Minister RK Roja: తల్లిని తిట్టిన వ్యక్తితో పొత్తు పెట్టుకున్న వ్యక్తి పవన్: మంత్రి రోజా
Minister RK Roja: రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా పవన్ కల్యాణ్, చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
Minister RK Roja: తల్లిని తిట్టిన వ్యక్తితో పొత్తు పెట్టుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని.. టీడీపీతో పొత్తు ఉంటుందని ప్రకటించి తనను నమ్మిన అభిమానులను జనసేనాని మోసం చేశారని మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. జైలుకు పరామర్శించేందుకని వెళ్లి ప్యాకేజీ మాట్లాడుకున్నారని పవన్ కల్యాణ్ పై విమర్శలు గుప్పించారు. వార్డు మెంబర్ గా కూడా గెలవలేని వ్యక్తి.. రెండు చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన పవన్ కల్యాణ్.. సీఎం జగన్ గురించి మాట్లాడటం హాస్యాస్పదమని అన్నారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎంపీగా 5 లక్షలకు పైగా మెజారిటీతో గెలిచారని గుర్తు చేశారు. జగన్ ఫోటోతో పోటీ చేసిన గ్రంథి శ్రీనివాస్ చేతిలో పవన్ కల్యాణ్ ఓడిపోయారని విమర్శించారు. మిగిలిన పార్టీల జెండాలు మోసే కూలాగా పవన్ మారిపోయారని ఎద్దేవా చేశారు. తండ్రి వైెస్ రాజశేఖర్ రెడ్డి అడుగు జాడల్లో పయనిస్తూ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పాలన అందిస్తున్నారని కొనియాడారు. పవన్ తన స్థాయికి తగినట్లు మాట్లాడాలని సూచించారు. అమిత్ షాకు కంప్లైంట్ చేస్తానంటూ పవన్ మాట్లాడుతున్నాడని.. పవన్ దేనిలోనైనా సక్సెస్ అయ్యారా అంటూ ఆర్కే రోజా ప్రశ్నించారు. యుద్ధానికి సీఎం జగన్ ఎప్పుడూ రెడీగానే ఉన్నారని చెప్పుకొచ్చారు.
రాష్ట్రంలో కనీసం 10 చోట్ల అయినా పవన్ కల్యాణ్ కు అభ్యర్థులు ఉన్నారా అని ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సింహంలా సింగిల్ గానే వస్తారని అన్నారు. చంద్రబాబు సాక్ష్యాధారాలతో దొరికినా వీరికి సిగ్గు లేదని మండిపడ్డారు. టీడీపీ సానుభూతి డ్రామాలు ప్రజలు నమ్మడం లేదని అన్నారు. ఇన్నాళ్లూ వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబు తప్పించుకున్నారని, అవినీతికి పాల్పడితే అరెస్టు చేయకుండా ఉంటారా అని ప్రశ్నించారు. బ్రాహ్మణి టీడీపీ రాసిచ్చిన స్క్రిప్ట్ ను చదివారని, ఆమెకు రాజకీయంగా ఏమీ తెలియదని అర్థమైందని వ్యాఖ్యానించారు. లోకేశ్ ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలియదని ఎద్దేవా చేశారు. బ్రాహ్మణికి ఏం తెలుసని మాట్లాడుతున్నారంటూ ప్రశ్నించారు. స్కిల్ స్కామ్ గురించి వీరెవరూ ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. చంద్రబాబు సంతకాలు పెట్టారో లేదో సీఐడీ ఆఫీసుకు వెళ్తే చూపిస్తారని అన్నారు. చంద్రబాబు స్కిల్ స్కామ్ లో 13 చోట్ల సంతకాలు పెట్టారా లేదా, సీమెన్స్ సంస్థ ఒప్పందం చేసుకోలేదని చెప్పిందా లేదా, బోగస్ కంపెనీలకు నిధులు విడుదల చేశారా లేదా, అధికారులు వద్దని చెప్పినా చంద్రబాబు ఒత్తిడి చేశారా లేదా ఈ ప్రశ్నలకు టీడీపీ సమాధానం చెప్పాలని అన్నారు.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై నోటికొచ్చినట్లు మాట్లాడితే పవన్ అయినా, ఎవడికైనా పళ్లు రాలగొడతామని ఆర్కే రోజా హెచ్చరించారు. పవన్ పిచ్చికి జగనన్నతో చెప్పి ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేయిస్తామన్నారు. సీమన్స్ మాజీ ఎండీ సుమన్ బోస్ ఓ పెద్ద దొంగ అని, సుమన్ బోస్ మాజీ ఎండీ ఎందుకయ్యారని ఆర్కే రోజా ప్రశ్నించారు. సీమన్స్ సంస్థ కోర్టులోనే ఆ వ్యక్తి తమకు తెలియకుండా చేశాడమని కోర్టులోనే చెప్పినట్లు ఆర్కే రోజా తెలిపారు.