Sai Chand Padayatra: పొట్టి శ్రీరాములుకి భారత రత్న ఇవ్వాలి - నటుడు సాయిచంద్, ముగిసిన పాదయాత్ర
పొట్టి శ్రీరాములుకి భారత రత్న ఇవ్వాలన్నారు సాయిచంద్. తెలుగు రాష్ట్ర అవతరణకోసం ఆయన చేసిన పోరాటం, ఆయన పట్టుదల, ఆయన ప్రాణ త్యాగం గురించి భావి తరాలకు తెలియజేయాలన్న పట్టుదలతోనే తాను ఈ యాత్ర చేపట్టానన్నారు.
అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయ సాధనకోసం కాలి నడక యాత్ర మొదలు పెట్టిన సినీ నటుడు సాయిచంద్.. ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం పడమటిపల్లెకు చేరుకున్నారు. అక్కడ ఆయన తన యాత్రను ఆపేశారు. పొట్టి శ్రీరాములు పుట్టిన ఇంటిలో ఆయన కాసేపు ఉన్నారు. ఆ ఇల్లు ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుంది. దాన్ని పట్టించుకునేవారెవరూ లేరు. కనీసం సాయిచంద్ వస్తున్నాడని తెలిసినా కూడా ఎవరూ దానికి పూనుకోలేదు. దీంతో శిథిలాల ముందే ఆయన కాసేపు మౌనం పాటించి అక్కడినుంచి నిష్క్రమించారు.
మైలాపూర్ నుంచి పడమటి పల్లె వరకు..
సాయిచంద్ పాదయాత్ర చెన్నైలోని మైలాపూర్ లో మొదలైంది. ఈనెల 15న కాలి నడక యాత్ర మొదలు పెట్టిన ఆయన 24న దాన్ని ముగించారు. అమరజీవి పట్టుదల ఆయన ప్రాణత్యాగం గురించి నేటి తరానికి తెలియజెప్పడానికంటూ యాత్ర మొదలు పెట్టారు సాయిచంద్. త్రిపురనేని రామస్వామి మనవడే ఈ సాయిచంద్, ప్రఖ్యాత రచయిత త్రిపురనేని గోపీచంద్ కి సాయిచంద్ కుమారుడు. సినీ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయనకు గొప్ప సామాజిక, సాహిత్య నేపథ్యం కూడా ఉంది. సాయిచంద్ కుటుంబంతో పొట్టి శ్రీరాములు కుటుంబానికి దగ్గరి సంబంధం ఉంది. అందుకే ఆయన పొట్టి శ్రీరాములకు నివాళులర్పించేందుకు పాదయాత్ర చేపట్టారు. 10రోజులపాటు సాగిన ఈ యాత్ర తనకు ఎంతో అద్భుతమైన అనుభూతినిచ్చిందని, తన జన్మ ధన్యమైందని అన్నారు సాయిచంద్.
భారత రత్న ఇవ్వాలి..
పొట్టి శ్రీరాములుకి భారత రత్న ఇవ్వాలన్నారు సాయిచంద్. తెలుగు రాష్ట్ర అవతరణకోసం ఆయన చేసిన పోరాటం, ఆయన పట్టుదల, ఆయన ప్రాణ త్యాగం గురించి భావి తరాలకు తెలియజేయాలన్న పట్టుదలతోనే తాను ఈ యాత్ర చేపట్టానన్నారు. భావి తరాలకు ఆయన త్యాగాలు గుర్తు చేసేందుకు జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. మార్చి 16న పొట్టి శ్రీరాములు జయంతి ఉందని, ఆ సందర్భంగా పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
ప్రకాశం జిల్లాలో 100 అడుగుల విగ్రహం..
పొట్టి శ్రీరాములు గుర్తుగా ఆయన పుట్టిన ప్రకాశం జిల్లాలో 100 అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు స్థానికులు. స్థానిక ఆర్యవైశ్య నాయకులంతా సాయిచంద్ పాదయాత్ర గురించి తెలుసుకుని పడమటి పల్లెకు వచ్చారు. సాయిచంద్ ని ఘనంగా సన్మానించారు. పడమటిపల్లిలో శ్రీరాములు జన్మించిన ఇంటికి చేరుకున్న సాయిచంద్.. అక్కడి నేలను ముద్దాడారు. మట్టిని నుదుటన బొట్టుగా పెట్టుకున్నారు. అనంతరం అక్కడే కొద్దిసేపు మౌనం పాటించారు. ఆ తర్వాత స్థానిక ఆర్యవైశ్య ప్రముఖులు సాయిచంద్ ని ఘనంగా సన్మానించారు.
శిథిలావస్థలో శ్రీరాములు ఇల్లు..
1901 మార్చి 16న పడమటి పల్లెలో జన్మించారు పొట్టి శ్రీరాములు. అప్పట్లో ఈ ప్రాంతం నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకాలో ఉండేది. ఆ ఇల్లు ప్రస్తుతం వేరేవారి స్వాధీనంలో ఉంది. ఆ ఇంటిని కొన్నవారు తిరిగి విక్రయించారు. ఆ ఇంటికి మధ్యలో గోడకట్టి దాన్ని రెండు భాగాలుగా విభజించారు. అయితే వారు కూడా ప్రస్తుతం గ్రామంలో లేకపోవడంతో అది శిథిలావస్థలో ఉంది. దీన్ని ఇప్పుడు బాగు చేసి పొట్టి శ్రీరాములు స్మృతి వనం ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.