(Source: ECI/ABP News/ABP Majha)
Nellore News : వైసీపీలో ఆనం పొలిటికల్ సీన్ కి ఎండ్ కార్డ్ ఆ మెసేజ్
ఆనం రామనారాయణ రెడ్డి విషయంలో ఎందుకో సీఎం జగన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వంపై ఆనం చేసిన విమర్శలకు జగన్ గట్టిగా బదులిచ్చారు.
నెల్లూరు జిల్లా వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి ఆ పార్టీలో పొలిటికల్ సీన్ పూర్తయిపోయింది. దీనికి రుజువే ఆ మెసేజ్. ఇటీవల కొత్తగా వెంకటగిరి మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన వెంకట్రామయ్య ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి ఓ మెసేజ్ పంపించారు. గడపగడపకు కార్యక్రమంలో ఇప్పటి వరకు మీరు అందించిన సహకారం మరువలేనిది, అందుకు ధన్యవాదాలు అంటూ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి మున్సిపల్ కమిషనర్ వెంకట్రామయ్య మేసేజ్ పంపించారు. అంటే ఇకపై ఆనం రామనారాయణ రెడ్డి గడప గడప కార్యక్రమాలకు రాకూడదని అర్థమా, వచ్చినా అధికారులు ఆయనకు సహకరించబోరని అర్థమా.. ప్రస్తుతం నెల్లూరు రాజకీయాల్లో ఇదే చర్చ నడుస్తోంది.
ఆనం రామనారాయణ రెడ్డి విషయంలో ఎందుకో సీఎం జగన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన వ్యాఖ్యలని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ప్రభుత్వంపై ఆయన చేసిన విమర్శలకు జగన్ గట్టిగా బదులిచ్చారు. బహిరంగ వేదికలపై విమర్శలకు దిగిన ఆనంను ఇప్పటికే వైసీపీ పక్కనపెట్టింది. వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జ్ పదవి నుంచి తొలగించి.. నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని నియమించింది అధిష్టానం. ఆ తర్వాత ఎమ్మెల్యే ఆనంకు గన్ మెన్ల సంఖ్యను కుదించారు. ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ ఆనం రామనారాయణరెడ్డికి పంపిన మేసేజ్ తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ మెసేజ్ తో పరోక్షంగా ఆనంకు వైసీపీతో పూర్తిగా సంబంధాలు తెగిపోయినట్టయింది.
వెంకటగిరి నియోజకవర్గ ఇన్ చార్జ్ గా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని నియమించిన తర్వాత కూడా వెంకటగిరిలో ఆనం గడప గడప కార్యక్రమాన్ని కొనసాగించారు. అధికారులతో సమీక్షలు, సమావేశాలు పెట్టారు. పనులు త్వరగా చేయాలని, ఎన్నికల్లోపు అన్ని పనులు పూర్తి చేయాలన్నారు. ఈ వ్యవహారం అధిష్టానానికి నచ్చలేదు. దీంతో ఆయన గడప గడపకు వెళ్లకుండా అడ్డుకోవాలనుకుంది. మున్సిపల్ కమిషనర్ తో ఆ మెసేజ్ ఇప్పించింది. అయితే ఆ మెసేజ్ వైసీపీ నుంచి వచ్చిందా, లేక రామ్ కుమార్ రెడ్డి ఆదేశమా అనేది తేలాల్సి ఉంది.
అధికారులు సహకరించరా..
నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వెంకటగిరి ఇన్ చార్జ్ గా వచ్చిన తర్వాత అధికారులను కూడా తనకు అనుగుణంగా మార్చుకుంటున్నారు. వెంకటగిరి మున్సిపాల్టీకి వెంకట్రామయ్యను నూతన కమిషనర్ గా తెచ్చుకున్నారు. ఆ తర్వాత క్రమంగా కౌన్సిలర్లలో కూడా చీలిక వచ్చింది. కొంతమంది కౌన్సిలర్లు రామ్ కుమార్ రెడ్డికి మద్దతుగా వచ్చారు. ఇకపై నియోజకవర్గ పరిధిలోని అధికారులు కూడా ఎమ్మెల్యేగా ఉన్న ఆనం రామనారాయణరెడ్డి మాట వినరనే అర్థం వచ్చేలా ఇప్పుడు కమిషనర్ పంపిన మేసేజ్ ఉందనే అనుమానాలు కలుగుతున్నాయి.
గడప గడపకు కార్యక్రమం పార్టీ పరంగా జరగడం లేదని వైసీపీ అంటోంది. గతంలో గడప గడపకు వైసీపీ అనే పేరు పెట్టాలనుకున్నా ఆ తర్వాత గడప గడపకు మన ప్రభుత్వం అని ప్రకటించారు. అయితే ఇప్పుడు రామనారాయణ రెడ్డిని గడప గడపకు వద్దంటే ఆ కార్యక్రమం గడప గడపకు మన ప్రభుత్వం అవుతుందా, లేక గడప గడపకు వైసీపీ అవుతుందా అనేది తేలాల్సి ఉంది. వైసీపీకి, ఆనంకు మధ్య ఇప్పుడు గ్యాప్ పూర్తిగా పెరిగిపోయింది. వచ్చే ఎన్నికల్లో ఆనంకు వైసీపీ టికెట్ రాబోదని దాదాపుగా నిర్ధారణ అయింది. ఇప్పుడు వెంకటగిరి నియోజకవర్గాన్ని రామ్ కుమార్ రెడ్డి తన కనుసన్నల్లోకి తీసుకుంటున్నారు, ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. అంటే ఇకపై ఆనం వైసీపీలో ఉన్నా లేనట్టే. పొమ్మనకుండానే గట్టిగా పొగపెట్టేశారు. ఇక పార్టీకి కటీఫ్ చెప్పడం ఆనం వంతు.