BREAKING NEWS: కుప్పంలో దూసుకెళ్లిన వైసీపీ
ఎంతో ఉత్కంఠగా సాగిన మున్సిపల్ ఎన్నికల కౌంటిగ్ ఉత్కంఠగా కొనసాగుతోంది. దీని కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కొన్నిచోట్ల ఓడిన అభ్యర్థులు రీ కౌంటింగ్ కోరుతున్నారు.

Background
రాష్ట్రవ్యాప్తంగా నెల్లూరు నగర కార్పొరేషన్ సహా.. 13 మున్సిపాల్టీలకు జరిగిన ఎన్నికల కౌంటిగ్ మరికొద్ది సేపట్లో మొదలవుతుంది. కౌంటింగ్ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఉదయం 8 గంటలనుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభిస్తారు. సాయంత్రానికి పూర్తి స్థాయి ఫలితాలు వెల్లడిస్తారు.
నెల్లూరులో ఇలా..
నెల్లూరు నగర కార్పొరేషన్ కి సంబంధించి స్థానిక డీకేడబ్ల్యూ కాలేజీలో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలవుతుంది. ఏడు గంటలకు బ్యాలెట్ బాక్సులను భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్ లను తెరిచి ఆయా డివిజన్లకు సంబంధించిన టేబుళ్ల వద్దకు తీసుకెళ్తారు. మొత్తం 145 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్ వద్ద ముగ్గురు సిబ్బంది కౌంటింగ్ చేపడతారు. మొత్తంగా వెయ్యిమంది సిబ్బందిని కౌంటింగ్ కోసం అధికారులు నియమించారు. రెండు రౌండ్లలో లెక్కింపు ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటలకల్లా లెక్కింపు పూర్తవుతుంది. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో మొత్తం 54 డివిజన్లు ఉండగా ఇప్పటికే 8 డివిజన్లు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 46 డివిజన్ల ఫలితం ఈరోజు తేలుతుంది. 2,15,394 మంది ఓటర్ల తీర్పు ఈరోజు వస్తుంది.
బందోబస్తు ఇలా..
కౌంటింగ్ కేంద్రం నుంచి కిలో మీటర్ వరకు పోలీసులు 144 సెక్షన్ విధించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 600మంది సిబ్బందితో జిల్లా ఎస్పీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
బుచ్చిరెడ్డిపాలెంలో..
నెల్లూరు నగర కార్పొరేషన్ తోపాటు, బుచ్చిరెడ్డిపాలం మున్సిపాల్టీ ఎన్నికల కౌంటింగ్ కూడా ఇదే రోజు జరుగుతుంది. ఇక్కడ మొత్తం 20వార్డుల ఫలితం తేలాల్సి ఉంది. ఏకగ్రీవాలు ఏవీ లేకపోవడంతో అన్ని వార్డుల్లోనూ ఎన్నికలు జరిగాయి. బుచ్చిరెడ్డిపాలెంలో డీఎల్ఎన్ఆర్ కాలేజీలో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. సాయంత్రానికి ఫలితాల వెల్లడి పూర్తవుతుంది.
ఇప్పటికే అధికార పార్టీ అన్ని చోట్లా క్లీన్ స్వీప్ చేస్తామని ధీమాగా ఉంది, అటు ప్రతిపక్ష టీడీపీ మాత్రం ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగి ఉంటే తమనే విజయం వరిస్తుందని అంటోంది.
కుప్పంలో కూడా కౌంటింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు
తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం మునిసిపల్ ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్ధమైంది. ఈ మున్సిపాలిటీకి తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. పట్టణంలో మొత్తం 25 వార్డులు ఉన్నాయి. 14వ వార్డు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 24 వార్డులకు ఎన్నికలు జరిగాయి.
87 అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొన్న జరిగిన పోలింగ్‌లో 76.84శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓట్లు లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ప్రకటించారు మునిసిపల్ కమిషనర్ వి.ఎస్.చిట్టి బాబు. MFC ప్రభుత్వ జూనియర్ ఒకేషనల్ కళాశాల వేదికగా కౌంటింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపులో 67 మంది సిబ్బంది పాల్గొంటారు. లెక్కింపు కోసం 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. కౌంటింగ్ హాల్ - 1లో మొదటి రౌండ్ లో 1,2,3,4,5,6,7, రెండో రౌండ్ లో 16,17,18,19,20,21,22, హాల్ – 2లో మొదటి రౌండ్ లో 8,9,10,11,12,13,15, రెండవ రౌండులో 23,24,25 వార్డులకు రెండు రౌండ్లలో ఓట్లు లెక్కింపు ప్రక్రియ పూర్తి అవుతుంది.
కుప్పంలో పోలీసుల ఆదేశాలు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు బేఖాతర్
తిరుపతి: కుప్పంలో పోలీసుల ఆదేశాలు బేఖాతర్. మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఇలాకాలో వైఎస్సార్ సీపీ పాగా వేయడంతో పార్టీ కార్యకర్తలు బాణాసంచా కాల్చుతున్నారు. కుప్పంలో వైసీపీ శ్రేణుల విజయోత్సవాలు అంబరాన్ని అంటాయి. జెండాలతో వైసీపీ కార్యకర్తలు రోడ్లపై హల్ చల్ చేస్తున్నారు.
నెల్లూరులో వైసీపీ క్లీన్ స్వీప్.. 54 డివిజన్లలోనూ విజయకేతనం
నెల్లూరు కార్పొరేష్ ఎన్నికల్లో 54 డివిజన్లకు గాను అన్నింటినీ వైసీపీ కైవసం చేసుకుంది. అధికారిక ప్రకటన తర్వాత అభ్యర్థులు ధృవీకరణ పత్రాలు తీసుకుని సంబరాల్లో మునిగిపోయారు. కొవిడ్ నిబంధనలు అమలులో ఉండటంతో ఎలాంటి విజయోత్సవాలకు అవకాశం లేదు. దీంతో అభ్యర్థులు కౌంటింగ్ రూమ్ నుంచి ఎలాంటి హడావిడి లేకుండా ధృవీకరణ పత్రాలు తీసుకెళ్లారు. వైసీపీ కార్యకర్తలు, అభిమానుల సందడి మాత్రం కొనసాగింది.





















