Nellore Court Bomb Case : నెల్లూరు కోర్టులో బాంబు పేలుడు ఘటన, కీలక తీర్పు ఇచ్చిన న్యాయస్థానం
Nellore Court Bomb Case : నెల్లూరు నగర కోర్టులో బాంబ్ పేలుడు కేసులో కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. నేరం నిరూపించలేకపోవడంతో కేసును కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.
Nellore Court Bomb Case : నెల్లూరు నగర కోర్టులో బాంబ్ పేలుడు కేసును కోర్టు కొట్టేసింది. ఈ కేసుపై విచారణ చేపట్టిన ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కీలక నిర్ణయం తీసుకున్నారు. బాంబ్ పేలుడు కేసును కొట్టివేస్తూ ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కె.పి.బాలాజీ ఇవాళ తీర్పు ఇచ్చారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ నేరం నిరూపించలేకపోవడంతో జడ్జి కేసును కొట్టేసారు. 2016 సెప్టెంబర్ 12న నెల్లూరు కోర్టు ప్రాంగణంలో కుక్కర్ బాంబు పేలిన విషయం తెలిసిందే. జిల్లా కోర్టు ప్రాంగణంలో బాంబు పేలుడు అప్పట్లో సంచలనం అయింది. ఈ దాడి వెనుక అల్ ఉమా(హ్) అనే ఉగ్రవాద సంస్థ ఉందని అప్పట్లో పోలీసులు భావించారు. చిత్తూరు, కేరళలోని కొల్లాం, పుదుచ్చేరి కోర్టుల్లో బాంబు పేలుళ్లకు ప్లాన్ చేశారని అప్పట్లో పోలీసులు అనుమానాలు వ్యకం చేశారు.
అప్పట్లో ఇంటిలిజెన్స్ ఆరా
ఎప్పుడూ లేని విధంగా నెల్లూరు జిల్లాలో బాంబ్ పేలుడు సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే తక్కువ స్థాయిలో పేలుడు జరిగిందని, బాంబు సామర్థ్యం కూడా తక్కువ కావడంతో ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు. ఈ పేలుడుపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అప్పట్లో పోలీసు అధికారులు చెప్పారు. పేలుడు జరిగిన సమయంలో జనసంచారం లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందన్నారు. జనం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో జరిగివుంటే నష్టం జరిగేదని అప్పట్లో పోలీసులు పేర్కొన్నారు. ఈ బాంబ్ పేలుడుపై ఇంటిలిజెన్స్ బ్యూరో అధికారుల బృందం ఆరా తీసింది. పేలుడు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించింది. పోలీసుల నుంచి స్వాధీనం చేసుకున్న బాంబు, ప్రెషర్ కుక్కర్ శకలాలను ఇంటిలిజెన్స్ అధికారులు పరిశీలించారు.
చిత్తూరు జిల్లా కోర్టులో కూడా
గతంలో చిత్తూరు జిల్లా కోర్టు ఆవరణలో కూడా ఇదే తరహా పేలుడు సంభవించింది. అప్పట్లో చిత్తూరు సీసీఎస్ డీఎస్పీ రామకృష్ణ నెల్లూరు నగరానికి వచ్చి బాంబ్ పేలుడు ప్రదేశాన్ని పరిశీలించారు. ఏపీతో పాటు కర్నాటక మైసూర్‌లో, కేరళ కొల్లాంలో ఇదే తరహాలో కోర్టుల్లో జరిగిన బాంబు పేలుళ్లకు, నెల్లూరులో జరిగిన ప్రెషర్ కుక్కర్ బాంబు పేలుడుకు సంబంధం ఉందని పోలీసులు తెలిపారు. అయితే ప్రాసిక్యూషన్ ఈ కేసులో సరైన ఆధారాలు చూపకపోవడంతో జడ్జి ఈ కేసును కొట్టివేశారు.
మసీదులో బాంబు పేలుడు
పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. పెషావర్‌లోని ఓ మసీదులో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో సమీపంలో భారీగా పేలుడు శబ్దం వినిపించింది. ఈ పేలుడు ధాటికి మసీదు కూడా కొంత మేర ధ్వంసమైంది. ఈ దాడిలో 28 మంది మృతి చెందగా...83 మంది తీవ్రంగా గాయపడ్డారు. మసీదు శకలాల కింద కొందరు చిక్కుకున్నట్టు అనుమానిస్తున్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆ ప్రాంతాన్ని పూర్తిగా సీజ్ చేశారు. ఆంబులెన్స్‌లను తప్ప మరే వాహనాలనూ అనుమతించడం లేదు. ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం..మసీదు పైకప్పు ధ్వంసమైనట్టు తెలుస్తోంది. ప్రార్థనలు జరుగుతున్న సమయంలోనే ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డట్టు తేలింది. చనిపోయిన 17 మందిలో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగానే ఉన్నట్టు సమాచారం. ఆర్మీ యూనిట్ ఆఫీస్‌కు దగ్గర్లోని మసీదు వద్ద ఇలాంటి దాడి జరగటం సంచలనమవుతోంది. ఈ పేలుడు శబ్దం దాదాపు 2 కిలోమీటర్ల వరకూ వినిపించినట్టు స్థానికులు వెల్లడించారు.