Mandous Cyclone Effect: మరింత బలహీనపడిన మాండూస్ తుఫాను, ఏపీలో ఆ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు
Mandous Cyclone Effect: మాండూస్ తుపాను శుక్రవారం అర్ధరాత్రి నుండి శనివారం తెల్లవారుజాములోపు పుదుచ్చేరి- శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందన్నారు.
Mandous Cyclone Effect: ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర తుపాను మాండూస్ తుపానుగా బలహీనపడిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది ప్రస్తుతానికి జఫ్నా(శ్రీలంక) తూర్పు ఆగ్నేయంగా 280కి.మీ., మహాబలిపురంకు 90 కి.మీ., చెన్నైకి 130 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. గడిచిన 6 గంటల్లో వాయువ్య దిశగా గంటకు 14కి.మీ వేగంతో కదులుతుందన్నారు. శుక్రవారం అర్ధరాత్రి నుండి శనివారం తెల్లవారుజాములోపు పుదుచ్చేరి- శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందన్నారు. తీరం దాటే సమయంలో 65-85 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని విపత్తుల సంస్థ అంబేద్కర్ తెలిపారు.
దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
మాండూస్ తుపాను ప్రభావంతో రేపు దక్షిణకోస్తాలోని ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మరియు రాయలసీమలోని చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, మిగిలిన చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అంబేద్కర్ విపత్తుల సంస్థ ఎండీ తెలిపారు. సముద్రం అలజడిగా ఉంటుందని శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు.తుపాను తీరం దాటినప్పటికి శనివారం, ఆదివారం ఈ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
తుఫాన్ కదలికలను స్టేట్ ఎమర్జన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రభావం చూపే జిల్లాల్లోని అధికారులను అప్రమత్తం చేస్తున్నామన్నారు. సహాయక చర్యలకోసం ప్రకాశం-2, నెల్లూరు-3, తిరుపతి-2, చిత్తూరు-2 మొత్తం 5ఎన్డీఆర్ఎఫ్, 4ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పంపించామని తెలియజేశారు.
Press release on increase in rainfall activity over Andhra Pradesh on 09th and 10th December, 2022 due to severe cyclonic storm MANDOUS over Southwest Bay of Bengal off North Tamil Nadu & Puducherry Coasts. pic.twitter.com/D475brTMj4
— MC Amaravati (@AmaravatiMc) December 9, 2022
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మాండూస్ తుపాను ప్రభావం
మాండూస్ తుపాను ప్రభావంతో తిరుపతి చిత్తూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు తిరుపతి కలెక్టర్లు తుపాను ప్రభావంపై సమీక్ష సమావేశాలు నిర్వహించారు. అధికారులకు సెలవులు రద్దు చేశారు. సచివాలయం సిబ్బందిని 24 గంటలు అందుబాటులో ఉండాల్సిందిగా ఆదేశించారు. తుపాను ప్రభావంతో తిరుపతి, తిరుమలలో, చిత్తూరు పుంగనూరు తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో వర్షం, చలికి తిరుమలకు వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి తిరుమలలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. లడ్డూ వితరణ కేంద్రంలో వర్షపు నీరు నిండిపోవడంతో వర్షపు నీటిని బయటకు పంపేందుకు టీటీడీ పారిశుద్ధ్య కార్మికులు ప్రయత్నిస్తున్నారు. వర్షం కారణంగా తిరుమల ఘట్ రోడ్డులో ప్రయాణించే భక్తులను టీటీడీ విజిలెన్స్ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంది. ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగి పడే అవకాశం ఉండడంతో భక్తులు అప్రమత్తంగా ప్రయాణించాలని సూచించింది. తిరుమలలో స్వామి వారి దర్శనంతరం బయటకు వచ్చిన వృద్దులు, చంటి పిల్లల తల్లిదండ్రులు వసతి గృహాలకి చేరుకునేందుకు ఇబ్బంది పడుతున్నారు.