(Source: ECI/ABP News/ABP Majha)
Nandyal News : డబుల్ బెడ్ రూమ్ ఇల్లుగా మారిపోయిన ప్రభుత్వ పాఠశాల, స్థానిక నేత తలచుకుంటే అంతే మరి!
Nandyal News : నంద్యాల జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలను ఇళ్లుగా మార్చేశారు స్థానిక నేత. పాఠశాలను ఇళ్లుగా మార్చేసినా అధికారులకు తెలియకపోవడం ఇక్కడ అసలు ట్విస్ట్.
Nandyal News : ఎంతో మంది పిల్లలు విద్యా బుద్ధులు నేర్చుకున్న పాఠశాల అది. విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడంతో అధికారులు ఐదేళ్ల క్రితం ఆ పాఠశాలను మూసివేశారు. అక్కడి విద్యార్థులను వేరే పాఠశాలకు పంపించారు. ఐదేళ్లుగా ఖాళీగా ఉన్న పాఠశాలపై స్థానిక నేత కన్నుపడింది. పాఠశాల రూపురేఖలు మార్చేసి ఇళ్లుగా మార్చుకున్నారు. ఈ ఘటనను టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. నంద్యాల జిల్లాలో పాణ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చంద్రబాబు ట్వీట్ లో వివరాలు ఇలా ఉన్నాయి.
స్థానిక నేత ఆక్రమణతో!
పాణ్యంలోని ఇందిరానగర్ లో ఓ ప్రభుత్వ పాఠశాలను స్థానిక నేత ఆక్రమించి ఇళ్లుగా మార్చుకున్నారు. 2013 జూన్‌లో రాజీవ్ విద్యా మిషన్ కింద రూ.5.30 లక్షల వ్యయంతో ప్రభుత్వం ఈ పాఠశాలను నిర్మించింది. అయితే ఈ పాఠశాలకు వచ్చే విద్యార్థుల సంఖ్య తగ్గడంతో అక్కడి విద్యార్థులను వేరే ప్రభుత్వ స్కూళ్లలోకి మార్చారు అధికారులు. ఐదేళ్ల క్రితం ఈ పాఠశాలను అధికారులు మూసివేశారు. అప్పటి నుంచి స్కూల్ ఖాళీగా ఉంది. ఈ పాఠశాలపై స్థానిక నేత కన్నుపడింది. పాఠశాల బోర్డు, శిలాఫలకం తీసేసి ఇళ్లుగా మార్చుకున్నారు. రెండు బెడ్ రూములు, కిచెన్ , హాల్, మెట్లు నిర్మించారు. అయితే స్థానిక అధికారులు ఈ విషయాన్ని పట్టించుకోకపోవడంతో విమర్శలు వస్తున్నాయి.
ఇదిగిదిగో... వైసీపీ ప్రభుత్వ నాడు - నేడు! pic.twitter.com/c1Lskc3jUG
— N Chandrababu Naidu (@ncbn) September 10, 2022
చంద్రబాబు ట్వీట్
వైసీపీ నేత ప్రభుత్వ పాఠశాలను ఇళ్లుగా మార్చుకున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. ఇదిగిదిగో వైసీపీ ప్రభుత్వ నాడు-నేడు అని చంద్రబాబు విమర్శించారు. విద్యార్థుల సంఖ్య తగ్గిపోతే వారిని పాఠశాలకు రప్పించేందుకు కృషి చేయాలని కానీ పాఠశాల భవనాన్ని ఇలా వదిలేస్తారా? అని ప్రశ్నించారు.
పాఠశాలకు తాళం
స్థానిక వైసీపీ నేత పాఠశాల భవనాన్ని ఆక్రమించి ఇళ్లుగా మార్చేసినా అధికారులు పట్టుకోవడంలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. స్కూల్ ను ఆక్రమించుకుని నిర్మాణాలు చేస్తున్న అధికారులుచూస్తూ ఊరుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ నిర్మాణాలపై అధికారులకు సమాచారం ఇచ్చినా అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేయలేదని విమర్శించారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని టీడీపీ నేతలు అంటున్నారు.పాఠశాలను కాపాడాల్సిన అధికారులు అధికార పార్టీ నేతలకు కొమ్ముకాస్తున్నారని మండిపడ్డుతున్నారు. స్థానిక ఎంఈవో ఈ ఘటనపై స్పందిస్తూ పాఠశాల భవనాన్ని మూసివేశారని, నిర్మాణాలు చేపట్టింది ఎవరో తెలియదన్నారు. ఈ విషయం తమ దృష్టికి వచ్చిన వెంటనే పాఠశాల భవనానికి తాళాలు వేయించామన్నారు.
Also Read : AP IAS Transfer: ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీలు - వారి కొత్త శాఖలు ఇవే
Also Read : తెలంగాణలో ఉన్న ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్- బదిలీల ఫైల్‌పై సీఎం జగన్ సంతకం