Nellore heavy rains: నెల్లూరులో కుంభవృష్టి- బయటకు వెళ్లాలంటే సాహసం చేయాల్సిన పరిస్థితి
భారీ వర్షాలు నెల్లూరు జిల్లాలను అతలాకుతలం చేస్తున్నాయి. జన జీవనం స్తంభించింది. ప్రాజెక్ట్ లు నిండు కుండల్లా ఉన్నాయి. పెన్నా నదీ ప్రవాహం పెరుగుతోంది.
భారీ వర్షాలు నెల్లూరు జిల్లాలను అతలాకుతలం చేస్తున్నాయి. జన జీవనం స్తంభించింది. ప్రాజెక్ట్ లు నిండు కుండల్లా ఉన్నాయి. పెన్నా నదీ ప్రవాహం పెరుగుతోంది. నెల్లూరు నగరంలో భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వరుసగా రెండు రోజులు సెలవలు రావడంతో ప్రజలకు వర్షాలతో పెద్దగా ఇబ్బంది లేకుండా పోయింది. సోమవారం నుంచి ప్రజలు రోజువారీ పనులకు బయటకు రావడంతో ఇబ్బందులు పడుతున్నారు.
రెండు రోజులుగా నెల్లూరు జిల్లావ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెల్లూరు నగరంలో వర్షాలకు ఎక్కడికక్కడ రోడ్లు నీటమునిగాయి. నెల్లూరు నగరం మధ్య నుంచి రైల్వే లైన్ వెళ్తుంది, దీని కారణంగా వాహనాలకు అండర్ బ్రిడ్జ్ లే దిక్కు. వర్షం పడితే అండర్ బ్రిడ్జ్ ల వద్దకు నీరు చేరుతుంది. రెండురోజులుగా భారీ వర్షాలతో అండర్ బ్రిడ్జ్ ల వద్ద వాహనాలు వెళ్లే పరిస్థితి లేదు. అయినా కూడా బస్సులు, ఆటోల్లో ప్రమాదకర పరిస్థితుల్లో ప్రజలు ప్రయాణాలు చేస్తున్నారు. రైల్వే ట్రాక్ ని దాటేందుకు సాహసం చేస్తున్నారు. నెల్లూరు అండర్ బ్రిడ్జ్ ల వద్ద ఉన్న దుస్థితిని అటు అధికారులు పట్టించుకోవట్లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వర్షాలకు ప్రతిసారి ఈ సమస్య ఎదురవుతున్నా దీనికి శాశ్వత పరిష్కారం కోసం నాయకులు చొరవ తీసుకోలేదు. దీంతో ప్రయాణికులు ఇలా సాహసం చేయాల్సి వస్తోంది. నగరానికి చివర్లో ఒకే ఒక ఫ్లైఓవర్ ఉంది. నగరం మధ్యలో ఉన్న అండర్ బ్రిడ్జ్ లతోనే ఈ అవస్థలన్నీ.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనానికి రుతుపవనాలు తోడవడంతో జిల్లాలోని అన్ని మండలాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రోజంతా చినుకులు పడుతూ..భారీ వర్షం కురిసింది. దాంతో నెల్లూరు నగరంలోని పలు కాలనీలు నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరింది. రోడ్లపై నీరు నిలవడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. మురుగు కాలువల్లో నీటిపారుదల సక్రమంగా లేకపోవడంతో మురుగంతా రోడ్లపైకి మళ్లింది. అత్యవసర పనులకు బయటకు వచ్చిన జనం.. దుర్వాసన వస్తున్న నీటిలోనే తడుస్తూ రాకపోకలు సాగించారు.
భారీ వర్షానికి తోడు.. రోడ్లపైకి నీరు చేరడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ఆత్మకూరు బస్టాండ్, ముత్తుకూరు రోడ్, మాగుంట లేఅవుట్ రైల్వే అండర్ బ్రిడ్జ్ ల కింద వరదనీరు నిల్వ చేరడంతో మినీబైపాస్ నుంచి జీటీ రోడ్డులోకి వచ్చేందుకు ప్రజలు అవస్థలు పడ్డారు. మైపాడు గేటు, కొండాయపాళెం గేట్ల దగ్గర వాహనాలు బారులుదీరాయి. ట్రంకురోడ్డు, కేవీఆర్ పెట్రోల్ బంకు, గాంధీబొమ్మ కూడలి, తదితర ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిల్వడంతో వాహనాలు నెమ్మదిగా కదిలాయి.
జిల్లాలో భారీ వర్షాలు..
నెల్లూరు జిల్లాలో కావలిలో 188మిల్లీ మీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. కావలిలో పలు కాలనీలు నీటమునిగాయి. అనపగుంత పొంగడంతో వైకుంఠపురం నీట మునిగింది. ముసునూరు చెరువుకు వరదనీరు వెళ్లే కాలువలు సక్రమంగా లేకపోవడంతో రోడ్లపైకి నీరు చేరింది. 50 ఎకరాల్లో సాగుచేసిన మినుము పంటకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. మరో రెండురోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని తేలడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.