బాబు, పవన్ ఏపీ రాహుకేతువులు- 10 పంటలు చూపిస్తే ఐదింటిని గుర్తించలేరు: కాకాణి గోవర్థన్‌రెడ్డి
చంద్రబాబు, పవన్ కల్యాణ్ రాష్ట్రాన్ని రాహు కేతువుల్లాగా పట్టుకుని ఉన్నారని మండిపడ్డారు మంత్రి కాకాణి. పవన్ కల్యాణ్ బుడబుక్కల వేషం వేసుకుని వస్తారని, ఆయనకు అసలు వ్యవసాయం గురించి ఏం తెలుసని ప్రశ్నించారు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్ రాష్ట్రాన్ని రాహు కేతువుల్లాగా పట్టుకుని ఉన్నారని మండిపడ్డారు వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి. పవన్ కల్యాణ్ రెండు మూడురోజులకోసారి బుడబుక్కల వేషం వేసుకుని వస్తారని, ఆయనకు అసలు వ్యవసాయం గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. కౌలు, రైతులు, వ్యవసాయ విధానం అంటే ఏంటో పవన్ కల్యాణ్ కి తెలుసా అని ప్రశ్నించారు. 10 పంటలు చూపిస్తే 5 పంటల్ని గుర్తు పట్టలేని పవన్ కల్యాణ్ కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తారా.. అని ఎద్దేవా చేశారు.
వట్టి బటన్ నొక్కేశారంటూ అబద్ధాలు..
సీఎం జగన్ వట్టొట్టి బటన్ నొక్కారని ఇటీవల రైతు భరోసా గురించి పత్రికల్లో కథనాలు వచ్చాయని మండిపడ్డారు కాకాణి గోవర్దన్ రెడ్డి. 98.5 శాతం మంది రైతులకు రైతు భరోసా పడిందని, కేవలం ఒకటిన్నర శాతం మందికి మాత్రమే పడలేదని అదే పత్రికలో రాశారని ఒకటిన్నర శాతం మందికి పడకపోతే ఉత్తి బటన్ నొక్కారని ఎలా రాస్తారంటూ ప్రశ్నించారు. కేవలం ప్రభుత్వంపై బురదజల్లడానికి, రైతుల్ని రెచ్చగొట్టడానికి పత్రికలు దిగజారిపోయాయని అన్నారు. రామోజీరావు లాంటి వ్యక్తి కూడా ఇలాంటి తప్పుడు కథనాలను తన పత్రికల్లో రాయించడం సరికాదని చెప్పారు. పత్రికలు విలువలను కాపాడుకోవాలన్నారు.
జగన్ ని లక్ష్యంగా చేసుకుని ఆయా పత్రికల్లో కథనాలు వస్తున్నాయని, వారి అజెండా ఒకటేనని, వారు కేవలం చంద్రబాబుని కుర్చీ ఎక్కించడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు కాకాణి. అలాంటి పత్రికల్లో వచ్చిన తప్పుడు కథనాలను ప్రజలు నమ్మబోరని, రైతులకు ప్రభుత్వం కమిట్ మెంట్ తెలుసని చెప్పారు. రైతుల విషయంలో పచ్చ పత్రికలు తప్పుడు కథనాలతో తిమ్మిని బమ్మిని చేయాలని ప్రయత్నిస్తున్నాయని అన్నారు. ఒకరికి భజన చేస్తూ, మరొకరిని విమర్శిస్తూ పనిచేయడం పాత్రికేయం కాదని చెప్పారు.
వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రతి ఏడాదీ 14లక్షల టన్నుల ధాన్యం అధికంగా ఉత్పత్తి అవుతోందన్నారు కాకాణి. చంద్రబాబు హయాంలో నీరు లేక ప్రజలు అల్లాడిపోయారని, జగన్ హయాంలో ప్రకృతి కూడా తమకు సహకరిస్తోందని, సోమశిల బ్యారేజ్, సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్.. అన్నీ నీటితో కళకళలాడుతున్నాయని చెప్పారు. నెల్లూరు, సంగం బ్యారేజ్ ల క్రెడిట్ వైసీపీదేనని చెప్పారు. టీడీపీ హయాంలో అవి 90శాతం పూర్తయిందని చెప్పుకోవడం టీడీపీ దౌర్భాగ్యం అని చెప్పారు. ఎవరు ఎంత పని చేసినా, వాటిని పూర్తి చేసి, రైతులకు నీళ్లిచ్చిన ఘనత వైసీపీదని చెప్పారు.
టీడీపీకి ఉన్నదల్లా స్వార్థ ప్రయోజనాలు, స్వప్రయోజనాలని మండిపడ్డారు కాకాణి. వాస్తవాలను వక్రీకరించి మీడియా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తోందన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే మళ్లీ మీడియా ఆగడాలు పెరిగిపోతాయని, చంద్రబాబుని అడ్డు పెట్టుకుని సంపాదించుకోవాలని చూస్తున్నారని చెప్పారు. టీడీపీ వాళ్లు ప్రెస్ మీట్ పెడితే వాటిని నిజాలుగా భ్రమింపజేసేలా ఈనాడులో వార్తలొస్తున్నాయని చెప్పారు. ఒకవేళ టీడీపీవాళ్లు ప్రెస్ మీట్ పెట్టకపోతే పత్రికల వాళ్లే ప్రతిపక్షాల్లాగా ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తూ కథనాలిస్తున్నాయని అన్నారు. నారా లోకేష్ కూడా రైతుల గురించి, పంటల గురించి మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు కాకాణి.