Lokesh To Delhi : తల్లితో కలిసి రేపు ఢిల్లీకి లోకేష్ - ఏపీలో పరిస్థితులపై జాతీయ మీడియాకు ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం !
నారా లోకేష్ తన తల్లి భువనేశ్వరితో కలిసి శుక్రవారం ఢిల్లీకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఏపీలో పరిస్థితులు , కేసులు పెడుతున్న తీరు, అరెస్ట్ చేసిన వైనాన్ని జాతీయ మీడియాకు ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఉంది.
Lokesh To Delhi : చంద్రబాబునాయుడి అరెస్ట్ అక్రమం అనే విషయంపై జాతీయ స్థాయిలో మీడియాకు ప్రజెంటేషన్ ఇవ్వాలని.. ఏపీలో ఉన్న పరిస్థితులను వివరించాలని నారా లోకేష్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. శుక్రవారం ఢిల్లీకి వెళ్లి ఈ అంశంపై జాతీయ మీడియాకు ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. చంద్రబాబు అరెస్ట్ విషయంలో జాతీయ స్థాయిలో .. స్పందన వచ్చింది. చంద్రబాబును రాజకీయకక్షోనే అరెస్టు చేశారని అనేక పార్టీల నేతలు ప్రకటించారు. జాతీయ మీడియా కూడా ఈ ఘటనపై విస్తృతంగా కవరేజీ ఇస్తోంది. దీంతో చంద్రబాబు మొత్తం ప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
ఏపీ పరిస్థితులపై జాతీయ మీడియాకు ప్రజెంటేషన్
ఆంధ్రప్రదేశ్లో ఇటీవలి కాలంలో దాడులు చేసిన వారిని వదిలేసి బాధితులపైనే కేసులు పెడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నాయి. నాలుగేళ్ల కాలంలో ఏపీలో జరిగినన్ని అరాచకాలు దేశంలో ఎక్కడా జరిగి ఉండవని.. వాటన్నింటినీ మీడియాకు వివరించాలని అనుకుంటున్నారు. టీడీపీ ఆఫీసుపై దాడి చేసిన వారిపై ఒక్క కేసు కూడా పెట్టకపోవడం... అంగళ్లు, పుంగనూరులో చంద్రబాబు ర్యాలీపై రాళ్ల దాడులు చేసి.. తిరిగి చంద్రబాబుపైనే హత్యాయత్నం కేసులు నమోదు చేయడం వంటి వాటిని.. లా అండ్ ఆర్డర్ పూర్తిగా దారి తప్పిన పరిస్థితుల్ని జాతీయస్థాయిలో హైలెట్ చేయాలని లోకేష్ అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు.
ఏపీలో వ్యవస్థలన్నింటికీ కుప్పకూల్చిన వైనాన్ని వివరించే అవకాశం
అదే సమయంలో ఆధారాలు లేని కేసుల్ని ప్రతిపక్ష నేతలపై ఎలా మోపుతున్నారో కూడా వివరించనున్నట్లుగా చెబుతున్నారు. వ్యాపార సంస్థలపై ప్రభుత్వం జరిపినదాడులు.. మార్గదర్శి వంటి సంస్థలు.. అమరరాజా వంటి దేశానికి ప్రాముఖ్యత తెచ్చిన సంస్థలపై జరిగిన దాడుల గురించీ వివరించి.. అరాచక పాలన గురించి వివరిస్తారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. వ్యవస్థల్ని పూర్తి స్థాయిలో నాశనం చేసి న వైనాన్ని వివరించే అవకాశాలు ఉన్నాయి. 73 ఏళ్ల వయసులో ఉన్నచంద్రబాబును పధ్నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసినా ఎఫ్ఐఆర్లో కూడా పేరు లేకుండా... గవర్నర్ అనుమతి లేకుండా.. కనీసం నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేసిన వైనాన్ని జాతీయ స్థాయిలో చర్చకు పెట్టే అవకాశం ఉంది.
హోంమంత్రి అమిత్ షాను కూడా కలిసే అవకాశం
కుదిరితే హోంమంత్రి అమిత్ షాను కూడా కలుస్తారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఈ అంశంపై స్పష్టత లేదు. కానీ ఏపీలో పరిస్థితుల్ని ఢిల్లీలో అందరి ముందు పెట్టాలని నారా లోకేష్ గట్టిగా నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.