TDP On KTR Comments : ఏపీ అభివృద్ధి విషయంలో మంత్రులు జోకులేస్తున్నారు, కేటీఆర్ కామెంట్స్ పై సోమిరెడ్డి సెటైర్లు
TDP On KTR Comments : తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందని టీడీపీ నేతలు అంటున్నారు. వాస్తవం చెబితే మంత్రులు నోరేసుకుపడిపోతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
TDP On KTR Comments : తెలంగాణను చూసి ఏపీ కొన్ని అంశాలైనా నేర్చుకోవాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి , టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సూచించారు. రైతు బంధు పథకం కింద తెలంగాణలో రైతులకు ప్రతి ఎకరాకు 10 వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నారని, ఏపీలో మాత్రం ఎన్ని ఎకరాలున్నా ఒక్కో కుటుంబానికి ఇచ్చేది కేవలం ఏడున్నర వేల రూపాయలు మాత్రమేనన్నారు. తెలంగాణలో వ్యవసాయ రంగానికి 24 గంటలూ విద్యుత్ సరఫరా చేస్తున్నారని ప్రశంసించారు. ఏపీలో కోతలే మిగిలాయని, వ్యవసాయానికి కూడా 7 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా ఉందని మండిపడ్డారు. పులిచింతల ఏ నదిపై ఉందో తెలియని అంబటి రాంబాబు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండటం ఏంటని వ్యంగ్యాస్త్రాలు విసిరారు సోమిరెడ్డి.
గుంతలు పూడ్చే దిక్కు లేదు
ఏపీలో అభివృద్ధి విషయంలో అద్భుతాలు జరిగాయని మంత్రులు జోకులేస్తున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఈ మూడేళ్లలో ఎక్కడ అభివృద్ధి జరిగిందో అర్థం కావడం లేదన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయన్నారు. రోడ్లపై గుంతలు పూడ్చే దిక్కు లేదని విమర్శించారు. ఇదేనా వైసీపీ అభివృద్ధి అని ప్రశ్నించారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు కట్టామని గొప్పలు చెప్పుకుంటున్నారని సోమిరెడ్డి అన్నారు. 2020-21 బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి రూ.20 వేల కోట్లు కేటాయించారని, కానీ రూ.7 వేల కోట్లే ఖర్చుపెట్టారన్నారు.
వైఎస్ భారతి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు : అయ్యన్నపాత్రుడు
తెలంగాణ మంత్రి కేటీఆర్ ఏపీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు సమర్ధించారు. వాస్తవాలను మాట్లాడిన మంత్రి కేటీఆర్ పై వైసీపీ మంత్రులు ఆబోతుల్లా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారన్నారు. రోడ్లు , తాగునీరు, మౌలిక సదుపాయాల కల్పనలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. జగన్ డమ్మీ అని వైస్ భారతి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారన్నారని విమర్శించారు.
సీఎం ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు : డీఎల్ రవీంద్రారెడ్డి
తెలంగాణ మంత్రి కేటీఆర్ ఏపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలలో ఎలాంటి తప్పు లేదని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. మైదుకూరులోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి బాగా ఉందని ఏపీలో మాత్రం తక్కువగా ఉందన్నారు. రాష్ట్రప్రభుత్వం అప్రకటిత విద్యుత్ కోతలు విధిస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి కోతలు లేవడం పట్ల ఆ శాఖపై మంత్రికి అవగాహన లేనట్లు ఉందన్నారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉందని కనీసం రోడ్ల టెండర్లకు ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. 151 సీట్లు వచ్చాయి అని సీఎం జగన్ ని ఇష్టం వచ్చినట్లు వ్యవహరించటం పద్ధతి కాదన్నారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారం మైనింగ్ మాఫియా విచ్చలవిడిగా రెచ్చిపోతున్న ప్రభుత్వ చర్యలు నామమాత్రంగా ఉన్నాయన్నారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి వారి నాన్న భాస్కర్ రెడ్డి లు మైనింగ్ మాఫియాకు సహకరిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. వివేకా హత్య కేసులో జాప్యం జరగడం లేదని తప్పు చేసిన వారికి కచ్చితంగా శిక్ష పడుతుందన్నారు.