Balineni: నియోజకవర్గం మారను, పార్టీ కూడా మారను- మాజీ మంత్రి బాలినేని కీలక వ్యాఖ్యలు
YSRCP News: ప్రకాశం జిల్లాలో కూడా ఇప్పటికే పలు ప్రయోగాలు చేశారు సీఎం జగన్. మరి బాలినేని విషయంలో జగన్ నిర్ణయం ఫైనల్ అవుతుందా..? బంధువు అయినందుకు బాలినేనికే జగన్ ఆప్షన్ ఇస్తారా అనేది వేచి చూడాలి.
Balineni Politics: ఏపీ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఆ పార్టీలో ఎవరు, ఈ పార్టీలో ఎవరు, గోడమీద ఎవరు అనే విషయం ఎవరికీ అంతుచిక్కకుండా ఉంది. టీడీపీ పరిస్థితి కాస్త కుదురుగా ఉన్నా.. వైసీపీ (YSRCP) నుంచి మాత్రం జంపింగ్ వీరులు వీరలెవల్లో ఎగిరి దూకుతున్నారు. అంబటి రాయుడు వంటి వారు సడన్ షాక్ లిస్తున్నారు. ఈ దశలో కొంతమంది తమ పాతివ్రత్యాన్ని నిరూపించుకోడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రకాశం జిల్లా కీలక నేత, వైసీపీలో ఇటీవల రెబల్ గా ముద్రపడిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి (Balineni Srinivasa Reddy) కూడా కొత్త స్టేట్ మెంట్ ఇచ్చారు. తాను నియోజకవర్గం మారబోనని, పార్టీ మారే ప్రసక్తే లేదని
తేల్చి చెప్పారు.
సడన్ గా ఎందుకీ స్టేట్ మెంట్స్..
ఇటీవల బాలినేనిపై పార్టీ అధిష్టానం సీరియస్ గా ఉందనే వార్తలొచ్చాయి. మంత్రి పదవి పోయినప్పటినుంచి పార్టీతో అంటీముట్టనట్టుగానే ఉన్నారు బాలినేని. లోకల్ పాలిటిక్స్ కూడా ఆయనకు తలనొప్పిగా మారాయి. ఒంగోలు నకిలీ రిజిస్ట్రేషన్ల కుంభకోణంలో బాలినేని అనుచరులు అరెస్ట్ కావడం మరో సంచలనం. ఆ తర్వాత ఆయన రాజకీయ వ్యాఖ్యలు కూడా వైసీపీలో కలకలం రేపాయి. అయితే ఇటీవల మళ్లీ ఆయన సర్దుకుపోయినట్టు తెలుస్తోంది. అంతా బాగుంది అనుకున్న వేళ, హైదరాబాద్ లో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డితో బాలినేని భేటీ మళ్లీ సంచలనంగా మారింది. ఇద్దరూ కలసి ఎలాంటి మంత్రాంగం రచించారనే వార్తలొచ్చాయి. దీంతో సడన్ గా బాలినేని తెరపైకి వచ్చారు. తాను పార్టీ మారడం లేదని స్టేట్ మెంట్ ఇచ్చారు.
సెల్ఫ్ డిక్లరేషన్..
వచ్చే ఎన్నికల్లో తాను వైసీపీనుంచే పోటీ చేస్తానని చెప్పారు బాలినేని. అంతవరకు బాగానే ఉంది కానీ నియోజకవర్గాన్ని కూడా ఆయన ఫైనల్ చేసుకోవడం విశేషం. తాను ఒంగోలు నుంచే పోటీ చేస్తానని చెబుతున్నారాయన. వాస్తవానికి బాలినేనిని గిద్దలూరు నియోజకవర్గానికి పంపించే అవకాశం ఉందనే వార్తలొస్తున్నాయి. ఈ దశలో ఆయన నియోజకవర్గాన్ని కూడా కన్ఫామ్ చేసుకున్నట్టుగా స్టేట్ మెంట్ ఇచ్చారు. వచ్చేసారి తాను వైసీపీనుంచి ఒంగోలు అభ్యర్థిగా బరిలో ఉంటానని స్టేట్ మెంట్ ఇచ్చారు బాలినేని.
పార్టీ మారను..
ఇక పార్టీ మారే ప్రసక్తి కూడా లేదని కుండబద్దలు కొట్టారు బాలినేని. తాను టీడీపీ నేతలతో టచ్ లో ఉన్నానన్నది అవాస్తవమని చెప్పారు. రాజకీయాల్లో ఉన్నంత వరకూ సీఎం జగన్ తోనే ఉంటానని స్పష్టం చేశారు. ప్రతీ ఒక్కరూ పార్టీకి, సీఎం జగన్ కు అండగా ఉండాల్సిన సమయం ఇది అని చెబుతున్నారు బాలినేని. ఎంపీ మాగుంట విషయాన్ని కూడా సీఎం జగన్ తో తాను మాట్లాడతానన్నారు.
మొత్తమ్మీద బాలినేని మరోసారి కీలక వ్యాఖ్యలు చేయడం విశేషం. తనకు తానే నియోజకవర్గాన్ని ఆయన ప్రకటించేసుకోవడంతో ఆయన అభిమానులు సంబరపడుతున్నారు. అయితే అధిష్టానం కూడా దీనిపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అసలే నియోజకవర్గాల ఇన్ చార్జ్ లను మార్చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ప్రయోగాలు చేస్తున్నారు సీఎం జగన్. ప్రకాశం జిల్లాలో కూడా ఇప్పటికే పలు ప్రయోగాలు చేశారు. మరి బాలినేని విషయంలో జగన్ నిర్ణయం ఫైనల్ అవుతుందా..? బంధువు అయినందుకు బాలినేనికే జగన్ ఆప్షన్ ఇస్తారా అనేది వేచి చూడాలి.