AP Ministers On Chandrababu : చంద్రబాబుకు కుప్పం అంటే భయం పట్టుకుంది, జగన్ దెబ్బకు వీధి వీధి తిరుగుతున్నారు- మంత్రులు అంబటి, కారుమూరి
AP Ministers On Chandrababu : కుప్పం పేరు చెబితే చంద్రబాబుకు భయం పట్టుకుందని మంత్రులు అంబటి, కారుమూరి విమర్శించారు. సీఎం జగన్ దెబ్బకు కుప్పంలో వీధి వీధి తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.
AP Ministers On Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రులు విరుచుకుపడ్డారు. చంద్రబాబు కుప్పం పర్యటనపై మండిపడ్డారు. మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మాట్లాడుతూ... జగన్ దెబ్బతో కుప్పంలో బాబు వీధి వీధి తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. కుప్పంలో విధ్వంసాన్ని ప్రేరేపించిన చంద్రబాబును అరెస్టు చేయాలని, ఆయన రాజకీయమంతా మోసం - వంకర అని ఎద్దేవా చేశారు. పక్క రాష్ట్రానికే పరిమితమైన చంద్రబాబుకు కనీసం కుప్పంలో ఇల్లు, ఆఫీసు లేదన్నారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ... 2019 సాధారణ ఎన్నికల తర్వాత, కుప్పంలో జరిగిన అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ కుప్పకూలిపోయిందన్నారు. 33 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు కుప్పం ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. కుప్పంలో బాబుకు ఇళ్లు లేకపోయినా, ఆఫీసు లేకపోయినా, కనీసం నామినేషన్ వేయటానికి కూడా రాకపోయినా కుప్పం ప్రజలు ఇంతకాలం గెలిపిస్తూ వచ్చారన్నారు.
కుప్పం చుట్టూ ప్రదక్షిణలు
" వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక, ఈ మూడేళ్లలో ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఏమిటో చూశాక కుప్పం ప్రజల్లో మార్పు వచ్చింది. మూకుమ్మడిగా ప్రతి ఎన్నికల్లోనూ వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టారు. దాంతో ఇవాళ చంద్రబాబు వీధి వీధి తిరిగే పరిస్థితి వచ్చింది. కుప్పంలో పూర్తిగా కుప్పకూలిపోయి, ఆఖరికి రోడ్డు మీద కూర్చునే పరిస్థితి చంద్రబాబుకు వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక.. గత మూడేళ్లుగా చంద్రబాబు కుప్పం నియోజకవర్గానికి మాత్రమే పరిమితం అయ్యారు. కుప్పం చుట్టూనే ప్రదక్షిణలు చేస్తున్నారు. కుప్పంలో గెలుపే బాబుకు పెద్ద సవాల్ గా మారింది. సీఎం జగన్ పరిపాలనలో సంక్షేమ పథకాలు శాచురేషన్ విధానంలో, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ అందుతున్నాయి. ఇప్పటివరకూ కుప్పం ప్రజలను చంద్రబాబు ఓట్లు వేసే యంత్రాలుగానే చూశారు. కుప్పం ప్రజలు మూడు దశాబ్దాలుగా బాబును గెలిపించి, ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా చేసినా, ఆ నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ధి చేయలేదు."- మంత్రి కారుమూరి నాగేశ్వరరావు
చంద్రబాబుకు సవాల్
కుప్పంలో ఏ వీధి అయినా సెలక్ట్ చేసుకుంటే అక్కడికే వచ్చి వైసీపీ సంక్షేమ పథకాలపై బహిరంగ చర్చ రావాలని చంద్రబాబు సవాల్ విసిరారు మంత్రి కారుమూరి. 33 ఏళ్లలో ప్రజలకు అందిన సంక్షేమ పథకాలు ఏమిటో.. వైసీపీ ప్రభుత్వం వచ్చాక, మూడేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు ఏమిటో అడుగుదామన్నారు. రాజకీయాల్లో 45 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు, నిత్యం అబద్ధాలతో ప్రజలను ఎలా మభ్యపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు జీవితమంతా మోసమే, అధికారంలోకి వచ్చింది కూడా మోసపూరితంగానే అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు కలిసి కుట్రలు చేసి, జగన్ ని ఎన్ని కష్టాలు పెట్టినా, కేసులు పెట్టి జైల్లో పెట్టినా... ఆయన ప్రజల్లోకి వెళ్లి సింగిల్‌గా అధికారంలోకి వచ్చారన్నారు. అదీ చంద్రబాబుకి, జగన్ కి ఉన్న తేడా అని మంత్రి కారుమూరి అన్నారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే తన వాళ్లకే పనులు చేయాలంటూ మొదటి కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో చెప్పారని ఆరోపించారు.
కుప్పం అంటే బాబుకు భయం
మంత్రి అంబటి కూడా చంద్రబాబుపై మండిపడ్డారు. చంద్రబాబుకు కుప్పం అంటే భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. కుప్పం తన చేతి నుంచి జారిపోతుందనే భావన చంద్రబాబు అంతరాత్మకు తెలిసినట్టుందని వ్యాఖ్యానించారు. మూడేళ్ల జగన్ పాలన తర్వాత కుప్పంలో చంద్రబాబుకు ఓటమి మాత్రమే మిగిలిందన్నారు. 33 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉండి కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు ఏమిచేశారని ప్రశ్నించారు. కుప్పం బ్రాంచ్ కేనాల్ ను కూడా చంద్రబాబు పూర్తి చేయలేకపోయారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు అన్ని పోగొట్టుకున్నారన్నారు. కుప్పం ప్రజలు చంద్రబాబు పక్షాన లేరని, సీఎం జగన్ పక్షాన ఉన్నారన్నారు. మూడు రోజులు చంద్రబాబు పర్యటనతో కుప్పం కాలుతుందన్నారు. వైసీపీ కార్యకర్తలు జెండాలు కట్టుకుంటే చంద్రబాబుకు ఏంటి బాధని ప్రశ్నించారు. చంద్రబాబు వస్తుంటే వైసీపీ కూడా స్వాగతం పలకాలా అని నిలదీశారు.