Raghurama krishna raju: భవధీయుడు మీ రఘురామకృష్ణరాజు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు.. సీఎం జగన్ కు లేఖలు సంధిస్తున్న విషయం తెలిసిందే. సూచనలు చేస్తూ.. లేఖలు రాసినా.. అవి జనాల్లోకి వేరేలా వెళ్తుంటాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి.
![Raghurama krishna raju: భవధీయుడు మీ రఘురామకృష్ణరాజు mp raghurama krishna raju letters to ysrcp Raghurama krishna raju: భవధీయుడు మీ రఘురామకృష్ణరాజు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/21/d5d83347fccbce7603e5cefb09f8203a_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు .. తమ పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం జగన్‌కు వరుసగా లేఖలు సంధిస్తున్నారు. మొదటగా నవ కర్తవ్యాల పేరిట హితబోధ చేశారు. తర్వాత నవ సూచనలు పేరుతో సలహాలు ఇచ్చారు. ఆ తర్వాత కూడా ఆయన లేఖలు సంధిస్తూనే ఉన్నారు. ఈ లేఖలు మీడియాలో హైలెట్ అవుతూండటం వైసీపీ పెద్దలకు అస్సలు నచ్చడం లేదు. దీంతో వారు రగిలిపోతున్నారు. కానీ చేయగలిగిందంతా ఇప్పటికే చేసేశారు. చేయడానికి ఏం లేదు. ఈ పరిస్థితిని రఘురామరాజు చాలా పక్కాగా ఉపయోగిచుకుంటున్నారు. మరింత ఘాటుగా లేఖలు సంధిస్తున్నారు.
రఘురామకృష్ణరాజు తొలిసారి ఎంపీ అయ్యారు. కానీ ఆయన రాజకీయాన్ని మొత్తం కాచి వడపోసినట్లుగా ఉన్నారు. తమ పార్టీని ఎక్కడా ధిక్కరించడం లేదని చెబుతూనే... పార్టీని ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెడుతున్నారు. మొదట ఆయన నవ ప్రభుత్వ హామీలు.. వైఫల్యాలు పేరుతో లేఖలు రాశారు. తర్వాత నవ కర్తవ్యాల సీరిస్ తీసుకున్నారు. ఈ లేఖల్లో ..తాము ఖురాన్, బైబిల్, భగవద్గీతగా చెప్పుకుని..అంతే పవిత్రంగా అమలు చేస్తున్నామని చెప్పుకుంటున్న మేనిఫెస్టోలోని డొల్లతనం మొత్తం బయట పెట్టారు. తొమ్మిది ప్రధానమైన హామీల్లోని లోపాలను వెల్లడించారు.
ప్రధానంగా సామాజిక పెన్షన్షన్లు రూ. మూడు వేలకు పెంచుకుంటూ పోతామని ఇచ్చినహామీలు అమలు చేయకపోవడాన్ని ఆయన సూటిగా ప్రశ్నించారు. నిజానికి ఇది పించన్ దారుల్లో చర్చనీయాంశమైన విషయం. ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడమో.. మరో కారణమో కానీ సీఎం జగన్.. ఈ హామీని అమలు చేయడానికి పించన్ దారులకు మరో రూ. 250 పెంచడానికి ఆయన పెద్దగా ఆసక్తిగా లేరు. దీనితో ప్రారంభించిన రఘురామ.. తొమ్మిది రోజుల పాటు మేనిఫెస్టోలోని హామీలను గుర్తు చేస్తూ.. లేఖలు సంధించారు. తన లేఖల్లో ప్రధానమైన హామీల అమలు డొల్లతనం మొత్తం బయట పెట్టారు. చివరికి జర్నలిస్టులకు కనీసం అక్రిడేషన్లు కూడా ఇవ్వకపోవడాన్ని ఓ లేఖలో ప్రస్తావించారు. నవ కర్తవ్యాల పేరిట.. ఏం చేయాలో.. కూడా లేఖలు పంపారు. అలాగే.. నవ సూచనలు పేరుతో సలహాలు.. సూచనలు కూడా ఇచ్చారు.
రఘురామకృష్ణరాజు లేఖలు.., సూటిగా సుత్తి లేకుండా ఉంటాయి. చదివే వారికి సమస్య ఇట్టే అర్థమైపోతుంది. అందుకే.. ఈ లేఖలు వైరల్ కావడం... వైసీపీ పెద్దలకు ఇబ్బందికరంగా మారింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన లేఖలు మాత్రం ఆపడం లేదు. అలాగని.. ఆ లేఖల్లో పార్టీ ధిక్కరణ అంశాలు ఏమీ ఉండవు. ఇట్లు మీ విధేయుడు అనే ముగిస్తారు. అంతే గౌరవంగా ప్రారంభిస్తారు కూడా. ఎక్కడో చోట..కాదు.. ప్రతీ చోట.. మన పార్టీ.. మన ప్రభుత్వం అని సంబోధిస్తూనే ఉంటారు. దీంతో అవి .. మంచి కోసం చెబుతున్న సూచనల్లాగే ఉంటాయి కానీ.. బయట ప్రజల్లో జరిగే ప్రచారం మాత్రం వేరుగా ఉంటుంది.
రఘురామకృష్ణరాజు .. తమ అధినేత జగన్‌ను టీజింగ్ చేస్తున్నారని..వైసీపీ నేతలు విమర్శలు చేస్తూ ఉంటారు. ఆ అసహనం.. సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటుంది. రఘురామకృష్ణరాజును... వ్యక్తిగతంగా దూషిస్తూ ఉంటారు. అయినా రఘురామ మాత్రం పట్టించుకోరు. తన లేఖలు తాను రాస్తూనే ఉంటారు. అందుకే... ప్రతిపక్షం కన్నా ఎక్కువగా వైసీపీకి ఇప్పురు రఘురామ టార్గెట్ అయ్యారు. ఆయన విషయంలో తీసుకుంటున్న ప్రతి చర్య.. రివర్స్ లో ఆయనను రెచ్చగొట్టడానికి ఉపయోగపడుతోంది కానీ.. ఆయనను కంట్రోల్ చేయలేకపోతున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)