Nellore Crime: టీ కొట్టులో తుపాను.. నెల్లూరు హత్య కేసులో బిత్తరపోయే ట్విస్టులు..
ఒకేరోజు ఇద్దర్ని కత్తితో నరికి దారుణంగా చంపాడు, మరొకరిపై కత్తితో దాడి చేసి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడేలా చేశాడు. అందర్నీ కత్తితో నరుక్కుంటూ పోయిన నరహంతకుడు షేక్ రబ్బానీని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఒకేరోజు ఇద్దర్ని కత్తితో నరికి దారుణంగా చంపాడు, మరొకరిపై కత్తితో దాడి చేసి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడేలా చేశాడు. అంత క్రూరంగా అందర్నీ కత్తితో నరుక్కుంటూ వెళ్లిన నరహంతకుడు షేక్ రబ్బానీని పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరు జిల్లాలో ఇద్దర్ని చంపేసి, ప్రకాశం జిల్లాలో ఓ వ్యక్తిపై దాడి చేసిన రబ్బానీ ఎట్టకేలకు ఒంగోలు పోలీసులకు చిక్కాడు.
అసలేం జరిగింది..?
నెల్లూరు జిల్లా కలిగిరి మండలం పోలంపాడుకు చెందిన రబ్బానీ.. నూర్జహాన్ అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. నూర్జహాన్ కి అప్పటికే వివాహమై భర్త నుంచి విడిపోయి ఒంటరిగా ఉంటోంది. ఆమె రబ్బానికి బంధువు కూడా. ఒంగోలులోని సత్యనారాయణపురంలో ఓ ఇంటిలో ఆమెతో సహజీవనం చేస్తూ టీ దుకాణం నిర్వహించేవాడు. ఈ క్రమంలో నూర్జహాన్ కొన్నిరోజులుగా అతడిని నిర్లక్ష్యం చేస్తూ వచ్చింది. ఆ తర్వాత ఆమె నెల్లూరు జిల్లా కలిగిరి మండలం అంబటివారి పాలెం వచ్చి అక్కడ తన బంధువుల ఇంట్లో ఉంటోంది. మీరాంబీ, ఆమె కొడుకు అల్తాఫ్ తో కలసి ఉంటోంది నూర్జహాన్. ఆమెను తనకు దూరం చేస్తున్నారనే కక్షతో రబ్బానీ అంబటివారి పాలెం వచ్చాడు. మీరాంబీ, ఆమె కొడుకు అల్తాఫ్ ని కత్తితో నరికి దారుణంగా చంపేశాడు. ఆ తర్వాత నేరుగా ఒంగోలు వెళ్లి అక్కడ కాశీరావు అనే మరో వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు.
కాశీరావు కథేంటి..?
రబ్బానీ, నూర్జహాన్ అక్రమ సంబంధంలో మరో ట్విస్ట్ ఉంది. ఒంగోలులో రబ్బానీ టీ స్టాల్ లో టీ మాస్టర్‌గా చేరిన మండ్లా కాశీరావు, నూర్జహాన్ తో సన్నిహితంగా ఉండేవాడు. దీంతో వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. కొన్నాళ్ల క్రితం వారిద్దరూ కలిసి వేరే ఊరు వెళ్లిపోయారు. నూర్జహాన్ ని తనకు దూరం చేశాడన్న కారణంతో కాశీరావుపై కూడా పగ పెంచుకున్నాడు రబ్బానీ. ఈ నెల 22న నెల్లూరు జిల్లాలో ఇద్దర్ని చంపేసి, అదే రోజు ఒంగోలు వచ్చి కాశీరావుపై కూడా దాడి చేసి చంపాలని చూశాడు. కాశీరావు పై కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు. అదృష్టవశాత్తు కాశీరావు చనిపోలేదు.
ముగ్గుర్ని హతమార్చేందుకు కుట్ర..
తనది కూడా వివాహేతర సంబంధం అయినా కూడా నూర్జహాన్ అనే మహిళపై ప్రేమను పెంచుకున్న రబ్బానీ హంతకుడిగా మారాడు. ఇద్దర్ని చంపేశాడు, మరొకరిపై కత్తి దూశాడు. ఈ ఉదంతంలో నూర్జహాన్ ప్రాణాలతో బతికిపోయింది. రబ్బానీ హంతకుడిగా జైలు మెట్లెక్కబోతున్నాడు. వివాహేతర సంబంధాలు తెచ్చిన అనర్థాల్లో ఇటీవల కాలంలో ఈ హత్యోదంతం ప్రముఖంగా నిలిచిపోయింది. ఒంగోలు డీఎస్పీ ఈ కేసు వివరాలు తెలియజేశారు. నిందితుడ్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు.