Political Foul Language : తిట్లకు తిట్లే సమాధానం ! ఏపీ రాజకీయాలు దారి తప్పాయా !?
తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల నేతలు తిట్లు, బూతులనే రాజకీయ భాషగా మార్చుకున్నారు. ఒకరిని మించి ఒకరు భాషా ప్రావీణ్యం ప్రదర్శిస్తూ రాజకీయాలపై ప్రజల్లో అసహ్యం కలిగేలా చేస్తున్నారు.
" తమలపాకుతో నువ్వొకటి అంటే తలుపు చెక్కతో నేను రెండు అంటా " అనే పద్దతి రాజకీయాల్లో కామన్. నువ్ ఒకటి తిడితి నేను రెండు బూతులు విసురుతానని ప్రాక్టికల్‌గా నేతలు చూపిస్తూనే ఉంటారు. తాము తిడితే ఎదుటి వారు కూడా తిట్ల వర్షం కురిపిస్తారని తెలిసి కూడా రాజకీయ నేతలు ఎందుకు " తిట్ల భాష"ను ఎంచుకుంటున్నారు ?. తమను తిట్టినా పర్వాలేదు ఎదుటి వారిని తిట్టాలన్న స్ట్రాటజీని ఎందుకు అవలంభిస్తున్నారు ? రాజకీయాలపై గౌరవాన్ని దిగజారుస్తున్నామని నేతలు ఎందుకు అనుకోవడం లేదు ?
సీఎం, మంత్రులపై అయ్యన్న గీత దాటి మరీ తిట్లు !
తెలుగుదేశం పార్టీకి చెంచిన మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు మంత్రులు, ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు ఒక్క సారిగా వైరల్ అయ్యాయి. గుంటూరు జిల్లాలో మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావు స్వగ్రామంలో నిర్వహించిన వర్థంతి సభకు హాజరైన ఆయన ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై వైసీపీ నేతలు బహిరంగంగా ఎలాంటి స్పందనలు వ్యక్తం చేయలేదు కానీ.. నేరుగా రంగంలోకి దిగారు. ఆ పార్టీ ఎమ్మెల్యే చంద్రబాబు ఇంటిని ముట్టడించడానికి ప్రయత్నించడం .. అక్కడ ఘర్షణ జరగడంతో సమస్య రాజకీయ కలకలానికి దారి తీసింది. అయితే ఇప్పుడు ఎక్కువ మంది అయ్యన్న మాటలను ఖండిస్తున్నారు కానీ అదే సమయంలో తెలుగుదేశం పార్టీ నేతలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పటి వరకూ ప్రయోగించిన భాషను కూడా ప్రశ్నిస్తున్నారు. రెండు పార్టీల నేతలూ దారి తప్పారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. Also Read : ఎంఐఎంనే టార్గెట్ చేసిన అమిత్ షా ! ఢిల్లీలో దోస్తి - తెలంగాణలో కుస్తీ బీజేపీ విధానం అదేనా !?
రెండున్నరేళ్లుగా టీడీపీపై బూతులతో విరుచుకుపడుతున్న వైఎస్ఆర్‌సీపీ నేతలు !
సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షాలపై రాజకీయ విమర్శలు చేసే విషయంలో కానీ మరో పోరాటం విషయంలో కానీ సంయమనం పాటిస్తుంది. అధికారంలో ఉన్నాం కాబట్టి ఆ మర్యాద పాటించాలని అనుకుంటారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మొదటి నుంచి అలాంటి అభిప్రాయం ఎప్పుడూ పెట్టుకోలేదు. ప్రతిపక్ష నేత చంద్రబాబు దగ్గర్నుంచి ఆ పార్టీ నేతలందర్నీ ఇష్టారీతిన తిట్టడాన్ని ఓ విధానంగా పెట్టుకున్నారు. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం కూడా అంతే. మంత్రులు కూడా నోరును అదుపులోకి పెట్టుకోలేకపోయారు. కొంతమంది మంత్రుల ప్రెస్‌మీట్లను లైవ్‌లో చూపించడానికి కూడా కొన్ని విలువలు పాటించే న్యూస్ చానళ్లు ముందూ వెనుకాడేవి. అలాంటి పొలిటికల్ లాంగ్వేజ్‌ను వైఎస్ఆర్ కాంగ్రెస్ తన విధానంగా తీసుకుంది. Also Read : పవన్ కళ్యాణ్-రానా ‘భీమ్లానాయక్’ లో నిత్యామీనన్ తో పాటూ మరో మీనన్..రానాకు జోడీగా మలయాళ మారుతం..
మీరు అంటే తప్పు లేదు.. మేమంటే తప్పా అని టీడీపీ ఎదురుదాడి!
ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా అదే దారిలో వెళ్తోంది. ఇంకా ఎంత కాలం తాము వారితో తిట్లు తినాలని అనుకున్నారో .. ఇక ఎదురుదాడి చేయాల్సిన సమయం వచ్చిందని ఫిక్సయ్యారో కానీ వారు కూడా అదే లాంగ్వేజ్ లో పద ప్రయోగాలు ప్రారంభించారు. అయ్యన్న పాత్రుడు ఘాటు విమర్శలు చేస్తారు కానీ ఇప్పటి వరకూ ఆ తరహాలో ఎప్పుడూ మాట్లాడలేదు. బూతుల స్థాయి విమర్శలు చేయడం ఇదే మొదటి సారి. తన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన ఆయన ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. మరింత ఆజ్యం పోసేలా మాట్లాడుతున్నారు చర్చిల్లో పాస్టర్లు " ఓ మై సన్ " అంటారని దాన్నే తాను తెలుగులో చెప్పానని సమర్థించుకుంటున్నారు. అయ్యన్న వ్యాఖ్యలను ప్రశ్నిస్తున్న వారికి తెలుగుదేశం పార్టీ నేతలు ఒకే ప్రశ్న వేస్తున్నారు. గతంలో వైసీపీ నేతలు బూతులు మాట్లాడినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు అని . Also Read : పదవులన్నీ పీకేశారు.... టీడీపీపై ఎమ్మెల్యే రోజా ఫైర్... అయ్యన్న విజ్ఞతకే వదిలేమని కామెంట్స్
రాజకీయ భాషను దిగజార్చేసిన తెలుగుదేశం, వైఎస్ఆర్‌సీపీ !
అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ నేతలు వైసీపీ నేతలు చేసిన గత బూతుల ప్రసంగాలతో పోల్చి "మీరు అంటే తప్పు లేదు మేము అంటే తప్పు వచ్చిందా" అని ఎదురుదాడి చేస్తున్నారు. కానీ ఇలా బూతులు తిట్టడాన్నే కొంతమంది పొలిటికల్ హీరోయిజంగా భావించి ప్రోత్సహిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఫలితంగా తాము సైలెంట్‌గా ఉంటే ప్రజల్లో చేతకాని వాళ్లం అనే ముద్ర పడుతుందన్న ఇద్దేశంతో ఇతర పార్టీలూ అదే భాష ఎంచుకుంటున్నాయి. ఫలితంగా రెండు రాజకీయ పార్టీల నేతలు అసలు విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. రెండు పార్టీలూ కలిసి రాజకీయాలపై గౌరవాన్ని తగ్గిస్తున్నాయి. రాజకీయాలంటే ఇంత అసహ్యంగా ఉంటాయన్న అభిప్రాయాన్ని కల్పిస్తున్నాయి.