Guntur News: గుంటూరు యూదుల్ని చంపేయ్యాలని లష్కరే తోయిబా తీవ్రవాదుల ప్రయత్నం
Jews In Guntur: గుంటూరు యూదుల్ని చంపేయాలని లష్కరే తోయిబా తీవ్రవాదుల ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దాన్ని పోలీసులు ఎలా అడ్డుకున్నారు.
Andhra Pradesh: గుంటూరు జిల్లా చేబ్రోలులో 40కిపైగా యూదు కుటుంబాలు ఉన్నాయి. వీరంతా ఇజ్రాయెల్‌కు చెందిన హీబ్రూ జాతి వారిగా భావిస్తుంటారు. వందల ఏళ్ళ క్రితం ఇజ్రాయేల్ నుంచి వలస వచ్చి ఆంధ్ర ప్రాంతంలో సెటిల్ అయిన బెన్నె ఎఫ్రాయిము తెగ వారమని ఇప్పటికీ ఇజ్రాయేల్ పిలుపు కోసం ఎదురు చూస్తున్నామని చెబుతున్నారు. అయితే...ఈ యూదు కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్న సంగతి బయటి ప్రపంచం మరిచిపోయింది. కానీ 2004లో పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాద సంస్థ లష్కరే తోయిబా వీళ్ళను చంపేందుకు ప్రయత్నించింది. అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం సమర్ధవంతంగా ఆ కుట్రను ఛేదించింది.
ఇరాన్, పాలస్తీనాలో తమ వర్గం వారిపై అణిచివేత జరుగుతుంది అంటూ అప్పట్లో ఒక తీవ్రవాద గుంపు ఏపీ చేరుకుంది. సికింద్రాబాద్‌లోని గణేష్ ఆలయంతోపాటు హైద్రాబాద్‌లోని అమెరికన్‌లు, గుంటూరులోని యూదులపై దాడి చేసేందుకు వారు ప్రయత్నాలు ఆరంభించారు. అయితే దానిని పసిగట్టిన నిఘా సంస్థలు ముందుగానే వారిలో చాలామందిని అరెస్టు చేశారు.
2004 ఆగష్టు 29న జరిగిన ఈ అరెస్టుల్లో మొత్తం 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకోగా ఏడుగురు తప్పించుకున్నట్టు మీడియా రిపోర్ట్ చేసింది. LET నాయకుడు అబ్దుల్‌కి ఏజెంట్‌గా పని చేస్తున్న నసీరుద్దీన్ సహా ఒక టెర్రరిస్టు గుంపును పట్టుకున్నట్టు నాటి హైదారాబాద్ పోలీస్ కమిషనర్ RP సింగ్ చెప్పారు. ఈ అరెస్టుల్లో పేలుడు పదార్థాలతో పాటు, అమ్మోనియం నైట్రేట్ 5కిలోల సిలెండర్, చాకు, రివాల్వర్, ఒక కారు, 4 బైకులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ అరెస్టులపై నాటి హోంమంత్రి జానారెడ్డి మాట్లాడుతూ అన్ని ఆధారాలు సేకరించాకే ఈ అరెస్టులు జరిగినట్టు చెప్పారు. ఈ కుట్ర బయటపడిన వెంటనే గుంటూరు పోలీసులకు హైదారాబాద్ డీఐజీ ఆఫీస్ సమాచారం ఇస్తే...అలాంటి యూదులు ఎవరూ లేదని మొదట చెప్పారు. కానీ విచారిస్తే వందల ఏళ్లు నుంచి చేబ్రోలులో నివశిస్తున్న యూదుల సంగతి బయటపడిందని చెబుతున్నారు.
యూదులకూ ముస్లింలకూ గొడవేంటి...? ......
వందల ఏళ్ల నుంచి జెరూసలేమ్ మాదంటే మాదని యూదులు, క్రిస్టియన్లు, ముస్లింలు గొడవడుతున్నారు. ముగ్గురికీ మూల పురుషుడు అబ్రహాం అనే చెప్పుకుంటారు. వెయ్యేళ్ళ క్రితం నుంచి క్రూసేడుల పేరుతో ఆయా వర్గాల మధ్య మారణ హోమం జరిగింది. ఆ వైరుధ్యాలు ఇప్పటికీ ఉన్నాయి. జీవితకాలంలో ఒక్క యూదుడిని చంపినా మోక్షం లభిస్తుంది అని ముస్లిం తీవ్రవాద సంస్థలు బోధిస్తుంటాయి. ఆ కోవలోనే గుంటూరు యూదులపై దాడికి ప్రయత్నం చేసింది లష్కరే తోయిబా. ఈ ఘటన తర్వాత గుంటూరు యూదుల సంగతి బయటి ప్రపంచానికి తెలియడంతోపాటు వారి రక్షణకు పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వీళ్లు మాత్రం తమ దేవుడే తమను నాటి టెర్రరిస్టు దాడి నుంచి కాపాడాడని చెబుతున్నారు.
ఇజ్రాయెల్‌కు చెందిన యూదులు గుంటూరు ఎలా వచ్చారు? ...
క్రీ.శ. 700 ప్రాంతంలో యుద్ధాల వల్ల చెదిరిపోయిన యూదు తెగల్లో బెన్ ఎఫ్రాయిం శాఖకు చెందిన వారు కశ్మీరు, తెలంగాణ మీదుగా అమరావతి చేరుకున్నారు. అక్కడ ఒక ప్రార్థన మందిరం సినగోగు నిర్మించుకున్నారు. దాని వివరాలు అమరావతి మ్యూజియంలో నేటికీ ఉన్నాయని యూదు రబ్బీ సాదోకు యాకోబీ చెబుతున్నారు. తర్వాత కాలంలో గుంటూరు సమీపంలోని చేబ్రోలులో స్థిరపడ్డామని మొదట్లో 120 కుటుంబాలు వరకూ ఉన్న యూదులు ప్రస్తుతం 40 కుటుంబాలకు చేరుకున్నాయని చెబుతున్నారు . ఇజ్రాయెల్ ప్రభుత్వం పిలుపు కోసం ఎదురుచూస్తున్నట్టు చెప్పిన యాకోబి వారి పిలుపు రాగానే వెళ్ళిపోతామని అన్నారు.