Mekapati Ananya Reddy : నాన్న ఆశయాలు నెరవేరుస్తా, పొలిటికల్ ఎంట్రీపై గౌతమ్ రెడ్డి కుమార్తె క్లారిటీ
Mekapati Ananya Reddy : మేకపాటి గౌతమ్ రెడ్డి కుమార్తె రాజకీయాల్లోకి రాబోతున్నారా? తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్లబోతున్నారా? అందుకే ఆత్మకూరులో యాక్టివ్ అవుతున్నారా? ఈ ప్రచారాలకు ఆమె చెక్ పెట్టారు.
Mekapati Ananya Reddy : నెల్లూరు జిల్లాలో మేకపాటి కుటుంబం మూడు తరాలుగా రాజకీయాల్లో ఉంది. గౌతమ్ రెడ్డి మరణం తర్వాత ఆయన తమ్ముడు విక్రమ్ రెడ్డి ఆత్మకూరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అన్న ఆశయాలు సాధిస్తానని చెబుతున్నారాయన. ఇప్పుడు గౌతమ్ రెడ్డి కుమార్తె కూడా తన తండ్రి ఆశయ సాధనకోసం ముందుకొచ్చారు. అమెరికాలోని కార్నెల్ యూనివర్శిటీలో ఇంటర్నేషనల్ అగ్రికల్చర్ విభాగంలో ఆమె బీఎస్ కోర్స్ పూర్తి చేశారు. భారత్ కు వచ్చిన తర్వాత కుటుంబ వ్యాపారాలను ఆమె చూసుకుంటున్నారు. పలు స్టార్టప్ కంపెనీలతో ఆమె వ్యాపారాల్లో బిజీబిజీగా ఉన్నారు. అయితే సడన్ గా మేకపాటి అనన్య ఆత్మకూరు నియోజకవర్గంలో పర్యటించారు. ఆత్మకూరు డెవలప్ మెంట్ ఫోరం పేరుతో మేకపాటి కుటుంబం చేపట్టిన పనుల్ని ఆమె పర్యవేక్షించారు.
నాన్న లెగసీ ముందుకు తీసుకెళ్తా
"నాన్న పేరిట నిజయోకవర్గంలో పలు అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. ముందుగా ఆత్మకూరు బస్టాండ్ అభివృద్ధి చేస్తాం. నాన్న కూడా బస్టాండ్ బాగుచేయించాలని అనుకున్నారు. ఆత్మకూరు డెవలప్మెంట్ ఫోరమ్ ద్వారా ఈ పనులు చేయాలని నిర్ణయించాం. ఒక స్టార్టప్ ద్వారా విద్యార్థులు, ఉద్యోగార్థులకు స్కిల్ డెవలప్మెంట్ లో శిక్షణ ఇస్తాం. టీహబ్ లో 19 ఐటీ స్టార్టప్ లకు పనిచేశాను. అగ్రికల్చర్ స్టార్టప్ లపై పనిచేయాలని నిర్ణయించుకున్నాను. నాన్నకు ఆత్మకూరు నియోజకవర్గం అంటే చాలా ఇష్టం. ఆయన లెగసీని నేను ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాను. ప్రస్తుతానికి రాజకీయాలపై ఇంట్రెస్ట్ లేదు. దానికి ఇంకా అనుభవం కావాలి." - మేకపాటి అనన్య
నెల్లూరు వైసీపీ కల్లోలం
నెల్లూరు జిల్లా రాజకీయాలు రసవత్తంగా మారాయి. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు వైసీపీని విడారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీకి ఆల్ మోస్ట్ దూరం అయ్యారు. త్వరలో వారిద్దరూ వేరే పార్టీలో చేరబోతున్నారని ప్రచారం కూడా జరుగుతోంది. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా ఇటీవల అసమ్మతి స్వరం వినిపించారు. అయితే అధిష్టానం హెచ్చరికలతో ఆయన సైలెంట్ అయ్యారు. ఈ తరుణంలో గౌతమ్ రెడ్డి కుమార్తె ఆత్మకూరు నియోజకవర్గంలో యాక్టివ్ అవుతుండడంతో ఆమె రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారానికి మేకపాటి అనన్య చెక్ పెట్టారు. రాజకీయాల్లోకి రావడంపై క్లారిటీ ఇచ్చారు. ఇప్పట్లో రాజకీయాల్లోకి రానని, దానికి చాలా అనుభవం కావాలని తేల్చేశారు. కానీ తండ్రి గౌతమ్ రెడ్డి లెగసీ మాత్రం కచ్చితంగా ముందుకు తీసుకెళ్తానన్నారు.
గౌతమ్ రెడ్డి అకాల మరణం తర్వాత
రాష్ట్ర పరిశ్రమ శాఖ మంత్రిగా ఉన్న మేకపాటి గౌతమ్ రెడ్డి గత ఏడాది గుండెపోటుతో హఠాత్తుగా చనిపోవడంతో ఆత్మకూరుకు ఉపఎన్నికలు వచ్చాయి. వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా మేకపాటి గౌతమ్ రెడ్డి సోదరుడు అయిన మేకపాటి విక్రమ్ రెడ్డినే నిలబెట్టారు. చనిపోయిన వ్యక్తి కుటుంబం నుంచి వ్యక్తిని నిలబెడితే తాము పోటీ నుంచి దూరంగా ఉంటామనే సెంటిమెంట్‌తో టీడీపీ దూరంగా ఈ ఉప ఎన్నికకు దూరంగా ఉంది. దీంతో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి గెలుపు అనేది చాలా సులభం అయింది. విజయం పూర్తిగా ఏకపక్షం అయిపోయింది. ఉపఎన్నికలో విక్రమ్ రెడ్డి ఘన విజయం సాధించారు.