Somasila: నిండుకుండలా సోమశిల ప్రాజెక్టు... పొంచి ఉన్న వరద ముంపు... ఆప్రాన్ ధ్వంసంతో అధికారుల్లో ఆందోళన
సోమశిల ప్రాజెక్టుకు వరద ముంపు పొంచి ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులో వరద నీరు పూర్తిస్థాయిలో చేరింది. ఆప్రాన్ ధ్వంసం అవడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు.
సోమశిల ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. రేపో, మాపో గేట్లు ఎత్తే నీటిని దిగువకు విడుదల చేయాల్సిన పరిస్థితి నెలకొంది. సోమశిల ప్రాజెక్ట్ ఆప్రాన్ వ్యవహారం ఇప్పుడు అధికారుల్ని కలవరపెడుతోంది. గతంలో వచ్చిన వరదలకు ఆప్రాన్ ధ్వంసం కాగా.. ఇంకా దానికి మరమ్మతులు చేయకపోవడం ఆందోళనకరంగా మారింది. మరోసారి నీరు కిందకు వదిలితే ఆప్రాన్ మరింతగా ధ్వంసమయ్యే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.
ఆప్రాన్ పూర్తిగా ధ్వంసం
నెల్లూరు జిల్లా వరప్రదాయిని సోమశిల ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 77.98 టీఎంసీలు. ప్రస్తుతం ప్రాజెక్ట్ లో 70.29 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 73 టీఎంసీలకు చేరుకునేలోపే నీటిని కిందకు వదిలేయాలని అధికారులు నిర్ణయించారు. అయితే నీరు కిందకు పోయేందుకు నిర్మించిన ఆప్రాన్ ఇప్పుడు పూర్తిగా ధ్వంసమైన స్థితిలో ఉంది. గతంలో వచ్చిన వరదలకు పెన్నా ప్రవాహం అధికంగా ఉండటం, రెండేళ్లలో మూడు సార్లు సోమశిల పూర్తి స్థాయిలో నిండటంతో నీటిని పెద్ద ఎత్తున కిందకు వదిలారు. ఈ క్రమంలో ఆప్రాన్ పూర్తిగా ధ్వంసమైంది.
స్థానికుల్లో ఆందోళన
ధ్వంసమైన ఆప్రాన్ కు వెంటనే మరమ్మతులు చేయాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోలేదు. గతంలో ఓసారి సందర్శనకు వచ్చి రిపోర్ట్ ఇచ్చారు. అయితే అంతలోనే మరోసారి సోమశిల నిండుకుండలా మారడం, నీరు వదలాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడటంతో ఆప్రాన్ పూర్తిగా కొట్టుకుపోతుందనే ఆందోళన స్థానికుల్లో మొదలైంది. శ్రీశైలం, నాగార్జున సాగర్ వంటి ప్రాజెక్ట్ లకు కూడా ఆప్రాన్ ను ఎప్పటికప్పుడు రిపేర్ చేస్తుంటారు. అయితే సోమశిల విషయంలో మరమ్మతులు జరిగి చాలాకాలం గడిచింది. దీంతో వరదలొచ్చినప్పుడల్లా ఆప్రాన్ మరింతగా ధ్వంసమవుతూ వచ్చింది. ఇప్పటికైనా అధికారులు దీనిపై దృష్టిపెట్టాలని జిల్లా వాసులు కోరుతున్నారు.
Also Read: Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో వానలే.. వానలు.. మరో రెండు రోజులు కూడా.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్
గతేడాది రికార్డు వరద
సోమశిల జలాశయానికి 1971లో అంకురార్పణ జరగింది. మొదటి దశ పనులు 1985లో పూర్తయ్యాయి. అప్పటి నుంచి ప్రాజెక్టులో నీటినిల్వ ప్రక్రియ మొదలైంది. మూడేళ్ల క్రితం వరకు 73 టీఎంసీల వరకు నీటి నిల్వ చేసుకునేందుకు అవకాశం ఉండగా, తర్వాత నిల్వ సామర్థ్యాన్ని 78 టీఎంసీలకు పెంచారు. గతేడాది రికార్డు స్థాయిలో పెన్నా నదికి 4 లక్షల క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహం పోటెత్తింది. ఆ సమయంలో ఇంజనీర్లు సోమశిల గేట్లు మొరాయించాయి. ప్రాజెక్టులో విద్యుత్ వ్యవస్థను కూడా తాత్కాలికంగా పరిష్కరించారు. వరదలకు సోమశిల దిగువ భాగం బాగా దెబ్బతింది. అన్ని గేట్లు ఎత్తివేయడంతో దిగువ భాగంలోని ఆఫ్రాన్, పొర్లుకట్టలు కోతకు గురయ్యాయి. ప్రొటెక్షన్ వాల్స్ దెబ్బతినడంతో ఇంజినీర్లు ఆందోళన చెందుతున్నారు.
Also read: ఇంటర్ ఆన్లైన్ ప్రవేశాల నోటిఫికేషన్ రద్దు... ఏపీ హైకోర్టు కీలక తీర్పు... ఈ ఏడాదికి పాత విధానమే...