Botsa on pawan : సిల్క్ స్మితకూ జనం వస్తారు - ఇళ్లపై పవన్ ఆరోపణలు కరెక్ట్ కాదన్న బొత్స !
పవన్‌కే కాదు సిల్క్ స్మిత వచ్చినా జనం వస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ తేల్చేశారు. పవన్ యుగపురుషుడు కాదని ఆయన ఏం చెప్పినా ప్రజలు నమ్మరని అన్నారు.
Botsa on pawan : జగనన్న ఇళ్ల నిర్మాణంలో రూ. పదిహేను వేల కోట్ల మేర అవినీతి జరిగిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. పవన్ చేసే ఆరోపణలను నమ్మడానికి ఏపీ ప్రజలు అమాయకులు కాదన్నారు. రాష్ట్రంలో ప్రతి పేదకు ఇల్లు ఉండాలన్నదే నాడు రాజశేఖర్ రెడ్డి నేడు జగన్ లక్ష్యమని.. అందుకే మొదటి కేబినెట్ లొనే అందరికి ఇల్లు పై నిర్ణయం జరిగిందన్నారు. సుమారు 30 లక్షల మంది అర్హులు ఉన్నట్టు గుర్తించామన్నారు. 71 వేల ఎకరాలు అందరికి ఇళ్ల నిర్మాణం కోసం సేకరించామనిడం అందులో 25 వేల ఎకరాలు ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు.
పేదవాళ్లకు ఇళ్లు ఇస్తే తప్పేమిటని బొత్స ప్రశ్న
పేదవాళ్లకు ఇల్లు ఇస్తే తప్పా.. అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఇళ్ల విషయంలో విజయనగరం జిల్లాలో పవన్ దగ్గరకు వచ్చి ఎవరైనా ఫిర్యాదు చేశారా అని ప్రశ్నించారు. పవన్ ఏమి చెబుతున్నాడని.. గాలి కబర్లు చెప్పొద్దని బొత్స మండిపడ్డారు. పవన్ కల్యాణ్ గాలి కబుర్లు చెబుతున్నారని.. ఆయనేమైనా యుగ పురుషుడా... చెప్పిందల్లా ప్రజలు నమ్మేయడానికి అనిప్రశ్నించారు. పవన్ కల్యాణ్ పర్యటనకు పెద్ద ఎత్తున జన స్పందన వచ్చిందని మీడియా ప్రతినిధులు చెప్పడంతో.. బొత్స సత్యనారాయణ భిన్నంగాస్పందించారు. సినిమా వాళ్లు వస్తే క్రేజ్‌తో చూడటానికి వస్తారన్నారు. పవన్ కల్యాణ్ కాకపోతే.. సినిమా హీరోయిన్లు.. వ్యాంప్ క్యారెక్టర్లు వేసుకునేవారు వచ్చినా చూస్తారన్నారు. పవన్ వచ్చినా...చనిపోయిన వాంప్ సిల్క్ స్మిత వచ్చినా కూడా జనాలు వస్తారని అందులో విశేషం ఏమీ లేదన్నారు.
గుంకలాంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన పవన్ కల్యాణ్
విజయనగరం జిల్లా నుంచి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు బొత్స సత్యనారాయణ. ఆ జిల్లాలోని గుంకలాం గ్రామంలో సీఎం హోదాలో జగన్ రెండేళ్ల కిందట శంకుస్థాపన చేసిన ఇళ్లు అసలు ముందుకు సాగడం లేదు. ఆ ఒక్క చోటే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అన్ని చోట్లా ఇదే పరిస్థితి ఉందని.. పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడటం వల్లనే ఇళ్లు ముందుకు సాగడం లేదని ఆరోపిస్తూ.. పవన్ కల్యాణ్.. జనసేన తరపున పోరాటం ప్రారంభించారు. మూడు రోజుల పాటు డిజిటల్ క్యాంపెయిన నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తాను కూడా స్వయంగా గుంకలాం వెళ్లి ఇళ్లను పరిశీలించారు. ఆ సందర్భంగా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
సెలబ్రిటీ నాయకుడు అంటూ పవన్‌పై సెటైర్లు
పవన్ కల్యాణ్ ఇళ్లపై చేసిన విమర్శలను. బొత్స కౌంటర్ ఇచ్చారు కానీ.. ఇళ్లు ఎందుకు ఆలస్యం అవుతున్నాయో మాత్రం చెప్పలేదు. పవన్ చేసిన రాజకీయ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు కానీ.. సమస్యకు కారణం మాత్రం చెప్పలేదని జనసైనికులు అంటున్నారు. పవన్ కల్యాణ్‌పై బొత్స సత్యనారాయణ ఇటీవల పెద్దగా విమర్శలు చేయడం లేదు. ఇతర నేతలు ఘాటుగా మండిపడుతూ ఉంటారు. బొత్స మాత్రం సెలబ్రిటీ నాయకుడు అని సంబోధిస్తూ సుతిమెత్తగా విమర్శలు చేస్తూంటారు.ఈ సారి తన జిల్లాలోనే ప్రభుత్వంపై విరుచుకుపడటంతో స్పందించారు.