Mudragada : ముద్రగడ వైసీపీలో చేరిక వాయిదా - కార్ల ర్యాలీ కూడా ! అసలేం జరిగింది?
Andhra News : ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరిక వాయిదాపడింది. కార్ల ర్యాలీని రద్దు చేసినట్లుగా ప్రకటించారు.
Mudragada Padmanabham : వైసీపీలో ముద్రగడ చేరిక వాయిదా పడింది. ఈ నెల 14న తన అనుచరులతో సహా సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతానని గతంలో ప్రకటించారు. ఇందు కోసం ఏర్పాట్లు చేసుకున్నారు. ద్ద సంఖ్యలో అనుచరులు వాహనాల్లో తరలి రండి, ఎవరి భోజనాలు వారే తెచ్చుకోండి అంటూ ఆమధ్య ముద్రగడ ఓ బహిరంగ లేఖ కూడా రాశారు. అయితే అనూహ్యంగా ఆయన మళ్లీ తన అనుచరులకు మరో లేఖ రాశారు. చేరిక వాయిదా పడిందని సమాచారమిచ్చారు. మరో తేదీలో తాను ఒక్కడినే వెళ్లి పార్టీలో చేరుతానని చెప్పారు.
కిర్లంపూడి నుంచి తాడేపల్లి వరకు భారీ ర్యాలీ చేపట్టి అనంతరం సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరాలని అనుకున్నారు ముద్రగడ పద్మనాభం. ర్యాలీకి సంబంధించి అధికారులకు పలు వివరాలు కూడా అందించారు. ఏం జరిగిందో కానీ హఠాత్తుగా అంతమంది ఒకేసారి వస్తే సెక్యూరిటీ ఇబ్బందులు తలెత్తుతాయని, అందుకే ర్యాలీని రద్దు చేసుకున్నట్టు తెలిపారు ముద్రగడ. అయితే ఈ కారణం కాస్త అతిశయోక్తిలాగా ఉందని అంటున్నారు. అదే సమయంలో తాను ఒక్కడినే వెశళ్లి ఈనెల 15 లేదా 16 తేదీల్లో పార్టీలో చేరుతానని చెప్పారు. ర్యాలీ రద్దు అయినా పధ్నాలుగో తేదనే చేరవచ్చు కదా ఎందుకు వాయిదా అనే సందేహం అనుచరుల్లో ప్రారంభమయింది.
ముద్రగడ పద్మనాభంను పార్టీలో చేర్చుకోవాలన్న ఉద్దేశంతోనే మిథున్ రెడ్డి సహా పలువురు వైసీపీ నేతలు ఇంటికి వచ్చి మాట్లాడారు. ఆయన అంగీకరించారు. బేషరతుగా పార్టీలో చేరుతున్నానని.. టిక్కెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదన్నారు. మళ్లీ జగన్ గెలిస్తే ఏదో ఓ పదవి ఇచ్చినా సరిపోతుందన్నారు. మద్రగడ ఇలా మాట్లాడటంతో చేరిక ఖాయమని అనుకున్నారు. కానీ ముద్రగడ చేరిక వల్ల వచ్చే లాభం కన్నా.. జరిగే నష్టమే ఎక్కువగా ఉంటుందని.. కొంత మంది గోదావరి జిల్లాల నేతలు చేర్చుకోవద్దని ఒత్తిడి చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆయన పది వేల మందితో బలప్రదర్శన చేస్తే.. తర్వాత టిక్కెట్ కోసం రేసులోకి వస్తారని ఇవ్వకపోతే పార్టీని డ్యామేజ్ చేస్తారన్న అనుమానాలు కూడా ఉండటంతో.. వైసీపీ హైకమాండ్ ఆయన విషయంలో స్లో అయినట్లుగా తెలుస్తోంది.
అయితే ముద్రగడ పద్మనాభం చేరిక ఉంటుందని ఆయనను ఖచ్చితంగా చేర్చుకుంటారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే జగన్ మోహన్ రెడ్డి చాలా బిజీగా ఉంటున్నారు. ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. పదహారో తేదీన పూర్తి స్థాయిలో అభ్యర్థుల జాబితాను ప్రకటించాలనుకుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన తీరికగా ఉండరని.. ఎన్నికల ప్రచారం కోసం.. గోదావరి జిల్లాల్లో పర్యటించినప్పుడు ముద్రగడ పద్మనాభంను పార్టీలో చేర్చుకునే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.