టీడీపీ ఆఫీస్‌లో జగన్ కోసం కేక్ కటింగ్
గంజాయి సాగులో ఏపీ, దేశంలోనే నెంబర్-1 స్థానంలో నిలిచిందని, దానికి కారణం సీఎం జగన్ అంటూ సెటైర్లు పేల్చారు టీడీపీ నేతలు. జగన్ వల్లే ఏపీకి ఈ ఘనత వచ్చిందని చెబుతూ కేక్ కటింగ్ చేసి విమర్శలు గుప్పించారు.
నెల్లూరు జిల్లా టీడీపీ ఆఫీస్ లో జగన్ కోసం కేక్ కటింగ్ జరిగింది. అదేంటి జగన్ కి పాలాభిషేకాలు, కేక్ కటింగ్ ఇలాంటివి వైసీపీ ఆఫీస్ లో జరగాలి కదా అనుకుంటున్నారా.. కానీ ఇక్కడ వెరైటీగా టీడీపీ నేతలు ఆ బాధ్యత తీసుకున్నారు. ఏపీని నెంబర్-1 స్థానంలో నిలిపినందుకు కృతజ్ఞతగా కేక్ కట్ చేసి జగన్ చిత్రపటానికి తినిపించే ప్రయత్నం చేశారు. ఇంతకీ ఈ నెంబర్-1 స్థానం ఎందులో అనుకుంటున్నారా..? గంజాయి సాగులో. అవును గంజాయి సాగులో ఏపీ, దేశంలోనే నెంబర్-1 స్థానంలో నిలిచిందని, దానికి కారణం సీఎం జగన్ అంటూ సెటైర్లు పేల్చారు టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి. జగన్ వల్లే ఏపీకి ఈ ఘనత వచ్చిందని చెబుతూ కేక్ కటింగ్ చేసి విమర్శలు గుప్పించారు. గాంజా ఫస్ట్ ర్యాంకర్ జగన్ కి శుభాకాంక్షలు అంటూ కేకు కట్ చేశారు.
జగన్ పై ఘాటు విమర్శలు..
టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి, గతంలో కూడా జగన్ పై ఘాటు విమర్శలు చేశారు. తాజాగా ఆయన మరోసారి సీఎం జగన్ పై విమర్శలతో విరుచుకుపడ్డాపు. టెన్త్ క్లాస్ పాస్ కాకపోయినా రాష్ట్రాన్ని గంజాయి సాగులో నెంబర్-1 గా చేసిన ఘనత జగన్ కే దక్కుతుందని అన్నారు వెంకట రమణారెడ్డి. పట్టుబడుతున్న గంజాయిపై ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని, కానీ అదే సమయంలో ఏపీ గంజాయి సాగుకి కేంద్రంగా మారిందనే వాస్తవాన్ని కూడా ప్రభుత్వం పరోక్షంగా ఒప్పుకున్నట్టేనని అన్నారు ఏవీఆర్.
జగన్ కాదు..
ఇటీవల జగన్ ని జ-గన్ అంటూ మంత్రి రోజా సంబోధించడాన్ని కూడా వెటకారం చేశారు ఆనం వెంకట రమణారెడ్డి. ఆయన జగన్ కాదని, గన్-జ అని గన్జాయి సాగులో ఏపీని నెంబర్ గా తీర్చిదిద్దారని మండిపడ్డారు. ఇన్నాళ్లూ రోజా జ-గన్ అంటుంటే తామేదో పొరపాటు పడ్డామని, కానీ అసలు విషయం ఇప్పుడు తెలిసిందని అన్నారు.
విశాఖ అందుకేనా....?
ఏపీకి విశాఖను పరిపాలనా రాజధాని చేస్తామంటూ జగన్ చెబుతుంటే అందరం ఏదో అనుకున్నామని, రిషికొండకోసమో, లేక మద్యం మాఫియా కోసమో పొరబడ్డామని కానీ, గంజాయి సాగు కోసం జగన్ విశాఖను పరిపాలనా రాజధాని చేసుకుంటున్నాడని మండిపడ్డారు.
175కాదు.. అంతకు మించి..
గంజాయి వ్యాపారంలో 3లక్షల కోట్ల రూపాయలు జగన్ వెనకేసుకున్నారని, ఆ సొమ్ము ఉందనే ధైర్యంతోనే ఆయన ఏపీలో 175 స్థానాల్లో విజయం సాధిస్తామని చెబుతున్నారని, ఆ డబ్బు ఉంటే 175 స్థానాలు ఏం ఖర్మ.. దక్షిణ భారత్ లో అన్ని స్థానాల్లో పోటీ చేసి గెలవచ్చని సెటైర్లు వేశారు.
మొత్తమ్మీద టీడీపీ ఆఫీస్ లో జగన్ కోసం కేట్ కటింగ్ చేయడం, సంబరాలు చేసుకోవడం సంచలనంగా మారింది. గంజాయి సాగులో ఏపీని నెంబర్-1 స్థానంలో నిలిపారంటూ వెటకారంగా ఈ ప్రోగ్రామ్ చేపట్టారు టీడీపీ నాయకులు. ఇన్నాళ్లూ మాటలతోనే వైసీపీ నేతలపై విరుచుకుపడే ఏవీఆర్.. ఇప్పుడు చేతల్లోకి వచ్చారు. కేక్ కటింగ్ చేసి ఓ రేంజ్ లో సెటైర్ పేల్చారు. ముందు ముందు టీడీపీ ఆఫీస్ లో జగన్ కి పాలాభిషేకాలు జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు.