Nellore Janasena : నెల్లూరులో జనసేన పరిస్థితి ఏంటి? పార్టీ నేతలతో నాగబాబు భేటీ!
నెల్లూరు జిల్లా కొణిదెల కుటుంబానికి ప్రత్యేకం. చిరంజీవి కుటుంబం కొన్నాళ్లపాటు నెల్లూరులో కూడా ఉంది. పవన్ కల్యాణ్ నెల్లూరులో కూడా చదువుకున్నారు.
నెల్లూరులో జనసేన రాజకీయం ఎలా ఉంది. ఏయే స్థానాల్లో అభ్యర్థులు బలంగా ఉన్నారు, ఎక్కడెక్కడ పోటీ చేసే అవకాశం ఉంది, అసలు ఎవరెవరు జనాల్లోకి వెళ్తున్నారు, జనసేన జెండాని జనానికి దగ్గర చేస్తున్నారు.. ఇలాంటి ప్రశ్నలన్నిటితో నాగబాబు జిల్లా రాజకీయాలపై ఆరా తీశారు. నెల్లూరు జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ తో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. నాగబాబు ఇంటిలో ఈ మీటింగ్ జరిగింది. నెల్లూరు రాజకీయాలపై ప్రత్యేకంగా కిషోర్ ని అడిగి వివరాలు తెలుసుకున్నారు నాగబాబు.
నెల్లూరు ఎందుకంత ప్రత్యేకం..?
నెల్లూరు జిల్లా కొణిదెల కుటుంబానికి ప్రత్యేకం. చిరంజీవి కుటుంబం కొన్నాళ్లపాటు నెల్లూరులో కూడా ఉంది. పవన్ కల్యాణ్ నెల్లూరులో కూడా చదువుకున్నారు. ఆ క్రమంలో ఆయనకు ఇక్కడ పరిచయాలు కూడా ఉన్నాయి. గతంలో చాలా సార్లు పవన్ కల్యాణ్ నెల్లూరు పర్యటనతో తన చిన్ననాటి రోజులు గుర్తు చేసుకునేవారు. తాను చదువుకున్న విద్యాసంస్థలను గుర్తు చేసుకుంటూ, తన టీచర్లను కూడా పలకరించేవారు పవన్ కల్యాణ్. నెల్లూరు రాజకీయాలపై కూడా ఆయన ఆసక్తి కనబరిచేవారు. దీంతో నాగబాబు కూడా నెల్లూరు రాజకీయాలపై ప్రత్యేక ఆసక్తి చూపించారు.
నెల్లూరు జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ఈరోజు (శుక్రవారం) హైదరాబాద్ లో నాగబాబు స్వగృహంలో ఆయన్ను కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న పలు కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. నెల్లూరు జిల్లాలో ఇటీవల జరిగిన రాజకీయ సంఘటనలపై చర్చించారు. ప్రజలతో జనసేన నాయకులు ఎప్పుడూ కలిసి ఉండాలని సూచించారు. 2024 ఎన్నికల కోసం సమిష్టి కృషితో మరింత కష్టపడి పని చేయాలని చెప్పారు. జనసైనికుల్లో నూతన ఉత్తేజం నింపాలని, ప్రజల్ని మోసం చేస్తున్న ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. జనసేన పార్టీని జిల్లాలో గెలిపించే దిశగా పార్టీ బలం పెంచేందుకు కృషి చేయాలన్నారు నాగబాబు.
2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. అయితే జిల్లా నాయకులు మాత్రం పట్టు వదల్లేదు. ఆ తర్వాత జరిగిన స్థానిక ఎన్నికల్లో రెండు చోట్ల జనసేన బలపరచిన అభ్యర్థులు గెలుపొందారు. దీంతో జనసేనపై కాస్తో కూస్తో గురి కుదిరింది. ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షం టీడీపీ బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ అనే కార్యక్రమాలతో జనంలోకి వెళ్తోంది. అదే సమయంలో జనసేన కూడా తనదైన ఉనికి చాటుకోడానికి ప్రయత్నిస్తోంది. గతంలో గుడ్ మార్నింగ్ సీఎం సార్ అంటూ రోడ్లపై గుంతల్ని ఫొటోలు తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసే కార్యక్రమం నెల్లూరులో కూడా జోరుగా సాగింది. ఆ సమయంలో నెల్లూరులోని రోడ్లు బాగా హైలెట్ అయ్యాయి. ఇక నెల్లూరు జిల్లాకి సంబంధించి సోషల్ మీడియా వింగ్ కూడా బలంగా ఉందని తెలుస్తోంది. సోషల్ మీడియా ద్వారా జిల్లాలో జరుగుతున్న కార్యక్రమాలు ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తుంటారు. ఇటీవల ఇప్పటం గ్రామంలో జరిగిన హడావిడిలో కూడా నెల్లూరు జిల్లానుంచి నేతలు వెళ్లి పవన్ కల్యాణ్ వెంట నడిచారు. ఈ ఉత్సాహాన్న కొనసాగించాలని, జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ కి సూచించారు నాగబాబు.