Somireddy Satires On CM Jagan : ఏపీని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చేశారు, సీఎం జగన్ పై సోమిరెడ్డి ఫైర్
సీఎం జగన్ రాష్ట్రాన్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చి దోచుకుంటున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. వ్యవస్థలను నిర్వీర్యం చేసిన పాపం ఆయనదేనని ఆరోపించారు.
Somireddy Satires On CM Jagan : సీఎం జగన్ రాష్ట్రాన్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చి దోచుకుంటున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వ్యవస్థలను నిర్వీర్యం చేసిన పాపం కూడా ఆయనదేనని ఆరోపించారు. స్థానిక సంస్థల ప్రతినిధులను ఉత్సవ విగ్రహాలుగా మార్చిన క్రెడిట్ కూడా వైసీపీ ప్రభుత్వానిదేనని చెప్పారు. రాష్ట్రంతో పాటు మన బిడ్డల భవిష్యత్తు కాపాడుకోవాలన్నా, వ్యవసాయాన్ని కాపాడుకోవాలన్నా.. మళ్లీ చంద్రబాబు నాయుడుని సీఎం చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు సోమిరెడ్డి.
ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం భీమవరంలో నిర్వహించిన గౌరవ సభలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, సూళ్లూరుపేట ఇన్ ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ పాలనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు సోమిరెడ్డి. ఏపీలో జగన్ పాలనలో వ్యవస్థలు కుప్పకూలిపోయాయన్నారు. అసెంబ్లీ, శాసనమండలితో పాటు న్యాయస్థానాలకు కూడా విలువలేకుండా చేసేశారని చెప్పారు. డీజీపీ అన్నా సీఎస్ అన్నా సీఎంకు లెక్కలేదని ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు నిస్సహాయులైపోయారన్నారు. ఎస్సైలు, సీఐలకు బాసులు డీఎస్పీ, ఎస్పీలు కాదని, ఇప్పుడు ..ఎమ్మెల్యేలు, మంత్రులే వారికి బాస్ లు గా ఉన్నారని ఎద్దేవా చేశారు.
టీడీపీ ప్రభుత్వ హయాంలో కరెంట్ ఛార్జీలు పెరగకపోయినా బాదుడే..బాదుడు అంటూ అసత్య ప్రచారం చేశారని, వైసీపీ అధికారంలోకి వచ్చాక మూడేళ్లలో ఏడు సార్లు విద్యుత్ చార్జీలు పెంచారని గుర్తు చేశారు. ఏట్లో దొరికే ఇసుకను అప్పట్లో ఉచితంగా ఇస్తే ఇప్పుడు తన బినామీ కంపెనీలకు అప్పగించి వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారని చెప్పారు. అన్నపూర్ణ లాంటి ఏపీలో బూతుల సంస్కృతి తెచ్చిన ఘనత కూడా సీఎం జగన్ దేనని అన్నారు సోమిరెడ్డి.
63 శాతం వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఉన్న ఏపీలో అగ్రికల్చర్ శాఖను నామరూపాల్లకుండా నిర్వీరం చేశారని మండిపడ్డారు. ఏపీ రైతులు క్వింటాలుకు రూ.213 మద్దతు ధర కోల్పోతున్నారని కేంద్ర ప్రభుత్వ సంస్థ సీఏసీపీ(కమిషనర్ ఫర్ అగ్రిక్చలర్ కాస్ట్ అండ్ ప్రైసెస్) తేల్చిందని చెప్పారు. ఒక్క నెల్లూరు జిల్లాలోనే క్వింటాలుకు రూ.500 మద్దతు ధరను రైతులు నష్టపోయారని చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా బడ్డెట్ కేటాయింపులకు విలువ లేకుండా చేసిన పాపం కూడా జగన్మోహన్ రెడ్డిదేనని అన్నారు సోమిరెడ్డి. ఇజ్రాయిల్ టెక్నాలజీ బిందు తుంపర్ల సేద్యాన్ని 2002లో దేశంలోనే మొదటిసారిగా ఏపీ రైతులకు పరిచయం చేసిన ఘనత చంద్రబాబుదని, 2014లో మరోమారు అధికారంలోకి వచ్చాక విస్తృతంగా సబ్సిడీలు ఇవ్వడం ద్వారా సామాన్య రైతులకు కూడా ఆ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చారని గుర్తు చేశారు. 2017లో బిందు తుంపర్ల సేద్యంలో ఏపీని జాతీయ స్థాయిలో అగ్రగామిగా నిలిపామని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక బిందు తుంపర్ల సేద్యమే కాదు. యాంత్రీకరణ, సాయిల్ హెల్త్ కార్డులు, సూక్ష్మపోషకాలు ఇలా అన్ని పథకాలను ఎత్తేశారని విమర్శించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలవుతున్న వ్యవసాయ శాఖ పథకాలకు ఏపీలో స్థానం లేకుండా పోయిందని వివరించారు. రాష్ట్రాన్ని ప్రైవేటు లిమిటెడ్ కంపెనీగా మార్చి దోచుకుంటున్న జగన్ ఆ వ్యాపారాలకు అడ్డు వస్తే ఎవరైనా ఒకటే అన్నవిధంగా కక్షసాధింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు.