NDA Pending Seats : ఇంకా అభ్యర్థుల్ని ఖరారు చేయని ఏపీ బీజేపీ - ఇంకా ఎన్డీఏ ఎన్ని సీట్లకు అభ్యర్థుల్ని ఖరారు చేయాలంటే ?
Andhra : ఏపీలో ఇంకా ఎన్డీఏ కూటమి పలు సీట్లకు అభ్యర్థుల్నిఖరారు చేయాల్సి ఉంది. బీజేపీ ఇంకా ఒక్క అభ్యర్థిని కూడా ఖరారు చేయలేదు.
NDA Alliance is yet to finalize candidates for many seats in AP : ఎన్డీఏ కూటమి తరపున ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా అభ్యర్థుల ఎంపికపైస్పష్టత రావాల్సి ఉంది. మూడు పార్టీలు కలిసి 20 అసెంబ్లీ, 10 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయలేకపోయారు.
అభ్యర్థులను ఖరారు చేయాల్సిన అసెంబ్లీ స్థానాలు:
పాలకొండ, ఎచ్చెర్ల, చీపురుపల్లి, భీమిలి, పాడేరు, పోలవరం, అవనిగడ్డ, విజయవాడ పశ్చిమ, కైకలూరు, దర్శి, ఆలూరు, ఆదోని, గుంతకల్లు, అనంత అర్బన్, ధర్మవరం, రాజంపేట, జమ్మలమడుగు, బద్వేలు, రైల్వే కోడూరు.
గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో మొత్తంగా సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు. తొలి జాబితాలో ప్రకటించిన పి.గన్నవరం స్థానం పై సందిగ్దత నెలకొంది. ఈ స్థానాన్ని బీజేపీకి ఇస్తారని అంటున్నారు. తిరుపతి అభ్యర్థి మార్పుపై జనసేనలో తర్జన భర్జన జరుగుతోంది. కొన్ని స్థానాలకు మార్పులు చేసుకోవాలని బీజేపీ, జనసే నిర్ణయించుకున్నాయి. తిరుపతి, రాజంపేట, రైల్వే కోడూరు, ధర్మవరం, అనంత అర్బన్, విజయవాడ పశ్చిమ స్థానాల విషయంలో మార్పు చేర్పులు ఉండే అవకాశం ఉంది. చీపురుపల్లి, భీమిలి, దర్శి, గుంతకల్లు, ఆలూరు స్థానాలను మాత్రమేటీడీపీ పెండింగ్ లో పెట్టింది. ఎచ్చెర్ల, పాడేరు, పి.గన్నవరం, విజయవాడ వెస్ట్, కైకలూరు, ఆదోని, అనంత అర్బన్, ధర్మవరం, బద్వేలు, రైల్వే కోడూరు, రాజంపేట స్థానాల్లో బీజేపీ జనసే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
ఏపీ పొత్తులో భాగంగా ఆరు లోక్ సభ, 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీకి సిద్ధమైంది బీజేపీ. అరకు, విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, నరసాపురం, తిరుపతి లోక్‌సభ సీట్లలో ఆ పార్టీ యుద్ధానికి సిద్ధమవుతోందన్న ప్రచారం జరుగుతోంది. అలాగే శ్రీకాకుళం, పాడేరు, విశాఖ నార్త్, కాకినాడ సిటీ, కైకలూరు, విజయవాడ వెస్ట్, బద్వేలు, జమ్మలమడుగు, ఆదోని, ధర్మవరం అసెంబ్లీ సెగ్మెంట్లల్లో బీజేపీ అభ్యర్థులు రంగంలోకి దిగుతారని చెప్పుకుంటున్నారు. అంత వరకు ఓకే అనుకున్నా… అక్కడ అభ్యర్థులు ఎవరన్నదే ఇప్పుడు అసలు సమస్యగా మారిందన్న గుసగుసలు వినిపిస్తున్నారు.
ప్రస్తుతం ప్రచారంలో ఉన్న పార్లమెంట్ స్థానాలు కాకుండా.. రాజంపేట, హిందూపురం వంటి సీట్లను బీజేపీ కోరుకుంటున్నట్టు సమాచారం. ఆ రెండు స్థానాలు తమ పార్టీకి దక్కితే.. ప్రచారంలో ఉన్న రెండిటిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారట కాషాయ నేతలు. అలాగే నరసాపురానికి బదులు ఏలూరు టిక్కెట్ కోరుకుంటున్నారనే ప్రచారం ఉంది. ఈ క్రమంలో అరకు పార్లమెంట్ నియోజకవర్గానికి కొత్తపల్లి గీత, విజయనగరానికి మాధవ్ లేదా కాశీరాజు, అనకాపల్లికి సీఎం రమేష్, రాజమండ్రికి పురందేశ్వరి లేదా సోము వీర్రాజు, తిరుపతి అభ్యర్థిగా సత్యప్రభ పేర్లు వినిపిస్తున్నాయి. ఒకవేళ సీట్ల సర్దుబాట్లు కొలిక్కి వచ్చి.. బీజేపీ కోరుకున్నట్టు రాజంపేట, హిందూపురం టిక్కెట్లు దక్కితే.. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, సత్యకుమార్ లేదా పరిపూర్ణానంద స్వామి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. కానీ రాయలసీమలో తిరుపతి మినహా మిగిలిన చోట్ల బీజేపీకి పార్లమెంట్ సీట్లు ఇవ్వడానికి టీడీపీ సుముఖంగా లేనట్టు సమాచారం. రాజంపేట, హిందూపురం వంటి సెగ్మెంట్లల్లో ముస్లిం ఓటర్లు గణనీయంగా ఉన్నారు.