Nellore News : నాగా సాధువుల ఆశీస్సులతో కచ్చితంగా మంత్రినవుతా!
నాగా సాధువులు ఆశీర్వదించినట్లు తాను తప్పకుండా మంత్రి అవుతానని అంటున్నారు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
రాజకీయాల్లో ఎమ్మెల్యే కావాలని, ఆ తర్వాత మంత్రి కావాలని అందరికీ ఉంటుందని అన్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఇటీవల నెల్లూరులో గణేష్ నిమజ్జనం సందర్భంగా నాగా సాధువులు తనని ఆశీర్వదించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నాగా సాధువుల ఆశీస్సులు నెరవేరతాయని, దానికి తాను కృషి చేస్తానని చెప్పారు. నెల్లూరుకు వచ్చిన నాగా సాధువులు రూరల్ ఎమ్మెల్యేను మంత్రి అవుతావంటూ దీవించి వెళ్లారు. దీంతో నెల్లూరు రూరల్ వైసీపీ కార్యకర్తలు సంబరపడుతున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేనే స్వయంగా నాగా సాధువుల ఆశీస్సులు నిజమవుతాయని అన్నారు.
గతంలో ఇలా..
గతంలో మంత్రివర్గ విస్తరణ సమయంలోనూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మంత్రి పదవి ఆశించిన ఆయన చివరకు అది కాకాణి గోవర్దన్ రెడ్డికి వెళ్లడంతో దిగాలు పడ్డారు. ప్రతిఫలం ఆశించకుండా ఎవరూ రాజకీయాల్లోకి రారని, ప్రతిఫలం ఆశించకుండా ఎవరూ సేవ చేయరని అన్నారు. అప్పట్లో రూరల్ ఎమ్మెల్యే అనుచరులు కూడా తమ నాయకుడికి మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. అయితే ఆ తర్వాత ఆయన సర్దుకున్నారు. గడప గడప కార్యక్రమంతో బిజీ అయ్యారు. గడప గడపలో జోరు చూపించి సీఎం జగన్ ప్రశంసలు అందుకున్నారు. అయినా కూడా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి చిరకాల కోరిక మాత్రం అలాగే ఉంది.
సాధువు దీవించాలా.. జగన్ ఆశీర్వదించాలా..?
నాగా సాధువు దీవించినంత మాత్రాన ఎవరైనా మంత్రి అవుతారా.. లేక సీఎం జగన్ ఆశీర్వాదాలు కూడా ఉండాలా అనేదే ఇక్కడ చర్చనీయాంశం. మంత్రి పదవుల విషయంలో సీఎం జగన్ లెక్కలు చాలానే ఉన్నాయి. అందుకే రెండు విడతల్లో ఆయన మంత్రి మండలిని ఏర్పాటు చేసుకున్నారు. రెండో విడతలో అసంతృప్తులు పెల్లుబికినా సామాజిక న్యాయం పేరుతో అత్యంత సన్నిహితుల్ని సైతం దూరం పెట్టారు. వారందరికీ మరో దఫా మంత్రి పదవులు ఇస్తారనే ప్రచారం కూడా ఉంది. అయితే ఇప్పటి వరకూ పదవులు దక్కని లిస్ట్ లో ఉన్న శ్రీధర్ రెడ్డి వంటి వారు కూడా మంత్రి పదవిపై ఆశ పెట్టుకున్నారు. సామాజిక సమీకరణాలన్నీ కుదిరితే ఎవరినైనా మంత్రి పదవి వరించవచ్చు.
సీఎం పర్యటన ముందు..
మరికొన్ని గంటల్లో నెల్లూరు జిల్లాకు సీఎం జగన్ రాబోతున్నారు. ఈ సందర్భంలో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మంత్రి పదవిపై చేసిన వ్యాఖ్యలు జిల్లాలో సంచలనంగా మారాయి. ఇప్పుడల్లా మంత్రి వర్గ విస్తరణ ఉండే అవకాశం లేదు, మరి శ్రీధర్ రెడ్డికి సీఎం జగన్ ఎప్పుడు ఆఫర్ ఇస్తారు. వచ్చేసారి అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఖాయమని చెప్పారా, ఆమాత్రం భరోసా లేకపోతే ఎమ్మెల్యే అంత ధైర్యంగా మినిస్టర్ పోస్ట్ గురించి మాట్లాడతారా అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. శ్రీధర్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే, మరి జిల్లాలో మిగతా ఆశావహుల సంగతి ప్రశ్నార్థకమే.
అయితే నాగా సాధువుల దీవెనలకు తోడు సీఎం జగన్ దీవెనలు కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఉంటాయా..? ఉంటే ఆయన మంత్రి ఎప్పుడవుతారు..? అనేది తేలాల్సి ఉంది. సీఎం జగన్ నెల్లూరుకు వస్తున్న సందర్భంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. సరిగ్గా సీఎం జగన్ పర్యటనకు ముందు రూరల్ ఎమ్మెల్యే మంత్రి పదవిపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.