Hindupuram YSRCP : హిందూపురం టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలకు వైసీపీ బంపర్ ఆఫర్లు - విస్తృతంగా చేరికలకు ప్లాన్ !
Hindupuram POlitics : హిందూపురం వైఎస్ఆర్‌సీపీలో చేరికలకు మంత్రి పెద్దిరెడ్డి ప్లాన్ చేశారు. టీడీపీ నేతలతో మంతనాలు జరిపారు. ద్వితీయ శ్రేణి నేతల్ని చేర్చుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
Hindupuram YSRCP : రాష్ట్రంలోనే తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గంలో ఈ సారి వైసీపీ జెండా ఎగురవేయాలని ముఖ్యమంత్రి జగన్ పట్టుదలతో ఉన్నారు. హిందూపురం నియోజకవర్గం లో వైసీపీ దూకుడు పెంచింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో హిందూపురం నియోజకవర్గాన్ని నందమూరిపురంగా పిలుచుకుంటారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి హిందూపురంలో నందమూరి కుటుంబ సభ్యులే ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ వస్తున్నారు. ఈ టీడీపీ కంచుకోటలో ఇప్పుడు వైసీపీ జెండా ఎగురవేయాలని చూస్తున్నారు.
పెద్దిరెడ్డికి బాధ్యత ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి
హిందూపురం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు పావులు కదుపుతున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి బలమైన పార్టీ క్యాడర్ ఉంది. 2019 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా జగన్ మోహన్ రెడ్డి హవా కొనసాగిన హిందూపురం నియోజకవర్గం లో మాత్రం నందమూరి బాలకృష్ణ కె ప్రజలు పట్టం కట్టారు. ఆ ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి మాజీ రిటైర్డ్ డిఐజి మహమ్మద్ ఇక్బాల్ పై 17,750 ఓట్ల మెజార్టీతో నందమూరి బాలకృష్ణ విజయం సాధించారు. రాష్ట్రంలో వైసిపి అధికారాన్ని చేపట్టింది. అనంతరం మహమ్మద్ ఇక్బాల్ కు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి హిందూపురం నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జిగా కొనసాగిస్తూ వచ్చారు.
ఇటీవల వైసీపీ ఇంచార్జ్ గా దీపికారెడ్డిని నియమించిన సీఎం జగన్
అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహమ్మద్ ఇక్బాల్ ను నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యత నుంచి తప్పించి కురువ సామాజిక వర్గానికి చెందిన దీపికా రెడ్డిని హిందూపురం నియోజకవర్గం ఇన్చార్జిగా నియమించారు. మరో మూడు మాసాల్లో ఎన్నికలు సమీపిస్తుండడంతో హిందూపురంలో ఎలాగైనా వైసీపీ జెండా ఎగరేసేందుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నేతలు పట్టుదలగా కృషి చేస్తున్నారు. ఇటీవల కాలంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య సహాయకుడు చంద్ర వ్యాస్ అనే వ్యక్తి హిందూపురం నియోజకవర్గం ఇన్చార్జి దీపికా రెడ్డి తో కలిసి మండలాల వారీగా విస్తృతంగా పర్యటించారు. నియోజకవర్గం లోని టిడిపి సర్పంచులు, మాజీ జడ్పిటిసిలు, టిడిపిలో బలంగా ఉన్న నాయకులతో సమావేశలు సైతం ఏర్పాటు చేశారు.
టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలను పార్టీలో చేర్చుకునేందుకు కసరత్తు
ఈనెల 24,25 తేదీలలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గ పర్యటనలో టిడిపి ల నుంచి బలమైన నాయకులను వైసీపీ పార్టీలోకి చేర్చే విధంగా చంద్ర వ్యాస్ అండ్ టీం మండలాల వారీగా పావులు కదిపింది. నియోజకవర్గంలో వైసిపి పార్టీ చేస్తున్న ఈ వ్యవహారం కాస్త హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కు చేరింది. వెంటనే స్పందించిన బాలకృష్ణ హుటాహుటిన హిందూపురం కు చేరుకున్నారు. నియోజకవర్గంలోని టిడిపి మండల స్థాయి నేతలతో పంచాయతీల వారీగా సమావేశాలకు హాజరు కావాలని సమాచారం చేరవేశారు. ఈ సమావేశాల్లో పంచాయతీల్లో బలంగా ఉన్న టీడీపీనేతలు, పార్టీ నాయకులు హాజరయ్యారు. సమావేశంలో బాలకృష్ణ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.
వెంటనే పార్టీ నేతలతో బాలకృష్ణ సంప్రదింపులు
మండలాల నాయకులతో పంచాయతీ నాయకులతో విడివిడిగా సమావేశాలు ఏర్పాటు చేసి వారికున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలోని పార్టీ క్యాడర్ దెబ్బతీసేలా కొన్ని పార్టీలు రాజకీయ కుటిల ప్రయత్నాలు చేస్తున్నాయని వాటికి మీరు ఎవరు భయపడకుండా ఉండాలని భరోసా ఇచ్చినట్టు సమాచారం. మరో మూడు మాసాల్లో ఎన్నికలు వస్తున్నందున వచ్చేది మన తెలుగుదేశం ప్రభుత్వమీ అని మండల పంచాయతీ స్థాయి నేతలకు బాలకృష్ణ ధైర్యాన్ని భరోసాను ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే వైసిపి మాత్రం వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా హిందూపురం నియోజకవర్గంలో వైసిపి జెండాను ఎగరవేయాలని పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది.