Balineni Srinivasa Reddy: మాజీ మంత్రి బాలినేనికి టికెట్ లేదని ఏపీ సీఎం జగన్ చెప్పేశారా ?
నీకు సీటు లేదు. నీ భార్యకు ఇస్తామని సీఎం జగన్ అంటే నేనైనా చేసేదేం లేదు. ఈసారి మహిళలకే అవకాశాలు అని జగన్ తేల్చి చెబితే నేనైనా పోటీ నుంచి పక్కకు తప్పుకోవాల్సిందే -బాలినేని
ఆమధ్య మంత్రి పదవి తీసేసిన తర్వాత కూడా బాలినేని శ్రీనివాసులరెడ్డి కొంతకాలం అసంతృప్తితో ఉన్నారు. ఆ తర్వాత సర్దుకుపోయారు. తీరా ఇప్పుడు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తనకు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు వైసీపీ టికెట్ ఇవ్వకపోవచ్చునని అన్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మార్కెట్ యార్డు ఛైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, 2024 ఎన్నికలు - సీట్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రకాశం జిల్లానుంచి బాలినేని శ్రీనివాసులరెడ్డి, ఆదిమూలపు సురేష్ జగన్ టీమ్-ఎ లో ఉన్నారు. టీమ్-బి సమయానికి మంత్రి పదవులు తిరిగి సంపాదించిన లిస్ట్ లో ఆదిమూలపు సురేష్ ఉన్నారు కానీ బాలినేనిని తప్పించారు సీఎం జగన్. వాస్తవానికి జగన్ కి బంధువు అయిన తనను పక్కనపెడతారని బాలినేని ఊహించలేదు. అదే సమయంలో తన జిల్లానుంచి ఆదిమూలపు సురేష్ ని కొనసాగిస్తారని కూడా ఆయన అనుమానించలేదు. అందుకే అప్పట్లో అసంతృప్తితో కొన్ని వ్యాఖ్యలు చేశారు, కొంతకాలం దూరంగా ఉన్నారు. మరిప్పుడు ఆయన ఎందుకీ వ్యాఖ్యలు చేశారో తేలాల్సి ఉంది.
ఇంతకీ ఏమన్నారు..?
‘‘సీఎం జగన్ వచ్చే ఎన్నికల్లో మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పించే అవకాశాలు ఉన్నాయి. 2024 ఎన్నికల్లో నాకు టికెట్ రాకపోవచ్చు. నా భార్య సచీదేవికి జగన్ టికెట్ ఇస్తారేమో? నీకు సీటు లేదు. నీ భార్యకు ఇస్తామని సీఎం జగన్ అంటే నేనైనా చేసేదేం లేదు. ఈసారి మహిళలకే అవకాశాలు అని జగన్ తేల్చి చెబితే నేనైనా పోటీ నుంచి పక్కకు తప్పుకోవాల్సిందే. అందుకే నియోజకవర్గ స్థాయి నేతలు విభేదాలు పక్కనపెట్టి పార్టీ గెలుపు కోసం కలిసికట్టుగా పని చేయండి.’’ అని అన్నారు బాలినేని.
ఎందుకీ వ్యాఖ్యలు..
ప్రకాశం జిల్లాలోని కొండేపి నియోజకవర్గంలో 2019లో టీడీపీ గెలిచింది. ఈసారి అక్కడ కూడా వైసీపీ గెలుపుకి ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే వైసీపీ కోఆర్డినేటర్ వరికూటి అశోక్ బాబు.. పార్టీ కార్యకర్తలు, నాయకులను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై బాలినేని స్పందించారు. పార్టీ గెలుపు కోసం అందరితో కలసి నడవాలని సూచించారు బాలినేని. 2019లో ఓడిపోయాం. ఈసారి కచ్చితంగా గెలిచి తీరాలి, వైసీపీ జెండా కొండెపిపై ఎగరేయాలని అని చెప్పారు బాలినేని.
కేవలం పార్టీ నాయకులు, కార్యకర్తలకు చురుకు పుట్టించడానికే బాలినేని ఆ వ్యాఖ్యలు చేశారా, లేక ఆయనకు పార్టీ టికెట్ పై ఇప్పటికే హింట్ ఇచ్చేశారా అనేది తేలాల్సి ఉంది. ఒంగోలులో బాలినేని తన వారసుడిగా కొడుకు ప్రణీత్ రెడ్డిని ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పటికే బాలినేని వ్యవహారాలన్నీ ఆయన కొడుకు చూసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన కొత్తగా తన భార్య సచీదేవి పేరు తెరపైకి తేవడం విశేషం. అంటే బాలినేని కుటుంబంలో మొత్తం ముగ్గురు పోటీకి రెడీగా ఉన్నారని ఆయన హింటిచ్చినట్టయింది. అంటే ఈ ముగ్గురిలో ఎవరో ఒకరికి, లేదా అంతకు మించి టికెట్లు ఇవ్వాల్సి ఉంటుందని ఆయన ఇన్ డైరెక్ట్ గా చెప్పేశారా అనేది తేలాల్సి ఉంది. మొత్తమ్మీద బాలినేని వ్యాఖ్యలు జిల్లా రాజకీయాల్లోనే కాదు, ఏపీ మొత్తం సంచలనంగా మారాయి.