MLC Suspend YSRCP : ఎమ్మెల్సీ అనంతబాబు సస్పెండ్ - కీలక నిర్ణయం తీసుకున్న వైఎస్ఆర్‌సీపీ !
వైఎస్ఆర్‌సీపీ నుంచి అనంతబాబును సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. హత్య చేసినట్లుగా అంగీకరించినా ఆయనపై చర్యలు తీసుకోకపోవడంపై విపక్షాలు విమర్శలు చేస్తూండటంతో నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
MLC Suspend YSRCP : హత్య కేసులో ఇరుక్కున్న ఎమ్మెల్సీ అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లుగా వైఎస్ఆర్‌సీపీ ప్రకటించింది. ఆయనను రక్షించడానికే వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్ ప్రయత్నిస్తోందని అందుకే పోలీసులు ఆయన విషయంలో చాలా రిజర్వ్‌గా వ్యవహరిస్తున్నారని .. సరిగ్గా విచారణ చేయడం లేదన్న విమర్శలను విపక్ష నేతలు చేస్తున్నాయి. స్వయంగా హత్య చేసినట్లుగా అంగీకరించినా ఇంకా పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదని ... ఆయన వైఎస్ఆర్‌సీపీ పెద్దలకు సన్నిహితుడని అందుకే ఆయనపై చర్యలు తీసుకోరని ప్రచారం చేస్తున్నారు. అదే సమయంలో అమలాపురం ఘర్షణలను కూడా అనంత్ బాబు కేసును పక్క దోవ పట్టించడానికే అధికార పార్టీ చేయించిందని వవన్ కల్యాణ్ , అచ్చెన్నాయుడు సహా పలువురు విమర్శించారు. ఈ పరిస్థితుల్లో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
ఈ నెల 19న తన దగ్గర డ్రైవర్‌గా పని చేసి మానేసిన సుబ్రహ్మణ్యం అనే దళిత యువకుడ్ని అనంతబాబు హత్య చేసి తీసుకొచ్చి వాళ్లింటి దగ్గరే వదిలేశారు. చివరికి అనేక మలుపులు తిరిగిన కేసులో ఆ హత్యను తానే చేసినట్లుగా అనంతబాబు అంగీకరించారు. ఏజెన్సీలో వైఎస్ఆర్‌సీపీ కీలక నేతగా ఉన్న ఆయన గంజాయి రవాణా నుంచి గనుల తవ్వకాల వరకూ అన్నీ ఆయన కనుసన్నల్లోనే జరుగుతుంటాయని ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. అధికారుల విధులకు ఆటంకం కలిగించడం, కలప అక్రమ రవాణా, మహిళలను వేధించడం, ఇతరులపై దాడులు వంటి పలు కేసులు రంపచోడవరం, అడ్డతీగల పోలీస్ స్టేషన్లలో అనంతబాబుపై నమోదయ్యాయి. ఆయనపై రౌడీ షీట్ కూడా ఉంది. వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్డతీగల పోలీస్ స్టేషన్లో నమోదైన రౌడీషీట్‌ను కూడా తొలగింపజేసుకున్నారు.
కాపు సామాజిక తరగతికి చెందిన అనంతబాబు తన కులాన్ని కొండ కాపుగా మార్చేసి ఎస్‌టి సర్టిఫికెట్ పొందారు. ఈ సర్టిఫికెట్‌తోనే 2006లో కోనలోవ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపిటిసి అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందాడు. ఎంపిపి కూడా అయ్యారు. క్యాస్ట్ సర్టిఫికెట్ నకిలీదని తేలడంతో అనంతబాబు ఎంపిపి పదవిని కోల్పోయారు. అదే సర్టిఫికెట్‌తో 2014లో రంపచోడవరం నియోజకవర్గం నుంచి వైసిపి అభ్యర్థిగా నామినేషన్ వేశారు. దీన్ని ఎన్నికల అధికారి తిరస్కరించారు. కానీ ఇప్పటికీ ఎజెన్సీలో వైఎస్ఆర్‌సీపీ వ్యవహాలన్నీ ఆయన చక్క బెడతారు. రంపచోడవరం ఎమ్మెల్యేగా నాగులపల్లి ధనలక్ష్మి ఉన్నప్పటికీ.. మొత్తం వ్యవహారాలు అనంతబాబు కనుసన్నల్లోనే జరుగుతాయని చెబుతారు. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ఏజెన్సీ వైఎస్ఆర్‌సీపీ నేతల్లో కూడా సంతృప్తి వ్యక్తమవుతోంది.