AP IPS Transfers : ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు - సుప్రీంకోర్టు చెప్పినా ఏబీవీకి మాత్రం నో పోస్టింగ్ !
ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. కానీ ఏబీవీ వెంకటేశ్వరరావుకు మాత్రం పోస్టింగ్ ఇవ్వలేదు.
ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున ఐపీఎస్ అధికారులను బదిలీ చేసారు. ఏసీబీ డీఐజీగా పి.హెచ్.డి.రామకృష్ణను నియమించారు. టెక్నికల్ సర్వీసెస్ డీఐజీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు. ఐజీపీ స్పోర్ట్స్, సంక్షేమంగా ఎల్.కె.వి.రంగారావును నియమించారు. రైల్వే ఏడీజీగా ఎల్.కె.వి.రంగారావుకు అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు. ఆక్టోపస్ డీఐజీగా ఎస్.వి.రాజశేఖర్, శాంతిభద్రతలు డీఐజీగా ఎస్.వి.రాజశేఖర్‌కు అదనపు బాధ్యతలు ఇచ్చారు. పోలీసు శిక్షణ వ్యవహారాల డీఐజీగా కె.వి.మోహన్‌రావు, కోస్టల్ సెక్యూరిటీ డీఐజీగా ఎస్.హరికృష్ణ, గ్రేహౌండ్స్ డీఐజీగా గోపినాథ్ జెట్టిని నియమించారు. న్యాయ వ్యవహారాల ఐజీపీగా గోపినాథ్ జెట్టికి అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు. 16వ బెటాలియన్ కమాండెంట్‌గా కోయ ప్రవీణ్ బదిలీ అయ్యారు. పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్టు చేయాలని డి.ఉదయభాస్కర్‌ను ఆదేశించారు.
విజయవాడ రైల్వే ఎస్పీగా విశాల్ గున్నీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్ కమాండెంట్‌గా రవీంద్రనాథ్‌బాబుకు అదనపు బాధ్యతలు ఇచ్చారు. ప్రస్తుతం కాకినాడ జిల్లా ఎస్పీగా ఉన్న రవీంద్రనాథ్‌బాబు ఉన్నారు. గుంతకల్లు రైల్వే పోలీసు సూపరింటెండెంట్‌గా అజిత వేజెండ్లకు అదనపు బాధ్యతలు ఇచ్చారు. పోలీసు హెడ్‌క్వార్టర్స్‌కు పి.అనిల్‌బాబును బదిలీ చేశారు. రంపచోడవరం అదనపు ఎస్పీ(ఆపరేషన్స్)గా జి.కృష్ణకాంత్ బదిలీ అయ్యారు. చిత్తూరు అదనపు అడ్మిన్ ఎస్పీగా పి.జగదీశ్ , పోలీసు హెడ్‌క్వార్టర్స్‌కు డి.ఎన్.మహేశ్ , పాడేరు అదనపు ఎస్పీ అడ్మిన్‌గా తుహిన్ సిన్హా , పల్నాడు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్‌గా బిందు మాధవ్ గరికపాటి, విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీగా పి.వి.రవికుమార్ లను నియమించారు.
ఏపీ ఐపీఎస్‌లను భారీగా బదిలీ చేసి.. పలువురుకి అదనపు బాధ్యతలు అప్పగించినప్పటికీ.. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీవీ వెంకటేశ్వరరావుకు మాత్రం ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. ఐపీఎస్ అధికారి ఏబీవీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ముగిసిందని ఆయనకు తక్షణం పోస్టింగ్ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టుతీర్పు వచ్చిన తర్వాత ఓ సారి చీఫ్ సెక్రటరీని కలిసి సుప్రీంకోర్టు ఉత్తర్వులను.. తనకు పోస్టింగ్ ఇవ్వాలన్న లెటర్‌ను ఇచ్చారు. ప్రాసెస్‌లో పెడతామని చీఫ్ సెక్రటరీ హామీ ఇచ్చారని ఏబీవీ మీడియాకు తెలిపారు. అయితే ఆయనకు ఇప్పుడు కూడా ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు.
గత ప్రభుత్వంలో ఇంటలిజెన్స్ చీఫ్‌గా పని చేసిన ఏబీవీపై వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం పలు ఆరోపణలు చేసింది. పలు కేసులతో సస్పెన్షన్ వేటు వేసింది. రెండేళ్లు అయినా ఆయనపై కేసులు తేలకపోవడంతో సస్పెన్షన్ ఆటోమేటిక్‌గా ముగిసిందని సుప్రీంకోర్టు చెప్పింది. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం సుప్రీంకోర్టు తీర్పును కూడా పెద్దగా పట్టించుకోనట్లుగా కనిపిస్తోంది.