Nara Lokesh: టీడీపీ గెలిచిందని టీకొట్టు యజమాని బంపర్ ఆఫర్! నారా లోకేశ్ ప్రశంసలు
AP Latest News: టీడీపీ గెలుపు పట్ల బషీర్ అనే టీ షాపు నడిపే వ్యక్తి ఒక రోజంతా టీ ఉచితంగా పంపిణీ చేయడంపై నారా లోకేశ్ స్పందించారు. బషీర్ అభిమానానికి తాను ఫిదా అయ్యానని అన్నారు.
Nara Lokesh News: ఎన్డీఏ కూటమి ఏపీలో ఊహించని విజయం సాధించడం పట్ల ఆయా పార్టీల మద్దతుదారులు సంబరాలు చేసుకుంటున్నారు. ఎక్కడికక్కడ బాణాసంచాలు కాలుస్తూ.. స్వీట్లు పంచుకుంటూ, డ్యాన్సులు చేస్తూ తమకు నచ్చిన రీతిలో వేడుకలు చేసుకుంటున్నారు. టీడీపీ భారీ స్థాయిలో సీట్లు గెల్చుకున్నందున ఆ పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులు కూడా సంబరంలో మునిగితేలుతున్నారు. తాజాగా ఓ సామాన్య టీకొట్టు యజమాని తన అభిమాన పార్టీ ఎన్నికల్లో విజయం సాధించడం పట్ల తనకు వీలైన రీతిలో వేడుక చేసుకున్నారు.
రోజూ టీ వ్యాపారం నిర్వహించుకునే ఆయన టీడీపీ గెలిచిన సందర్భంగా ఒక రోజంతా ఉచితంగా టీని పంపిణీ చేశారు. శ్రీసత్యసాయి జిల్లాలోని కొత్త చెరువు మండలంలో ఈ పరిణామం జరిగింది. కొత్త చెరువు మండలంలో టీ దుకాణం నడుపుకుంటున్న బషీర్ అనే వ్యక్తి రోజంతా ఛాయ్ పంపిణీ చేశారు. పైగా తన దుకాణం వద్ద ‘ఈరోజు టీ ఫ్రీ’ అని బోర్డు కూడా పెట్టారు. జూన్ 5న రోజు మొత్తం తన వద్దకు వచ్చిన వారికి ఉచితంగా టీ పంపిణీ చేశారు. బషీర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీడీపీ గెలిచినందున తాను ఎంతో సంతోషంగా ఉన్నానని అన్నారు. అందుకే తన వంతుగా ఇలా ఉచితంగా టీ పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.
నారా లోకేశ్ పోస్ట్
బషీర్ టీ ఉచితంగా పంపిణీ చేయడంపై నారా లోకేశ్ స్పందించారు. బషీర్ అభిమానానికి తాను ఫిదా అయ్యానని అన్నారు. ‘‘టీడీపీ కూటమి ఘనవిజయం సాధించి, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాబోతున్న సందర్భంగా కొత్తచెరువు మండల కేంద్రంలో రోజంతా అందరికీ ఉచితంగా టీ అందించిన బషీర్ అభిమానానికి ఫిదా అయ్యాను’’ అని లోకేశ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
టిడిపి కూటమి ఘనవిజయం సాధించి, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాబోతున్న సందర్భంగా కొత్తచెరువు మండల కేంద్రంలో రోజంతా అందరికీ ఉచితంగా టీ అందించిన బషీర్ అభిమానానికి ఫిదా అయ్యాను.#KutamiTsunami #AndhraPradesh pic.twitter.com/anvI0hSGMl
— Lokesh Nara (@naralokesh) June 5, 2024