PSLV C53 Count Down Starts: పీఎస్ఎల్వీ సి53 కౌంట్ డౌన్ మొదలు- రేపు సాయంత్రం నింగిలోకి మూడు ఉపగ్రహాలు
మూడు ఉపగ్రహాలను నింగిలోకి ప్రవేశ పెట్టబోతున్న పీఎస్ఎల్వీ-సి53 వాహకనౌక ప్రయోగానికి సంబంధించి కౌంట్ డౌన్ మొదలైంది. సరిగ్గా సాయంత్రం ఐదు గంటలకకు కౌంట్ డౌన్ మొదలు పెట్టారు.
మూడు ఉపగ్రహాలను నింగిలోకి ప్రవేశపెట్టబోతున్న పీఎస్ఎల్వీ-సి53 వాహకనౌక ప్రయోగానికి సంబంధించి కౌంట్ డౌన్ మొదలైంది. సరిగ్గా సాయంత్రం ఐదు గంటలకు కౌంట్‌డౌన్ మొదలు పెట్టారు. 25 గంటల సేపు ఈ కౌంట్ డౌన్ కొనసాగుతుంది. రేపు(జూన్-30) సాయంత్రం 6 గంటలకు ఉపగ్రహ వాహక నౌక నింగిలోకి దూసుకెళ్తుంది. కౌంట్ డౌన్ విజయవంతంగా ప్రారంభమైనట్టు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు.
అప్పటి నెల్లూరు జిల్లా ఇప్పటి తిరుపతి జిల్లా శ్రీహరికోట సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ-సి53 ప్రయోగానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కౌంట్‌డౌన్ కూడా మొదలైంది. రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ రాకెట్‌ని ప్రయోగించబోతున్నారు.
ప్రయోగం రేపే..
ప్రయోగానికి సంబంధించి కౌంట్ డౌన్ విజయవంతంగా మొదలైందని చెబుతున్నారు ఇస్రో డైరెక్టర్లు, శాస్త్రవేత్తలు. ఈ కార్యక్రమాన్ని వారు పర్యవేక్షించారు. మంగళవారం నిర్వహించిన పీఎస్‌ఎల్‌వీ-సి53 వాహకనౌక రిహార్సల్స్ విజయవంతమయ్యాయి. అనంతరం ప్రీ కౌంట్ డౌన్ నిర్వహించారు. ఈరోజు రాకెట్ సన్నద్ధత సమావేశం జరిగింది. అనంతరం కౌంట్ డౌన్ మొదలైంది. రేపు సాయంత్రం 6 గంటలకు పీఎస్ఎల్వీ సి-53 ప్రయోగం మొదలవుతుంది. వాహకనౌక ప్రయోగ వేదిక నుంచి బయలుదేరిన 19 నిమిషాల వ్యవధిలో సింగపూర్, కొరియాకు చెందిన ఉపగ్రహాలను కక్ష్యల్లోకి ప్రవేశపెడుతుంది. అనంతరం శాస్త్రవేత్తలు గంట తర్వాత నాలుగో దశను ప్రారంభిస్తారు. మరోసారి ఇంధనాన్ని మండించి ఆర్బిట్ మరో ఉపగ్రహాన్ని వదిలిపెడతారు.
PSLV-C53/DS-EO Mission: The launch would be streamed LIVE on ISRO website https://t.co/MX54Cx57KU or ISRO Official Youtube channel (https://t.co/1qTsZMZXU3) from 17:32 hours IST on June 30, 2022
— ISRO (@isro) June 29, 2022
మూడు ఉపగ్రహాలు నింగిలోకి
పీఎస్ఎల్వి సి-53 వాహక నౌక మూడు ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళ్తుంది. వీటిలో ఒకటి DS-EO, బరువు 365 కిలోలు. ఇంకొకటి సింగపూర్ కి చెందిన న్యూసార్. దీని బరువు 155 కిలోలు. రిపబ్లిక్ ఆఫ్ కొరియాలోని స్టారెక్ ఇనిషియేటివ్ శాస్త్రవేత్తలు నిర్మించారు. ఇక మూడో ఉపగ్రహం SCOOB-I. నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ (NTU) రూపొందించింది. దీని బరువు 2.8 కిలోలు మాత్రమే.
DS-EO ఉపగ్రహం 0.5 రిజల్యూషన్ ఇమేజింగ్ సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఇది ఒక ఎలక్ట్రో-ఆప్టిక్, మల్టీ-స్పెక్ట్రల్ పేలోడ్‌ను కలిగి ఉంటుంది. సింగపూర్‌కి చెందిన న్యూసార్ ఉపగ్రహం SAR పేలోడ్‌ను మోసుకెళ్లే మొట్టమొదటి చిన్న వాణిజ్య ఉపగ్రహం. ఈ ఉపగ్రహం పగలు, రాత్రి, అన్ని వాతావరణ పరిస్థితులలో చిత్రాలను అందించగలదు. మూడో ఉపగ్రహం SCOOB-I స్టూడెంట్ శాటిలైట్ సిరీస్ (S3-I), సింగపూర్‌లోని NTU స్కూల్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్‌లోని శాటిలైట్ రీసెర్చ్ సెంటర్ విద్యార్థులు దీన్ని తయారు చేశారు.
నాలుగు దశలలో ఈ ప్రయోగం జరుగుతుంది. 44.4 మీటర్ల పొడవు గల PSLV-C53 వాహక నౌక. DS-EO ఉపగ్రహాన్ని 570 కిలోమీటర్ల ఎత్తులో అంతరిక్షంలో ప్రవేశపెడుతుంది. ఆ తర్వాత మిగతా ఉపగ్రహాలను కూడా కక్ష్యల్లో ప్రవేశపెడుతుంది. ఇది PSLV 55వ మిషన్. PSLV-కోర్ అలోన్ వేరియంట్‌ను ఉపయోగించి చేస్తున్న 15వ మిషన్‌గా అధికారులు ప్రకటించారు. ఇక షార్ సెంటర్‌లోని రెండో లాంచింగ్ ప్యాడ్ నుంచి ప్రయోగిస్తున్న 16వ పీఎస్ఎల్వీ రాకెట్ ఇది. ఈనెల 30న సాయంత్రం ఆరు గంటలకు పీఎస్ఎల్వీ సి-53 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్తుంది.