Krishnam Raju : మొగల్తూరులో కృష్ణంరాజు సంస్మరణ సభ, ప్రభాస్ ను చూసేందుకు భారీగా తరలివచ్చిన ఫ్యాన్స్
Krishnam Raju : ప్రముఖ సినీనటుడు కృష్ణంరాజు సంస్మరణ సభను మొగల్తూరులో గురువారం నిర్వహించారు. 12 ఏళ్ల తర్వాత సొంత ఊరికి వచ్చిన ప్రభాస్ ను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
Krishnam Raju : ప్రముఖ సినీనటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు సంస్మరణ సభను పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో గురువారం నిర్వహించారు. మొగల్తూరు వచ్చిన కృష్ణంరాజు కుటుంబ సభ్యులను మంత్రులు కారుమూరు నాగేశ్వరరావు, రోజా, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, చీఫ్ విప్ ప్రసాదరాజు, ఎమ్మెల్యేలు గ్రంథి శ్రీనివాస్, నిమ్మల రామానాయుడు పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి కారుమూరు నాగేశ్వరరావు... కృష్ణంరాజు మరణంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారన్నారు. ఆయన గుర్తుగా స్మృతివనం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రెండెకరాల స్థలాన్ని కేటాయించామని చెప్పారు. సినీ, రాజకీయ రంగాల్లో రెబల్‌స్టార్ రాణించారని గుర్తుచేసుకున్నారు. స్మృతివనం ఏర్పాటు విషయాన్ని కృష్ణంరాజు కుటుంబసభ్యులకు తెలిపామని మంత్రి కారుమూరు తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కృష్ణంరాజు కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రెబల్‌స్టార్ మృతి తీరని లోటు అన్నారు. ప్రజల హృదయాల్లో రెబల్ స్టార్ సుస్థిరస్థానం సంపాదించుకున్నారని చెప్పారు.
జనసంద్రమైన మొగల్తూరు
బాహుబలి విజయం తర్వాత ప్రభాస్ ఫ్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ప్రభాస్ ఆనాటి నుంచి ఈనాటి వరకు తీరికలేకుండా పలు సినిమాల్లో నటిస్తున్నాడు. దీంతో ప్రభాస్ సొంత గ్రామం అయిన పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరుకు చాలా కాలంగా దూరమయ్యాడు. సుమారు 12 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ప్రభాస్ సొంత ఊరికి రావడంతో అభిమానులు ప్రభాస్ ను డైరెక్ట్ గా చూసేందుకు పెద్ద ఎత్తులో తరలివచ్చారు. దీంతో మొగల్తూరులోని రోడ్లన్నీ జన సందోహంగా మారాయి.
కుటుంబంతో కలిసి మొగల్తూరు కు ప్రభాస్...
ప్రభాస్ పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు సంస్మరణ సభ ఆయన స్వగ్రామమైన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని మొగల్తూరులో నిర్వహించారు. సుమారు 12 ఏళ్ల తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రభాస్ కుటుంబ సభ్యులతో కలసి మొగల్తూరు వచ్చారు. దశాబ్దకాలం తర్వాత తమ అభిమాన హీరో ఇక్కడికి రావడంతో ఈ ప్రాంతమంతా సందడి వాతావరణం నెలకొంది.
ప్రభాస్ ఇంటి వద్దకు భారీగా చేరుకొన్న అభిమానులు ప్రభాస్ కు జై కొట్టారు. రెబల్ స్టార్.. రెబల్ స్టార్ అంటూ నినాదాలతో ఆ ప్రాంగణం అంతా హోరెత్తింది. అదేవిధంగా మొగల్తూరు పట్టణంలో బైక్ ర్యాలీ చేశారు. 2012 లో తన తండ్రి సూర్య నారాయణ రాజు మరణించిన తరువాత సంతాప కార్యక్రమాల కోసం మొగల్తూరులో వారం రోజులు గడిపిన ప్రభాస్ మళ్లీ ఇన్నేళ్లకు మొగల్తూరు వచ్చారు.
సుమారు లక్షమందికి భోజన ఏర్పాట్లు
రెబల్ స్టార్ కృష్ణంరాజు సంస్మరణ సభకు విచ్చేస్తున్న వారికోసం సుమారు లక్ష మందికి భోజన సదుపాయాలను ఏర్పాటు చేయించారు ప్రభాస్. తరలివస్తున్న బంధువులకు, అభిమానులకు, గ్రామస్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా జిల్లా పోలీసు అధికారుల సహకారంతో అన్ని ఏర్పాట్లను చేశారు. హైదరాబాద్ లో కృష్ణంరాజు అంతిమ సంస్కారాలకు సంబంధించి తరలివచ్చిన అభిమానులకు కూడా ప్రభాస్ అంత వేదనలో ఉండి కూడా భోజనాలు ఏర్పాటు చేయడం తెలిసిందే.