Nara Lokesh: 'పోలీసులు ప్రైవేట్ సైన్యంలా మారిపోయారు' - తాలిబాన్ల రాజ్యం గుర్తుకు తెస్తున్నారని లోకేశ్ సంచలన వ్యాఖ్యలు
Nara Lokesh: రాష్ట్రంలో దళితులపై రాజ్యహింసను నిలువరించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. పుంగనూరు నియోజకవర్గంలో టీడీపీ దళిత నేతపై పోలీసుల దాడిని ఖండించారు.
ఏపీ పోలీసులు వైసీపీ ప్రైవేట్ సైన్యంలా మారిపోయారని, ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలపై అణచివేతకు పాల్పడుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరులో ఆటవిక పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ దళిత నేత ముల్లింగి వెంకటరమణను, కల్లూరు సీఐ కత్తి శ్రీనివాసులు అక్రమంగా నిర్బంధించి, చేతులు వెనక్కు కట్టి, నోట్లో గుడ్డలు కుక్కి చిత్ర హింసలకు గురి చేశారని, ఇది తాలిబాన్ల రాజ్యాన్ని గుర్తుకు తెస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న రాజ్యహింసను నిలువరించి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని కోరారు.
'ఎన్నడూ లేని దారుణాలు'
సీఎం జగన్ బహిరంగ వేదికలపై ఎస్సీ, ఎస్టీ, బీసీలపై లేని ప్రేమలు ఒలకబోస్తున్నారని, కానీ ఆయా వర్గాలపై ఇది వరకూ ఎన్నడూ లేని విధంగా దారుణాలు కొనసాగుతున్నాయని లోకేశ్ ఆరోపించారు. టీడీపీ దళిత నేతను అక్రమంగా నిర్బంధించి దాడి చేసిన కల్లూరు సీఐపై డీజీపీ తక్షణమే విచారణ జరిపి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ జరిగింది
టీడీపీ అధినేత చంద్రబాబు ఆగస్ట్ 4న పుంగనూరు, అంగళ్లులో పర్యటించిన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ క్రమంలో జరిగిన ఘటనల నేపథ్యంలో పులిచర్ల మండలం ముల్లంగివారిపల్లెకు చెందిన టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముల్లంగి వెంకటరమణపై కేసు నమోదైంది. భీమగానిపల్లె కూడలి వద్ద జరిగిన అల్లర్ల కేసులో హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ ఉన్నా, పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. అనంతరం పుంగనూరు కోర్టులో హాజరు పరచగా ముందస్తు బెయిల్ ఉండడంతో రిమాండును తిరస్కరించింది.
'చిత్రహింసలు పెట్టారు'
అరెస్ట్ సందర్భంగా సీఐ శ్రీనివాసులు తనను చిత్ర హింసలకు గురి చేశారని బాధితుడు వెంకటరమణ ఆరోపించారు. 'పుంగనూరు మండలం భీమగానిపల్లె కూడలి వద్ద జరిగిన అల్లర్ల కేసుల్లోని నిందితుల జాబితాలో పోలీసులు నా పేరు చేర్చారు. కొన్ని కేసుల్లో హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఓ కేసులో నిందితుల జాబితాలో నా పేరు లేదని ప్రభుత్వ న్యాయవాదులే చెప్పారు. దీంతో ఈ కేసులో ముందస్తు బెయిల్ అక్కర్లేదని పిటిషన్ కొట్టేశారు. హైదరాబాద్ లో ఉన్న నన్ను కల్లూరు పోలీసులు ఇదే కేసులో గురువారం అరెస్ట్ చేశారు. సీఐ కత్తి శ్రీనివాసులు తీవ్ర పదజాలంతో దుర్భాషలాడారు. నోట్లో గుడ్డలు కుక్కి ఇష్టారీతిన బూటు కాళ్లతో తన్నారు. అరికాళ్లు, చేతులు తొక్కి పెట్టారు.' అని వాపోయారు. చిత్ర హింసల పర్వాన్ని వీడియో తీసి వైసీపీ నాయకులకు పంపారన్నారు. ఈ విషయాన్ని మేజిస్ట్రేట్ ముందు చెబితే రౌడీషీట్ తెరిచి బయటకు రాకుండా చూస్తామని బెదిరించినట్లు చెప్పారు.
ప్రస్తుతం బాధితుడు తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పుంగనూరు టీడీపీ ఇంఛార్జీ చల్లా రామచంద్రారెడ్డి శనివారం బాధితున్ని పరామర్శించారు. వెంకటరమణ తరచూ మంత్రి పెద్దిరెడ్డి వైఖరిని ఎండగడుతూ వీడియోలు పోస్ట్ చేస్తుంటారని టీడీపీ నాయకులు చెబుతున్నారు.
Also Read: పురందేశ్వరిది నీతిలేని చరిత్ర, దాంట్లో బహునేర్పరి - విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు