Viveka Murder Case: సీబీఐ విచారణకు వచ్చి వెనక్కి వెళ్లిపోయిన భాస్కర్ రెడ్డి, ఎల్లుండి ఆ ఇద్దర్నీ అదుపులోకి తీసుకొనే ఛాన్స్?
నేడు విచారణకు హాజరు కావాలని భాస్కర్ రెడ్డికి గతంలో నోటీసు అందింది. ఆ ప్రకారం భాస్కర్ రెడ్డి విచారణకు కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌజ్‌కు వచ్చారు.
వివేకానంద హత్య కేసులో నేడు విచారణకు హాజరు కావాల్సిన వైఎస్ భాస్కర్ రెడ్డి విచారణకు వచ్చి వెనుదిరిగారు. విచారణ చేయాల్సిన సీబీఐ అధికారి లేకపోవడంతో ఆయన తిరిగివెళ్లిపోయారు. నేడు విచారణకు హాజరు కావాలని భాస్కర్ రెడ్డికి గతంలో నోటీసు అందింది. ఆ ప్రకారం భాస్కర్ రెడ్డి విచారణకు కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌజ్‌కు వచ్చారు. దీంతో మంగళవారం రోజు భాస్కర్ రెడ్డిని, అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించనున్నట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. విచారణ తేదీని సీబీఐ అధికారులు మళ్లీ తెలియజేస్తామని చెప్పారని తెలిపారు. హత్య జరిగిన స్థలంలో దొరికిన లేఖపై సీబీఐ ఎందుకు విచారణ చేపట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. మీ కుమారుడు అవినాష్ రెడ్డితో పాటు మిమ్మల్ని కూడా అదుపులోకి తీసుకుంటామంటూ సీబీఐ తరఫున న్యాయవాది తెలంగాణ హైకోర్టుకు తెలియజేసిన అంశాన్ని మీడియా ప్రతినిధులు అడగ్గా.. తాము దేనికైనా సిద్ధమని భాస్కర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
భాస్కర్ రెడ్డిని సీబీఐ ఏడాది కిందట వరుసగా రెండు రోజులపాటు పులివెందులలో విచారణ చేసింది. సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి విచారణకు పిలిచింది. మరోవైపు భాస్క ర్‌రెడ్డి రాకతో కడప జైలు వద్ద భారీగా పోలీసులను మోహరించారు.
రేపు విచారణకు అవినాష్ రెడ్డి రిట్ పిటిషన్
మరోవైపు, రేపు అవినాష్ రెడ్డి రిట్ పిటిషన్ పై హైకోర్టు లో విచారణ జరగనుంది. అవినాష్ రెడ్డిని విచారణ చేసిన సమయంలో రికార్డ్ చేసిన ఆడియోలు, వీడియోలను రేపు (మార్చి 13) హార్డ్ డిస్క్ లో కోర్ట్ ముందు సీబీఐ అధికారులు ఉంచనున్నారు. కేసు డైరీ ని కోర్ట్ కి షీల్డ్ కవర్ లో అందజేసేందుకు సీబీఐ సిద్ధంగా ఉంది. ఇప్పటికే అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ఇద్దర్నీ అదుపులోకి తీసుకుంటాం అని సీబీఐ చెప్పింది. ఫిబ్రవరి 24న విచారణలోనే నిర్ణయానికి వచ్చినట్లు సీబీఐ తెలిపింది. దీంతో మంగళవారం విచారణ తరువాత ఇద్దరిని అదుపులోకి తీసుకొనే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.