గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా? ఆ విషయంలో తప్పు చేయకండి
గోల్డ్ లోన్ పేరుతో జరిగిన ఘరానా మోసం ఇది. అసలు ఇలా కూడా కస్టమర్లను మోసం చేస్తారా అంటూ షాకయ్యే సంఘటన ఇది. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని ఓ గోల్డ్ లోన్ సంస్థలో ఈ ఘటన జరిగింది.
గోల్డ్ లోన్ పేరుతో జరిగిన ఘరానా మోసం ఇది. ఇది తెలుసుకుంటే.. అసలు ఇలా కూడా కస్టమర్లను మోసం చేస్తారా అంటూ షాకయ్యే అవకాశముంది. గోల్డ్ లోన్ పెట్టడానికి బ్యాంక్‌కి వెళ్లిన వారికి వేలిముద్రలు పడటం లేదనో, సర్వర్ బిజీగా ఉందనే కారణంతోనే మరొకరి పేరు మీద లోన్ పెట్టి మభ్యపెట్టారు బ్యాంక్ సిబ్బంది. అప్పటికప్పుడు పని జరిగింది కదా అని కస్టమర్ కూడా లోన్ డబ్బులు తీసుకుని వెళ్లిపోయాడు. తీరా అతను తిరిగి డబ్బులు కట్టడానికి వెళ్తే, సొమ్ము తీసుకున్నారు కానీ, బంగారం ఇచ్చేందుకు నిరాకరించారు. ఈ బంగారం వేరేవారి పేరుమీద తాకట్టులో ఉంది, వారు వచ్చి సంతకం పెడితేనే తిరిగి ఇస్తామంటూ షాకింగ్ న్యూస్ చెప్పారు. దీంతో కస్టమర్ లబోదిబోమంటున్నాడు. అప్పుడు బ్యాంక్ సిబ్బంది హడావిడిగా తనకి తెలియనివారి పేరుమీద లోన్ ఇప్పించారని, ఇప్పుడు అతడిని ఎక్కడి నుంచి తీసుకు రావాలంటున్నాడు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని IIFL లో గోల్డ్ లోన్ సంస్థలో ఈ ఘటన జరిగింది. గోల్డ్ లోన్ సంస్థ సిబ్బంది ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారా, లేక అప్పటికప్పుడు సర్దుబాటు కోసం వేరే వారి ఆధార్ నెంబర్ పెట్టి లోన్ ఇచ్చారా అనేది తేలాల్సి ఉంది.
గోల్డ్ లోన్ తీసుకోవాలంటే చాలామంది బ్యాంకులు, లేదా ప్రైవేట్ లోన్ ఏజెన్సీలను ఆశ్రయిస్తుంటారు. వెంకటగిరిలోని ఓ వ్యక్తి తన ఇంటికి సమీపంలో ఉన్న IIFL లో గోల్డ్ లోన్ తీసుకున్నాడు. అయితే ముందుగా మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకొని ఫోటో తీసుకొని గోల్డ్ వారి వద్ద పెట్టుకుంటారు. కానీ ఇక్కడ జరిగింది వేరు. మీ ఆధార్ ఎంటర్ కావట్లేదు సిస్టం ఎర్రర్ చూపిస్తుంది అంటూ గోల్డ్ లోన్ ఏజెన్సీ సిబ్బంది అతడికి చెప్పారు. దీంతో అతను కంగారుపడిపోయాడు. అర్జంట్ గా డబ్బు కావాలి. కానీ ఆధార్ ఎంటర్ కావడంలేదు ఎలా అని ప్రశ్నించాడు. మీకు తెలిసినవారిని తీసుకురండి అన్నారు. తనకు అర్జంట్ పని ఉందని అంత సమయం లేదని అన్నాడు. దీంతో అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఆధార్ నెంబర్ తీసుకుని అతని పేరుమీద లోన్ పెట్టారు. సమయానికి ఆదుకున్నాడంటూ అతనికి కృతజ్ఞత తెలిపాడు. అంతే కానీ అతని ఫోన్ నెంబర్ తీసుకోవడం మరచిపోయాడు బాధితుడు. సమయానికి డబ్బులు వచ్చాయి కదా అని అనుకున్నాడు.
అక్కడే మొదలైంది అసలు కథ. ఇప్పుడు బాధితుడి పేరుమీద గోల్డ్ లేదు. అంటే ఆ గోల్డ్ విడిపించుకోవాలంటే బాధితుడితోపాటు, ఆధార్ నెంబర్ ఇచ్చిన వ్యక్తి కూడా రావాలి. ఇటీవల బాధితుడు గోల్డ్ లోన్ అమౌంట్ చెల్లించడానికి IIFL ఆఫీస్ కి వెళ్లాడు. లోన్ అమౌంట్ ఎంతయింది, వడ్డీ ఎంతో కూడా చెప్పారు. తీరా అదంతా క్లియర్ చేసి బిల్ పే చేసిన తర్వాత అసలు విషయం తెలిసి షాకయ్యాడు బాధితుడు. తనకు అతనెవరో కూడా తెలియదని అతన్ని ఆరోజే చూశానని చెప్పాడు.
IIFL సిబ్బంది, ఆధార్ నెంబర్, అతని ఫోన్ నెంబర్ తీసుకుని ఫోన్ చేశారు. అతను చెన్నైలో ఉన్నానని, తనకు అర్జంట్ పని ఉందని చెప్పాడు. ఇక్కడ సిబ్బంది బాధితుడితో బేరం మొదలు పెట్టారు. అతను చెన్నై నుంచి రావాలంటే చార్జీలు భరించాల్సి ఉంటుందన్నారు, మీరెంత ఇస్తారని అడిగారు. దీంతో బాధితుడు మరోసారి షాకయ్యాడు. ఇదెక్కడి గోల అని అనుకున్నాడు. అయితే అవసరం అతనిదే కాబట్టి ఏదో ఒకటి సెటిల్ చేసుకుందామని అనుకుంటున్నాడు.
బ్యాంకుల్లో కానీ, గోల్డ్ లోన్ సంస్థల్లో కానీ బంగారం పెట్టి రుణాలు తీసుకునేటప్పుడు మన పేరుతోనే గోల్డ్ తనఖా పెట్టాలని చెబుతున్నాడు. రుణం తీసుకునేవారి పేరు విషయంలో ఎలాంటి పొరపాట్లు చేయొద్దని, తనలా మోసపోవద్దని అంటున్నాడు. ఇక్కడ లోన్ సంస్థ సిబ్బంది వ్యవహారం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. వారు కావాలనే ఇలా తనను ఇరికించారని అంటున్నాడు బాధితుడు.