Nellore Police: సైబర్ నేరాలు బారిన పడకుండా ఉండాలంటే ఇవి పాటించండి - నెల్లూరు పోలీసులు
Cyber Crime In Nellore: సైబర్ నేరాల బారిన పడకుండా ఉండాలంటే ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముందు పోలీసులు ఏం చేయాలి అనే విషయాలు వివరించారు నెల్లూరు ఎస్పీ విజయరావు.
Cyber Crime: భారత్ లో సైబర్ నేరాలు ఈ మధ్యకాలంలో పెరిగిపోతున్నాయి. ప్రతి 10 మందిలో నలుగురు సైబర్ నేరాలకు బాధితులవుతున్నట్టు ఇటీవల లోకల్ సర్కిల్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. అయితే సైబర్ నేరాల బారిన పడకుండా ఉండాలంటే ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాటిపై ప్రజలకు అవగాహన కల్పించాలంటే ముందు పోలీసులు ఏం చేయాలి. క్షేత్ర స్థాయిలో పోలీసులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? ఇలాంటి విషయాలపై నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు పోలీసులకు అవగాహన కల్పించారు.
1930 హెల్ప్ లైన్ నెంబర్ పై అవగాహన..
సైబర్ నేరాలకు సంబంధించి 1930 హెల్ప్ లైన్ నెంబర్ ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని చెప్పారు జిల్లా ఎస్పీ విజయరావు. కంప్లైంట్ ఉంటే కచ్చితంగా 1930 నెంబర్ కి ఫోన్ చేయాలని, దీనిపై స్థానిక పోలీసులు విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. డయల్ 1930 కి కాల్ చేస్తే వెంటనే సైబర్ టీమ్ అలర్ట్ అవుతుందని చెప్పారు. 48 గంటల లోపు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోడానికి తగిన అవకాశం ఉంటుందని చెప్పారు.
సెక్షన్లు, శిక్షలు..
సైబర్ నేరాలకు సంబంధించి సెక్షన్లు, శిక్షలపై కూడా స్థానిక పోలీసులు అవగాహన కలిగి ఉండాలని, వాటిని ప్రజలకు వివరించాలని, బాధితులకు అవగాహన కల్పించే దిశగా చొరవ తీసుకోవాలని చెప్పారు జిల్లా ఎస్పీ విజయరావు. నేరాలు, శిక్షలు, సెక్షన్లపై కూడా వీడియో కాన్ఫరెన్స్ లో అవగాహన కల్పించారు. సైబర్ నేరాల వల్ల వ్యక్తిగతంగానే కాకుండా, ఆర్థికంగా నష్టం వాటిల్లుతుందని, అయితే మిగతా నేరాలకంటే ఇది ఎక్కువ నష్టం కలిగిస్తుందని చెప్పారు.
ప్రజలకు సూచనలు..
సైబర్ నేరాలను నివారించే క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజల చైతన్యమే నేరాల నివారణకు ఉపయోగపడుతుందన్నారు ఎస్పీ. సామాజిక మాధ్యమాల ద్వారా వ్యక్తిగత వివరాలు ఇతరులతో పంచుకోకూడదని, ఈ విషయంలో ప్రజలు అవగాహనతో ఉండాలన్నారు. బ్యాంక్ ఏటీఎం పిన్ నెంబర్లు, క్రెడిట్ కార్డ్ ల వివరాలు, ఆన్ లైన్ బ్యాంకింగ్ లో లాగిన్ ఐడీ, పాస్ వర్డ్ ల వివరాలు ఇతరులకు చెప్పకూడదని, అత్యవసర పరిస్థితుల్లో చెప్పినా, వెంటనే వాటిని మార్చుకోవాలని సూచించారు. సామాజిక మాధ్యమాల ద్వారా వ్యక్తిగత వివరాలను తెలుసుకుని గోప్యతకు భంగం కలిగే విధంగా సైబర్ నేరగాళ్లు ప్రవర్తిస్తున్నారని, అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. పరిచయం లేని వారితో సోషల్ మీడియాలో చనువుగా ఉండొద్దని, వ్యక్తిగత వివరాలు షేర్ చేయొద్దని ప్రజలకు సూచించాలన్నారు.
విద్యార్థులది కీలక పాత్ర..
సైబర్ నేరాలపై గ్రామీణ ప్రజలు, నిరక్షరాశ్యులకు అవగాహన కల్పించడం విద్యార్థుల విధి అంటున్నారు జిల్లా ఎస్పీ విజయరావు. అమాయకులకు అవగాహన పెంపొందించాలని, సాంకేతిక విద్యను అభ్యశిస్తున్న విద్యార్థులు అది తమ బాధ్యతగా భావించాలని సూచించారు. సైబర్ మిత్ర వాట్సప్ ని ఇందుకు ఉపయోగించుకోవాలన్నారు ఎస్పీ.
సైబర్ మిత్ర వాట్సప్ నెంబర్ 9121211100
లేదా cybercrime.gov.in లో లాగిన్ అయి ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. సైబర్ నేరం జరిగిన వెంటనే ఫిర్యాదు చేస్తే తగిన విధంగా చర్యలు తీసుకోవచ్చని, ఆలస్యం అయ్యేకొద్దీ, మోసం చేసినవారు జాగ్రత్తపడే అవకాశముంటుందని చెబుతున్నారు నెల్లూరు జిల్లా పోలీసులు.