపోవడంతో జులై 28న కన్న కొడుకునే కిడ్నాప్ చేశాడు.
అనంతరం, బాలుడ్ని కందుకూరు పట్టణంలోని ఓ లాడ్జికి తీసుకెళ్లాడు. అదే రోజు రాత్రి మద్యం తాగి భార్యకు ఫోన్ చేశాడు. పిల్లాడ్ని అపహరించానని రూ.20 లక్షలు ఇవ్వకపోతే వాడిని చంపేసి, తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగాడు. దీంతో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి పొన్నలూరు పోలీసులను ఆశ్రయించారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ మలికా గార్గ్ స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు. తమ నెట్వర్క్ ఉపయోగించి కందుకూరులోని ఓ లాడ్జిలో రామకృష్ణా రెడ్డి ఉన్నట్టు గుర్తించి పట్టుకున్నారు. పిల్లాడిని విడిపించి తల్లికి అప్పగించారు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులు ధన్యవాదాలు తెలిపారు. నిందితుడిని వేగంగా పట్టుకొనేందుకు కీలక పాత్ర పోషించిన సీఐ శ్రీరామ్, పొన్నలూరు ఎస్సై రమేష్ బాబును డీఎస్పీ అభినందించారు. నిందితుడిని అరెస్టు చేశారు.