Cm Jagan Silence : ఆ విషయంపై తేల్చకుండానే వెనుదిరిగిన సీఎం జగన్
గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఆత్మకూరు నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా గౌతమ్ భార్య శ్రీకీర్తిని ఎంపిక చేస్తారని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. కానీ ఆమెపేరుని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
మేకపాటి గౌతమ్ రెడ్డి మరణించి నెలరోజులు గడచిపోయాయి. తాజాగా ఆయన సంతాప సభలో పాల్గొనేందుకు సీఎం జగన్ నెల్లూరు వచ్చారు. వాస్తవానికి గౌతమ్ రెడ్డి అంత్యక్రియల సమయంలో జగన్ దంపతులిద్దరూ హాజరయ్యారు. వారి కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. ఇప్పుడు గౌతమ్ సంతాప సభకోసం జగన్ వస్తున్నారంటే ఏదో ప్రకటన ఉంటుందనే అనుకున్నారంతా. కేవలం సంతాప సభకోసం ఆయన రేణిగుంటకు విమానంలో వచ్చి, అక్కడినుంచి నెల్లూరుకి హెలికాప్టర్లో వచ్చి, రోడ్డు మార్గాన వీపీఆర్ కన్వెన్షన్ హాల్ కి వచ్చారు. జగన్ ఒకరోజు టూర్ ఖరారైన వెంటనే కీలకమైన రాజకీయ ప్రకటన ఉంటుందని ఊహాగానాలు వెలువడ్డాయి. కానీ జగన్ వాటన్నిటినీ పక్కనపెట్టారు. కేవలం 15నిముషాల్లోపే తన ప్రసంగం ముగించి తిరుగు ప్రయాణం అయ్యారు.
మంత్రిగా చివరి క్షణం వరకు రాష్ట్రాభివృద్ధి కోసమే గౌతమ్ శ్రమించాడు
— YSR Congress Party (@YSRCParty) March 28, 2022
- మంచి మిత్రుడిని, వ్యక్తిని కోల్పోయినందుకు బాధగా ఉంది
- గౌతమ్ పేరు చిరస్థాయిగా ఉండేలా సంగం బ్యారేజీకి మేకపాటి గౌతమ్ సంగం బ్యారేజీగా నామకరణంhttps://t.co/9ROh7IF7kw
మేకపాటి కుటుంబానికే.. కానీ..!
గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఆత్మకూరు నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా గౌతమ్ భార్య శ్రీకీర్తిని ఎంపిక చేస్తారని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. గౌతమ్ రెడ్డి సోదరులు రాజకీయాలపై ఆసక్తిగా లేరని, రాజమోహన్ రెడ్డి వయోభారం రీత్యా ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగలేరని, అందుకే గౌతమ్ సతీమణికి ఆ అవకాశం ఇస్తారని అనుకుంటున్నారు. కానీ ఆమెపేరుని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. సంతాప సభలో రాజకీయాలెందుకనుకున్నారో లేక, సమయం దగ్గరపడలేదనుకున్నారో కానీ జగన్ నుంచి ఎలాంటి ప్రకటనా వెలువడలేదు.
ప్రతి అడుగులోనూ గౌతమ్ నాకు తోడుగా ఉన్నాడు. #CMYSJagan #Mekapati pic.twitter.com/S9goJZPc0d
— YSR Congress Party (@YSRCParty) March 28, 2022
సంతాప సభ కోసం తరలి వచ్చిన ఆత్మకూరు నియోజకవర్గ నాయకులు.. సభ అనంతరం గౌతమ్ రెడ్డి సతీమణి శ్రీ కీర్తిని కలిశారు. వారందరితో మాట్లాడుతూ, మహిళా నాయకులతో కలివిడిగా ఉన్నారు శ్రీ కీర్తి. స్టేజ్ కింద ఆ సన్నివేశం చూసిన వారంతా ఆమెను భవిష్యత్ నాయకురాలిగా పేర్కొంటున్నారు. సంతాప సభలో గౌతమ్ రెడ్డి సోదరుల హడావిడి కూడా లేదు. కేవలం గౌతమ్ రెడ్డి తండ్రి రాజమోహన్ రెడ్డి, గౌతమ్ తల్లి మణి మంజరి, భార్య శ్రీకీర్తి మాత్రమే.. స్టేజ్ పై ఉన్నారు.
ఎన్నికల హడావిడి ఉంటుందా..?
ఆత్మకూరు నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరిగితే ప్రతిపక్షాలు పోటీకి దిగుతాయా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో దివంగత నేత కుటుంబ సభ్యులకు టికెట్ ఇవ్వలేదన్న కారణంగా టీడీపీ బరిలో దిగింది. అదే బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నికల విషయానికొస్తే దివంగత ఎమ్మెల్యే సతీమణికి వైసీపీ టికెట్ ఇవ్వడంతో టీడీపీ పోటీనుంచి తప్పుకుంది, కానీ బీజేపీ మాత్రం అక్కడ పోటీ చేసి ఓడిపోయింది. మరి ఆత్మకూరు సంగతేంటి..? ప్రస్తుతానికి అన్ని పార్టీలు గౌతమ్ రెడ్డి అజాత శత్రువని, అందరి బంధువను కొనియాడుతున్నాయి. రేపు ఎన్నికల సమయంలో మేకపాటి కుటుంబానికే టికెట్ ఇస్తే.. వైరి వర్గాలు పోటీకి దిగకుండా ఉంటాయా..? లేక ఆ సమయానికి అభ్యర్థిని ప్రకటించి ఏకగ్రీవం లేకుండా బ్యాలెట్ వార్ కి సిద్ధమవుతాయా అనేది తేలాల్సి ఉంది.